కథకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే తెలుగు చలనచిత్ర రమ్యకృష్ణ రంగంలో కథనాయకుడి ప్రాధాన్యత ఎంత ఉంటుందో, దానికి ధీటుగా ప్రతినాయకుని పాత్ర కూడా అంతే ధీరత్వంతో కూడుకుని ఉంటుంది. కథానాయికనే ప్రతినాయిక పాత్రను పోషిస్తే ఆ చిత్రం అఖండ విజయం సాధిస్తే, ఆ చిత్రం మైలురాయిగా నిలిచిపోతే, ఇలాంటి చిత్రాలు ఇటు ప్రేక్షకులకు, అటు నటులకు తమ మనసులలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకొంటాయి. నరసింహా (తమిళ పడయప్పా) సినిమాలో రజనీకాంత్ కథనాయకుని పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో, ప్రతినాయిక ఛాయలున్న కథానాయిక పాత్రలో అద్భుతమైన అభినయం కనబరచిన రమ్యకృష్ణ కు కూడా అంతే ధీటైన ప్రాధాన్యత కలిగి ఉంది. నువ్వా, నేనా అన్నట్టుగా నటించి ఆ చిత్రం అఖండ విజయానికి దోహదం చేశారు.
గంభీరమైన వాచకంతో మాటలే తూటాల్లా దూసుకువస్తుంటే…? వైవిధ్యమైన ఆహార్యంతో ఏ మాత్రం తీసిపోని పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటే…? అబ్బురపరిచే ఆంగికంతో పాత్రేదైనా, ఘట్టమేదైనా అభినయానికి నిలువుటద్దంలా భావ గంభీర రూపం , వాచకం, హావభావం ఏ పాత్రను అయినా ఇట్టే చేసి మెప్పించగల దిట్ట రమ్యకృష్ణ గారు. ఎర్రబారిన కళ్ళతో, తెలుగు ప్రేక్షకుల మదిలో విలనిజాన్ని ఉన్నత కళగా నిజంగా, విషాదాన్ని విశేషంగా, వినోదాన్ని సశేషంగా పండించగల అభినయ కౌశల్యం రమ్యకృష్ణ గారి సొంతం.
చెన్నైలో జన్మించిన రమ్యకృష్ణ గారు, తమిళనాట ప్రసిద్ధిపొందిన పాత్రికేయులు, విమర్శకులు చో రామస్వామి గారి మేనకోడలు. సహజమైన నటనకు తనకు ప్రతిరూపం. అపూర్వమైన అభినయానికి ఆమె ప్రతిబింబం. అప్పుడే విరిసినట్టుగా అనిపించే కళ్లు, జలతారు మీటినట్టుగా అనిపించే నవ్వు, ప్రేక్షకుల మనసులపై మంత్రంలా ప్రభావం చూపే ప్రత్యేకమైన గొంతు రమ్యకృష్ణ గారి సొంతం. రమ్యకృష్ణ గారు ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన నటించారు. తమిళ చిత్రంతో తెరంగ్రేటం చేసినా, తెలుగుకే పరిమితమైపోయారు.
1985లో వచ్చిన భలే మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించిన తనకు చాలా కాలం వరకూ సరైన అవకాశాలు రాలేదు. ఐరన్ లెగ్ గా ముద్రపడ్డ తాను, అద్భుతమైన విజయం సాధించడానికి 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. ఆ ముద్రను చేరిపేస్తూ 1992లో విడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది.
జీవిత విశేషాలు.
- జన్మ నామం : రమ్య
- ఇతర పేర్లు : రమ్యకృష్ణన్, రమ్యకృష్ణ
- జననం : 15 సెప్టెంబరు 1967
- స్వస్థలం : చెన్నై, తమిళనాడు, భారతదేశం
- తల్లి : మాయా
- తండ్రి : కృష్ణన్
- వృత్తి : నటి
- జీవిత భాగస్వామి : కృష్ణవంశీ
- పిల్లలు : రిత్విక్
నేపథ్యం..
రమ్యకృష్ణ గారు 15 సెప్టెంబరు 1970 నాడు చెన్నైలో జన్మించారు. వీరి తండ్రి కృష్ణన్ మరియు తల్లి మాయా. నిజానికి రమ్యకృష్ణ గారి అసలు పేరు “రమ్య” మాత్రమే. తమిళంలో కూతురు పేరు చివరన తన తండ్రి పేరు, భార్య పేరు చివరన భర్త పేరు కలిపి వ్రాస్తారు. అలా రమ్య పేరు చివరలో తండ్రి కృష్ణన్ పేరు తగిలించారు. అప్పటినుండి రమ్య గారి పేరు రమ్యకృష్ణన్ అయ్యింది. దాంతో అప్పటినుంచి తన పేరు తమిళంలో రమ్యకృష్ణన్ అని, తెలుగులో రమ్యకృష్ణ అని పిలుస్తారు
తనకు వినయ్ కృష్ణ అనే చెల్లెలు కూడా ఉన్నారు. రమ్యకృష్ణ గారు చిన్నప్పుడు చాలా హుషారుగా ఉండేవారు. తను చలాకీతనం, హుషారును గమనించిన తన మామయ్య “చో రామస్వామి” గారి సలహాతో రమ్యకృష్ణ గారి నాన్న గారు తనకు “భరతనాట్యం”, “కూచిపూడి” నేర్పించారు. “చో రామస్వామి” గారు 1955 సంవత్సరంలో తమిళంలో నాటకాలు వేస్తుండేవారు. చో రామస్వామి గారు రమ్యకృష్ణ గారికి ఐదు యేండ్లు వచ్చేనాటికి “చో రామస్వామి” గారు సినిమాలలో పెద్ద హాస్య నటుడి స్థాయికి వెళ్లిపోయారు.
బాల్యం…
నాటకాలలో, నాటికలలో చిన్నపిల్లలు కావాలసి వస్తే చో రామస్వామి గారు రమ్యకృష్ణ గారినే తీసుకెళ్లేవారు. బాబు పాత్రలు ఉన్నా, పాప పాత్రలు ఉన్నా రమ్యకృష్ణ గారితో నటింపజేసేవారు. రమ్యకృష్ణ గారు హుషారుగా ఉంటూ మున్ముందే సంభాషణలు బట్టీబట్టి వేదిక మీద సంభాషణలు చెబుతూ నటించేవారు. 1984లో ఒకరోజు చెన్నైలో గల కళాక్షేత్రంలో రమ్యకృష్ణ గారు భరతనాట్యం ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శనకు దర్శకులు చిత్రాలయ గోపు అనే వ్యక్తి వచ్చారు. తనతో పాటు తన బృందం కూడా అక్కడికి వచ్చారు.
రమ్యకృష్ణ గారి ప్రదర్శన చూసి మెచ్చుకోవడమే కాదు తాను తీయబోయే సినిమాలలో రమ్యకృష్ణ గారిని తీసుకోవచ్చు అని అనుకున్నారు. కొద్ది కాలానికి గోపు “వెల్లై మనసు” అనే సినిమాను తెరకిక్కిస్తూ హీరో వై.జి.మహేంద్రన్ ప్రక్కన కథానాయిక కోసం చాలామంది అమ్మాయిలని ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ ఓ పట్టాన నచ్చలేదు. అయితే తమ బృందం వారు రమ్యకృష్ణ గారు అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. ఓసారి ప్రయత్నించి చూడమని కూడా చెప్పారు. దాంతో రమ్యకృష్ణ గారిని ఒప్పించి వై.జి.మహేంద్రన్ గారితో కలిపి ఫోటోషూట్ కూడా చేశారు.
సినీ నేపథ్యం…
వై.జి.మహేంద్రన్ గారితో రమ్యకృష్ణ గారి ఫోటో షూట్ ఓకే అనుకున్నాక 1984 వ సంవత్సరంలో “వెల్లై మనసు” సినిమాను చిత్రీకరణ జరిపి 01 జనవరి 1985 నాడు ఈ సినిమాను విడుదల చేశారు.
నిజానికి రమ్యకృష్ణ గారు ముందుగా తన మలయాళ చిత్రం “నేరమ్ పులరంబోల్” తో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు.
ఇది తాను నటించిన మొదటి చిత్రం అయినప్పటికీ, ఇది 1986లో ఆలస్యంగా విడుదలైంది. దాంతో ఆమె మొదటి విడుదలయిన చిత్రం వై.జి.మహేంద్రన్ సరసన నటించిన “వెల్లై మనసు” అనే తమిళ చిత్రం.
“వెల్లై మనసు” సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి గార్లు కలిసి నటించిన “కంచుకోట” చిత్రంలో గిరిజన మహిళ పాత్రకు ఎంపికయ్యారు. కానీ ఆ పాత్ర నిడివి తక్కువ ఉండడం, ఆ పాత్రతో పెద్దగా ఉపయోగం లేకపోవడంతో ఎడిటింగ్ లో తీసేశారు. తమిళంలో రాజశేఖర్ గారి దర్శకత్వంలో శివాజీ గణేషన్, రజనీకాంత్, అంబిక గార్లతో పడిక్కదవన్ (1985) సినిమాను తెరకెక్కించారు.
ఆ సినిమాకు నిర్మాతైన రామస్వామి రమ్యకృష్ణ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. దాంతో అతని సిఫారసు మేరకు పడిక్కదవన్ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు.
హాస్య నటులు నగేష్ గారు ఆనంద్ బాబు ని కథనాయకుడు గా పెట్టి “పార్థ జ్ఞాబగం ఇల్లయో” అనే సినిమాను తీశారు. ఇందులో చిన్న పాత్రలో నటించారు రమ్యకృష్ణ గారు. ఈ సినిమా సరిగ్గా ఆడలేదు.
ఈ సినిమా చిత్రీకరణ లో ఉండగానే తన మొదటి తెలుగు చిత్రం “భలే మిత్రులు” లో రెండో కథానాయకగా అవకాశం వచ్చింది. 1986 లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది . ఆ తర్వాత తాను కమల్ హాసన్ తో కలిసి “పెర్ సొల్లుమ్ పిళ్లై” (1987) తమిళ చిత్రంలో సహాయక పాత్ర పోషించారు.
అటు తెలుగులో గాని, తమిళంలో గాని సరైన గుర్తింపు రాలేదు. దాంతో తాను చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ వచ్చారు.
తెలుగులో రమ్యకృష్ణ గారు రాజేంద్రప్రసాద్ గారితో మదన గోపాలుడు (1987), భామ కలాపం (1988) చిత్రాల్లో నటించారు.అస్థులు అంతస్థులు (1988), బావ మరుదుల సవాల్ (1988) లాంటి తెలుగు చిత్రాలలో కూడా నటిస్తూ వచ్చారు. తాను మోహన్‌లాల్ గారితో కలిసి ఓర్క్కప్పురతు , ఆర్యన్ మరియు అనురాగి వంటి మలయాళ చిత్రాలలో పనిచేశారు. సూపర్ స్టార్ విష్ణువర్ధన్ సరసన కృష్ణ, రుక్మిణిలో కథానాయికగా నటించారు.
ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా గారు నటించిన హిందీ చిత్రం “దయావన్”లో రమ్యకృష్ణ గారు చిన్న పాత్రను పోషించారు.
ఇలా ఒక్కో సినిమా చేసుకుంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నారు.
తనకు నటనా ప్రాధాన్యమున్న పాత్ర కోసం వెతుకుతున్న తరుణంలో తెలుగులో “శ్రీదేవి కామాక్షి కటాక్షం” చిత్రంలో పార్వతి దేవి పాత్ర తనకు దక్కింది.
ఆ పాత్రలో రమ్యకృష్ణ గారు ఒదిగిపోయిన తీరును అబ్బురపడిన దర్శకులు ఆ సినిమాలో కామాక్షి పాత్రలో కూడా రమ్యకృష్ణ గారి తోనే అభినయింపజేశారు. మామూలుగానే చిన్నప్పటి నుండి రమ్యకృష్ణ గారికి భరతనాట్యం లో ప్రావీణ్యం ఉండడంతో సంకీర్తన సినిమాలో నాగార్జున గారికి జోడిగా తీసుకున్నారు. కానీ ఆ సినిమా బాగా ఆడలేదు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి “చక్రవర్తి” సినిమాలో చిరంజీవి గారికి చెల్లెలుగా రమ్యకృష్ణ గారిని నటింపజేశారు. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది.
దర్శకేంద్రుని చిత్రాలతో తారాపథం లోకి...
తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ వరుస పరాజయాల తర్వాత 1989 వ సంవత్సరంలో రమ్యకృష్ణ గారు, కె.విశ్వనాథ్ గారి చిత్రం “సూత్రధారులు” లో నటించారు.
ఏఎన్నార్, సుజాత, భానుచందర్ గార్లతో కలిసి నటించిన ఈ చిత్రంలో “సీతాలు” అనే పాత్రలో రమ్యకృష్ణ గారు ఒదిగిపోయారు. 1989లో వచ్చిన ఈ “సూత్రధారులు” అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం రావడంతో పాటు రమ్యకృష్ణ గారి పేరు అక్కడక్కడ వినిపించసాగింది.
“సూత్రధారులు” షూటింగ్ జరుగుతున్న సమయంలో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకేంద్రులు కె.రాఘవేంద్రరావు గారు శోభన, మోహన్ బాబు లతో “అల్లుడుగారు” సినిమా తీస్తున్నారు. అందులో రెండో కథనాయకగా “రేవతి” పాత్ర కోసం వెతుకుతున్నారు.
పాత్ర యొక్క నిడివి తక్కువే అయినా అది కీలకమైన పాత్ర. అందులో భరతనాట్యం నేర్చుకునే మూగమ్మాయి గా నటించారు. 1990 జూలై లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు రమ్యకృష్ణ గారికి వరుసగా అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. “అల్లరి మొగుడు” (1992), మేజర్ చంద్రకాంత్ (1993), అల్లరి ప్రియుడు (1993), ముగ్గురు మొనగాళ్లు (1994), ముద్దుల ప్రియుడు (1994), అల్లరి ప్రేమికుడు (1994), రాజసింహ (1995), ఘరానా బుల్లోడు (1995) వంటి సినిమా లలో వరుస అవకాశాలు ఇవ్వడంతో రమ్యకృష్ణ గారు తన కెరీర్ లో వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. దాగుడుమూతల దాంపత్యం, ఇద్దరూ ఇద్దరే, బలరామకృష్ణులు, బృందావనం, కిరాయి గుండా, బంగారు బుల్లోడు, జైలరు గారి అబ్బాయి, ఆయనకిద్దరు లాంటి చిత్రాలలో నటించి అగ్ర కథానాయిక స్థాయికి వెళ్లిపోయారు.
రమ్యకృష్ణ గారు ఒకవైపు తెలుగు చిత్రాలలో నటిస్తూనే హిందీ చిత్రసీమలో కూడా తన అభినయంతో ఆకట్టుకున్నారు. తాను యష్ చోప్రా చిత్రం పరంపర (1993) తో హిందీ చిత్రాలలో హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. సుభాష్ ఘయ్ చిత్రం ఖల్నాయక్ (1993), మహేష్ భట్ యొక్క చాహత్ (1996), డేవిడ్ ధావన్ చిత్రం “బనారసి బాబు” (1997), బడే మియాన్ చోటే మియాన్ (1998)తో పాటు అమితాబ్ బచ్చన్ మరియు గోవిందాతో సహా మరికొన్ని హిందీ చిత్రాలలో తాను నటించడంతో బాటు మిథున్ చక్రవర్తి యొక్క “శపథ్” కూడా నటించారు.
పేరు, ప్రతిష్టలు తెచ్చిన “అమ్మోరు”..
దర్శకేంద్రుని చిత్రాలతో కథనాయికగా నిలదొక్కుకున్న రమ్యకృష్ణ గారు, కె.రాఘవేంద్ర రావు గారి తరువాత ఇ.వి.వి సత్యనారాయణ గారి సినిమాల్లో ఎక్కువగా నటించారు.
తెలుగులో తీరిక లేనంత బిజీ అయిపోయిన రమ్యకృష్ణ గారు తమిళంలో అవకాశాలు వచ్చినా కూడా డేట్లు సర్దుబాటు చేయలేకపోయేవారు.
గ్లామర్ తారగా తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న తన ప్రస్థానాన్ని 1994 వ సంవత్సరం మలుపు తిప్పింది. అదే అమ్మోరు (1994) చిత్రం. తెలుగు సినిమాకు అప్పుడప్పుడే గ్రాఫిక్స్ అద్దడం మొదలవుతున్న సమయంలో తనకు మరో మలుపు తిరిగే పాత్ర దొరికింది.
జులై 1992లో తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లిలో చిత్రీకరణ ప్రారంభమైన అమ్మోరు చిత్రానికి ముందుగా వై.రామారావును దర్శకుడిగా తీసుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ఆశపడ్డ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వై.రామారావు గారి దర్శకత్వంతో సంతృప్తి చెందలేదు. దాంతో వై.రామారావు గారి స్థానంలో కోడి రామకృష్ణ గారిని దర్శకుడిగా తీసుకున్నారు. ఛాయాగ్రహాక బాధ్యతలు తీసుకున్న విజయ్ సి. కుమార్, గ్రాఫిక్స్ సంబంధిత షాట్‌ల కోసం బ్లూ మ్యాట్‌ని ఉపయోగించారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి “లిన్ వుడ్” బాధ్యతలు తీసుకున్నారు. ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేయడానికి మూడు సంవత్సరాలు పట్టింది. బడ్జెట్ 1.8 కోట్ల ఖర్చు అయ్యింది. 1995 లో విడుదలైన “అమ్మోరు” చిత్రం అద్భుతమైన విజయం సాధించి టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది.
కోడి రామకృష్ణ గారి ప్రతిభ, శ్యాంప్రసాద్ రెడ్డి గారి నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ అమ్మోరు గా రమ్యకృష్ణ నటన కట్టిపడేశాయి. రాముడిగా, కృష్ణుడిగా ఎన్టీఆర్ గారు ఎలాగో అమ్మరు గా రామకృష్ణ తప్ప మరే కథానాయిక చేయలేదు అన్నంతగా ఆ పాత్రలో లీనమై నటించారు.
నరసింహా లో “నీలాంబారి” గా…
దాసరి గారి దర్శకత్వంలో వచ్చిన “కంటే కూతుర్నే కను”, రాఘవేంద్రుని దర్శకత్వంలో వచ్చిన “అన్నమయ్య” లో తిమ్మక్క గానూ మంచి నటన కనబరిచారు. తమిళ సినిమా నుండి నాలుగు సంవత్సరాల విరామం తర్వాత, 1999లో రమ్యకృష్ణ గారు, రజనీకాంత్ సరసన “పడయప్ప” తెలుగులో నరసింహా గా వచ్చిన ఈ సినిమాలో ప్రతినాయిక పాత్రలో నటించారు. ఈ సినిమాలో నీలాంబరిగా తాను ప్రదర్శించిన నటన అయితే అద్భుతమనే చెప్పాలి. ఈ పాత్రను తాను తప్ప మరెవ్వరు కూడా చేయలేరు అనే విధంగా రజినీకాంత్ గారితో పోటీపడి మరీ నటించారు.
నీలాంబరి పాత్రను ప్రతీ హీరోయిన్ తన జీవితంలో ఒక్కసారైనా పోషించాలని కలలు కంటుంది. అందుకే నీలాంబరి పాత్రను ప్రతీ ఒక్క కథానాయిక ప్రేరణగా తీసుకుంటారు. ఒక్క “నీలాంబరి” పాత్ర చాలు రమ్యకృష్ణ గారు తన జీవితాంతం చెప్పుకోవడానికి. అలాంటి పాత్రలను తాను చాలానే పోషించారు. ఆ చిత్రానికి తాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను అందుకున్నారు. ఆ తర్వాత తాను బడ్జెట్ పద్మనాభనం మరియు పంచతంత్రం వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలలో నటించారు. రమ్య రాజకాళి అమ్మన్ (2000), నాగేశ్వరి (2001), శ్రీ రాజ రాజేశ్వరి (2001) మరియు అన్నై కలిగంబల్ (2003) వంటి అనేక భక్తి చిత్రాలలో కూడా రమ్యకృష్ణ గారు నటించారు.
బాహుబలి లో “శివగామి” గా…
తొలిత సినిమాలు బాగా ఆడక ఐరన్ లెగ్ గా ముద్ర పడిపోయిన రమ్యకృష్ణ నుండి గోల్డెన్ రమ్యకృష్ణ వరకు ఎదిగిన తన నట ప్రస్థానం అనితర సాధ్యమనే చెప్పాలి.
2001 నుండి బడ్జెట్ పద్మనాభం, మా అల్లుడు వెరీ గుడ్, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ లాంటి సినిమాలలో రెండవ కథనాయికగా నటించారు రమ్యకృష్ణ గారు. 2002లో వచ్చిన సింహాద్రి సినిమాలో ఐటెం సాంగ్ లో కూడా నటించారు.
నా అల్లుడు సినిమాలో మోడరన్ అత్తగా, తులసి సినిమాలో డాక్టర్ సురేఖగా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో హీరో అమ్మగా నటించారు.
2015 లో రమ్యకృష్ణ గారు రాజమౌళి గారి దర్శకత్వంలో బాహుబలి: ది బిగినింగ్ మరియు దాని సీక్వెల్ బాహుబలి: ది కన్‌క్లూజన్‌లో నటించారు. అందులో తాను రాజమాత శివగామి దేవిగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు.
బాహుబలి చిత్రాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చలనచిత్రాలుగా నిలిచిపోయాయి. తాను బాహుబలి రెండు చిత్రాలకు ఉత్తమ సహాయ నటిగా (తెలుగు) ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.
రమ్యకృష్ణ గారు బాహుబలి లో నటించకపోయి ఉంటే ఏదో తప్పు జరిగిందని భావించేవారు రాజమౌళి గారు.
ఆ తరువాత సోగ్గాడే చిన్నినాయనలో నాగార్జున గారికి జోడీగా సాఫ్ట్ గా నటించిన రమ్యకృష్ణ గారు శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో శివంగిలా రెచ్చిపోయారు. ఆ తర్వాత “లైగర్” లో విజయ్ దేవరకొండకు తల్లిగా, దేవ్ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన “రిపబ్లిక్” చిత్రంలో విశాఖవాణి గా నటించిన రమ్యకృష్ణ గారు ఇప్పుడు అందరి దర్శకులకు మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రసిద్ధిచెందారు.
30 ఏళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ భాషలలోనే కాకుండా, మలయాళ, హిందీ చిత్రసీమ ప్రేక్షకులకు కూడా రమ్యకృష్ణ గారి నటన అంటే ఎంతో ఇష్టం, అంతగా తాను పాత్రలో మమేకమైపోయారు.
పరిచయం.. ప్రణయం… పరిణయం..
విభిన్న మసత్వత్వాల మధ్య విలక్షణ ప్రణయ గాథ తో, విశిష్ట పరిణయ బంధంతో ఒక్కటైన తీరు అద్భుతం అని చెప్పాలి. అందంతో, నటనతో ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగల అగ్ర కథానాయిక రమ్యకృష్ణ గారు. ఇక సినిమా కోసం ప్రాణం ఇచ్చే అంత నిబద్ధత కలిగివున్న దర్శకులు కృష్ణవంశీ గారు. దర్శకుడిగా కృష్ణవంశీ గారికి మొదటి సినిమా గులాబీ. ఈ సినిమా వసూళ్ల పరంగా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో “మేఘాలలో తేలిపొమ్మన్నది” అనే పాట చిత్రీకరణ విధానం ఎంతో మందిని ఆకట్టుకుంది. చివరికి నటి రమ్యకృష్ణ గారికి కూడా చాలా బాగా నచ్చింది.
ఈ పాట తీసిన దర్శకుడు ఎవరు? అని రమ్యకృష్ణ గారు ఆరాతీశారు. తీసింది ఒక నూతన దర్శకులు కృష్ణవంశీ గారు అని తెలియగానే బ్రహ్మానందం గారి సిఫారసుతో కృష్ణవంశీ గారిని రమ్యకృష్ణ గారు కలిశారు.
అలా కలిసిన వీరు ముందు స్నేహితులు అయ్యారు. 1998 సంవత్సరంలో కృష్ణవంశీ గారు “చంద్రలేఖ” తీస్తున్నప్పుడు రమ్యకృష్ణ, కృష్ణవంశీ గార్ల మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది.
చివరికి 2003లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి రిత్విక్ వంశీ కొడుకు కూడా ఉన్నాడు.
పెళ్లి తరువాత కూడా నటనను కొనసాగిస్తూ గారు గుణ చిత్ర నటులుగా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.
పురస్కారాలు…
★ 1998 వ సంవత్సరానికి గాను “కంటే కూతుర్నే కను” చిత్రానికి ప్రత్యేక జ్యూరీ నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు.
★ 1999 వ సంవత్సరంలో పడయప్ప తమిళ చిత్రంలో తన అద్భుతమైన నటనకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర ప్రత్యేక బహుమతి దక్కించుకున్నారు.
★ 1999 వ సంవత్సరంలో “పడయప్ప” తమిళ చిత్రంలో తన నటనకు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి (తమిళం) పురస్కారం అందుకున్నారు.
★ 2009 సంవత్సరంలో 57వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ నుండి “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” తెలుగు సినిమాకు ఉత్తమ సహాయ నటి పురస్కారం చేజిక్కించుకున్నారు.
★ 2009 సంవత్సరంలో రాజు మహారాజు తెలుగు చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటి నంది పురస్కారం పొందారు.
★2015 వ సంవత్సరంలో “బాహుబలి: ది బిగినింగ్” చిత్రంలో అమోఘమైన నటన ప్రదర్శించినందుకు గాను “ఉత్తమ సహాయ నటి” గా నంది పురస్కారం గెలుచుకున్నారు.
★ 2015 వ సంవత్సరంలో “ఆనంద వికటన్” సినిమా అవార్డులలో భాగంగా “బాహుబలి: ది బిగినింగ్” చిత్రంలో తన నటనకు ఉత్తమ సహాయ నటి గా పురస్కారం అందుకున్నారు.
★ 1వ IIFA ఉత్సవం 2015 వ సంవత్సరంలో “బాహుబలి: ది బిగినింగ్” తెలుగు చిత్రంలో తన నటనకు ఉత్తమ సహాయ నటి గా పురస్కారం పొందారు.
★ 2015 వ సంవత్సరంలో 1వ IIFA ఉత్సవం పురస్కారాలలో భాగంగా “బాహుబలి: ది బిగినింగ్” తమిళ చిత్రంలో తన నటనకు ఉత్తమ సహాయ నటి గా పురస్కారం గెలుపొందారు.
★ 2015 వ సంవత్సరంలో 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ విభాగంలో “బాహుబలి: ది బిగినింగ్” తెలుగు చిత్రంలో తన నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా పురస్కారం దక్కించుకున్నారు.
★ 2017 వ సంవత్సరంలో 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ విభాగంలో బాహుబలి: ది కన్‌క్లూజన్ తెలుగు చిత్రంలో నటించినందుకు గాను ఉత్తమ సహాయ నటి గా పురస్కారం అందుకున్నారు.
★ 2017 వ సంవత్సరంలో “బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్” పురస్కారాలలో భాగంగా బాహుబలి: ది కన్‌క్లూజన్ తెలుగు చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా పురస్కారాన్ని పొందారు.
★ 2019 వ సంవత్సరంలో సూపర్ డీలక్స్ అనే తమిళ సినిమాలో నటనకు గాను “జీ సినీ అవార్డ్స్” ఉత్తమ సహాయ నటి – స్త్రీ పురస్కారం చేజిక్కించుకున్నారు.
★ 2019 వ సంవత్సరంలో సూపర్ డీలక్స్ అనే తమిళ సినిమాలో నటనకు గాను “ఆనంద వికటన్” సినిమా పురస్కారాల తరుపున ఉత్తమ సహాయ నటి – స్త్రీ పురస్కారం దక్కించుకున్నారు.