HEALTH & LIFESTYLE

గుండెకు ‘చలి’ పోటు 

శీతాకాలంలో చాలామందికి చర్మం, జుట్టు సమస్యలు తరుచూ వస్తుంటాయి. కానీ చలితీవ్రత పెరిగితే పెద్ద ప్రమాదమే పొంచి ఉందటున్నారు వైద్యులు. బయటి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నప్పుడు.. (25 డిగ్రీల కంటే తక్కువ) మన బాడీ మనల్ని వెచ్చగా ఉంచేందుకు ప్రయత్రిస్తుంది. దీని కారణంగా BMR (బేసల్ మెటబాలిక్ రేట్) పెరుగుతుంది. ఇది గుండె పని భారాన్ని పెంచుతోంది. చలికాలంలో రక్త నాళాలు సంకోచించడం, రక్తకణాలు గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.

ఉదయాన్నే రక్తంలో ఫైబ్రినోజెన్ లెవల్స్ పెరిగి కరోనరీ ధమనుల్లో రక్తం గడ్డకట్టే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయినప్పుడు శరీరంలోని రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ‘సింపథెటిక్‌ నర్వస్‌ సిస్టమ్‌’ యాక్టివేట్ అవుతుందని వైద్యులు అంటున్నారు. అంటే, గతంతో పోలిస్తే హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇవన్ని హర్ట్‌ఎటాక్‌కు దారితీస్తాయి. రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువై అకస్మాత్తుగా బీపీ పెరిగుతుంది.

రక్తం గడ్డకడితే..

మిగతా రోజులతో పోలిస్తే చలికాలంలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం 14-20 శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తం గడ్డకడితే గుండెకు రక్తసరఫరా తగ్గిపోయి ‘గుండెపోటు’ సంభవిస్తుందని నిపుణులు అంటున్నారు. పనిభారం పెరగడంతో శరీరానికి కావాల్సినంత రక్తాన్ని గుండె పంపింగ్‌ చేయలేదు. ఫలితంగా ఊపిరితిత్తులపై ఒత్తిడి అధికమై ఆయాసంగా అనిపిస్తుంది. ఇన్‌ఫ్లూయంజా, వైరల్‌ ఫీవర్‌ వంటి ఇబ్బందులూ ఎక్కువే. ఈ ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల కూడా గుండెపోటు రావొచ్చు. ఇలా శరీర ఉష్ణోగ్రత మార్పులతో వచ్చే గుండె హృద్రోగాన్ని ‘ఎట్రియల్‌ ఫిబ్రిలేషన్‌’ అంటారు. వీటివల్ల బ్రెయిన్‌స్ట్రోక్‌ కూడా రావొచ్చు. చలికాలంలో ‘వెంట్రిక్యులర్‌ ఎరిక్మియా’ కారణంగా కొన్నిసార్లు హఠాన్మరణాలు సంభవిస్తాయి. హృదయ స్పందన ఒక క్రమపద్ధతిలో కాకుండా.. అకస్మాత్తుగా తగ్గడం.. పెరగడం జరుగుతుంది. దీంతో ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది. దీన్నే ‘సడెన్‌ కార్డియాక్‌ డెత్‌’ అంటారు.

ఎంజైనల్‌ ఎటాక్‌

చాలా మందిలో అధిక రక్తపోటు లక్షణాలు బయటికి కనిపించవు. అందుకే తరచూ బీపీ పరీక్షించుకోవాలి. 25శాతం మందికి ఛాతిలోనొప్పి లేకుండానే గుండెపోటు వస్తుంది. గుండె సమస్యలు వస్తే డాక్టర్‌ సలహా మేరకే మందులు వాడాలి. ఒకసారి గుండెపోటు వస్తే.. వ్యాయామం చేయకూడదనేది అపోహే. చిన్నపాటి ఎక్స్రర్‌సైజ్ చేసుకోవచ్చు. శరీరక శ్రమ చేయనివారైతే రోజూ తక్కువ ఆహారం తీసుకోవాలి. రోజులో ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండటం వల్ల అతిగా తింటుంటారు. ఇంకా మద్యపానం, ధూమపానం అలవాటు ఉంటే బరువు కూడా పెరుగుతారు. దీనివల్ల కొలెస్ట్రాల్‌, ఒబేసిటీ సమస్యలు చుట్టుముడతాయి. శారీరకశ్రమ లేకపోవడంతో రక్తపోటు అధికం అవుతుంది. వీటన్నిటివల్ల ‘ఎంజైనల్‌ ఎటాక్‌’ (గుండె నొప్పి) వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించండి..

చల్లని వాతావరణంలో వాయుకాలుష్యం అధికం. కాబట్టి, చలిబారిన పడకూడదు. చలికాలంలో వచ్చే గుండె జబ్బులపై అవగాహన పెంచుకోవాలి. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.

– చలి తీవ్రత ఎక్కువున్నప్పుడు వ్యాయామం, వాకింగ్‌ చేయ కూడదు. చేసినా, వెచ్చని దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లలేకపోతే.. ఇంట్లోనే చిన్నపాటి వ్యాయామం చేసుకోవడం మంచిది. వ్యాయామానికి ముందు వార్మప్‌ తప్పనిసరి.

– ఇన్‌ఫ్లూయంజా, న్యూమోకోకల్‌ వ్యాక్సిన్లు తీసుకుంటే గుండె జబ్బులున్నవారికి ఇన్‌ఫెక్షన్ల బెడద తగ్గుతుంది.

– గుండె ఆరోగ్యానికి సహకరించే ఆహారం తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినాలి. చేపనూనె మరీ మంచిది. తగినన్ని నీళ్లు తాగాలి. 

Show More
Back to top button