Telugu Cinema

అజరామర ప్రేమకు మరణం లేని అంతిమ మజిలీ. దేవదాసు (1953).

నిజమైన ప్రేమ అజరామరమైనది. అది ఎప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుంది. ప్రేమంటే కేవలం స్త్రీ, పురుషుల మధ్య వుండే శారీరక ఆకర్షణ మాత్రమే కాదు, దానికి అతీతమైన ఓ మానసిక బంధమనేది కూడా వుందని ఎన్నో ప్రేమ కథలు తెలియజేశాయి. అలాంటి ప్రేమ కథలలో “దేవదాసు” ఒకటి. నిజమైన ప్రేమ మనిషి వినాశనాన్ని కోరుకోదు కదా. మరి దేవదాసు విషయంలో ఇలా ఎందుకు జరిగింది? అన్న తర్కం చాలా కాలంగా వుంది.

దేవదాసు ఓ భగ్న ప్రేమికుడు. కట్టుబాట్లని ఎదురించి ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోలేని పిరికివాడు. మందు మత్తులో మునిగి తేలి మరణించిన చేతగాని వాడు. అలాంటి చేతగాని వాడు ప్రపంచానికి ఎందుకు నచ్చాడు. అంటే ఆ కథలో ఎదో ప్రత్యేకత ఉంది. ఆ కథకి కట్టిపడేసే శక్తి ఉంది.

శరత్ చంద్ర గారు 16 సంవత్సరాల వయస్సులో నవల వ్రాసి శిశువు అనే ఒక లిఖిత మాస పత్రిక లో వేశారు. తాను ఒకసారి ఆ మాస పత్రిక లో వచ్చిన నవల చదివి నచ్చక, తాను వ్రాసిన నవలను తన మిత్రుడు శౌరేంద్ర ముఖర్జీ ఇంట్లో ఇనుప పెట్టేలో పెట్టి వుంచారు.

అలా వ్రాసిన ప్రతీ నవలను తన ఇంట్లో నే భద్రపరిచేవారు. తన మిత్రుడు శౌరేంద్ర ముఖర్జీ 1901 లో శరత్ చంద్ర కు తెలీకుండానే పత్రికలకు పంపించి ముద్రణ వేయించారు. అప్పటికీ శరత్ చంద్ర వయస్సు 25 సంవత్సరాలు. అది పుస్తక రూపం దాల్చటానికి మరో ఏడు సంవత్సరాలు పట్టింది. అంటే శరత్ చంద్ర 16 సంవత్సరాల వయస్సులో వ్రాస్తే 32 సంవత్సరాల వయస్సులో పుస్తకరూపం లోకి వచ్చేసింది. అదే “దేవదాసు” నవల.

భారతదేశ సాహిత్యం లో రచయితలు పదిహేను సంవత్సరాల తరువాత చూసే అంశాలని బెంగాళీ సాహిత్యకారులు ఈ రోజే చూస్తారట. శరత్ చంద్ర నవలలు, తెలుగు వారిని బెంగాళీలను విడదీయలేనంతగా అల్లుకుపోతాయి. నిజానికి దేవదాసు ఒక గొప్ప కలం నుండి పుట్టాడు. నాటి నుండి నేటి వరకు వెండితెర మీద వెలుగుతూనే ఉన్నాడు.

సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ ఏ ముహూర్తాన దేవదాసు నవల వ్రాశాడోగాని మొత్తం అందరి మనసు దాని చుట్టూనే తిరిగింది. 1928 నుంచి ఇప్పటివరకు దేవదాసు ప్రేమ వెండి తెర పై పదే పదే ఊపిరి పోసుకుంటూనే ఉంది. దేవదాసును ప్రతి చిత్ర పరిశ్రమ పోటీపడి ప్రేమించింది.

ఎట్టకేలకు తెలుగు వారి వంతు వచ్చింది. భగ్న ప్రేమికుల కథ, హీరో చచ్చిపోవడం. దీనిని తట్టుకునే శక్తి ప్రేక్షకులకు లేదేమోనని ఎంతమంది చెప్పినా నిర్మాత డి.యల్.నారాయణ గారు ఒప్పుకోలేదు. సినిమా తీసి చూపించారు. మన దేశంలో బెంగాలీ, హిందీ, అస్సామీ, మలయాళం, తెలుగు భాషల్లోనే కాదు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా దేవదాసు కథ తెరకెక్కింది.

నాటి మన సినిమాకి ముందు తర్వాత కలుపుకుని మొత్తం 12 సార్లు దేవదాసు కథ సినిమాగా కార్యరూపం దాల్చింది. అయితే వీటన్నింటి లోనూ ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన సినిమాల్లో వేదాంతం రాఘవయ్య గారు తెరకేక్కించిన తెలుగు దేవదాసు మాత్రమే.

చిత్ర విశేషాలు…

దర్శకత్వం    :    వేదాంతం రాఘవయ్య

నిర్మాణం     :    డి.యల్.నారాయణ

కథ              :    శరత్ చంద్ర 

సంభాషణలు   :    సముద్రాల రాఘవాచార్య

తారాగణం   :       అక్కినేని నాగేశ్వరరావు (దేవదాసు),

సావిత్రి (పార్వతి),

యస్.వీ.రంగారావు (జమీందారు నారాయణ రావు),

చిలకలపూడి సీతారామాంజనేయులు (జమీందారు భుజంగ రావు),

లలిత (చంద్రముఖి) ,

దొరైస్వామి (నీలకంఠం),

ఆరణి సత్యనారాయణ (ధర్మన్న),

శివరాం పేకేటి (భగవాన్),

ఆర్.నాగేశ్వరరావు ,

సీతారామ్ (బండివాడు),

కంచి నరసింహారావు

సంగీతం    :   సి.ఆర్.సుబ్బురామన్, విశ్వనాథన్ – రామమూర్తి

నేపథ్య గానం    :    జిక్కి కృష్ణవేణి,

కె.రాణి,

రావు బాలసరస్వతీదేవి,

ఘంటసాల వెంకటేశ్వరరావు

గీతరచన      :     సముద్రాల రాఘవాచార్య 

ఛాయాగ్రహణం   :   బి.యస్.రంగా

నిర్మాణ సంస్థ   :   వినోదా పిక్చర్స్

కళ     :     వాలి,

ఘోడ్‌గావంకర్

అలంకరణ     :     మంగయ్య

కూర్పు       :        పి.వి.నారాయణ

విడుదల తేదీ   :     26 జూన్ 1953

భాష        :      తెలుగు

చిత్ర కథ…

కథనాయకుడు దేవదాసు (అక్కినేని నాగేశ్వరరావు ) రావులపల్లి జమీందారు నారాయణ రావు (యస్.వీ.రంగారావు) గారి ద్వితీయ పుత్రుడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన కథానాయకి పార్వతి (సావిత్రి), దేవదాసులు చిన్ననాటి నుండి స్నేహితులు. పార్వతి చిన్నతనం నుండే దేవదాసు మీద నోరు పారేసుకోవటం, దేవాదాసు పార్వతిని దండించటం పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. చదువు పట్ల శద్ధ చూపకుండా అల్లరి చిల్లరగా తిరిగే దేవదాసుని చూసి అన్న లాగా జూదవ్యసనుడౌతాడన్న భయంతో, పై చదువుల కోసం జమీందారు తనని పట్నం ( మద్రాసు) పంపుతాడు. చదువు పూర్తి చేసుకొన్న దేవదాసు తిరిగి ఇంటికి వస్తాడు.

యుక్తవయసుకి మళ్ళిన ఇరువురి మధ్య చనువుని చూసి సంతోషించిన పార్వతి తండ్రి పెళ్ళి గురించి మాట్లాడటానికి దేవదాసు ఇంటికి వెళతారు. ఆస్తి, కులం తక్కువ అని వారిని జమీందారు గారు పార్వతి తండ్రిని అవమానపరుస్తారు. తండ్రిని ఒప్పించడంలో దేవదాసు విఫలుడౌతాడు. తనని చంపి దేవదాసు ఇష్టం వచ్చినట్టు చేసుకొనవచ్చునన్న తన తండ్రి బెదిరింపుకి దేవదాసు లొంగిపోతాడు. ఆ రాత్రే దేవదాసుని ఒంటరిగా కలుసుకొన్న పార్వతికి తాను తల్లిదండ్రులని ఎదిరించి పెళ్ళి చేసుకోలేనని చెబుతాడు. దేవదాసు పాదాల వద్ద చోటిస్తే, ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొనటానికి సిద్ధమన్న పార్వతి మాటలకి కొంత సమయం కోరుతాడు దేవదాసు. ఆ తర్వాతి రోజునే దేవదాసు పార్వతికి చెప్పకుండా పట్నం బయలుదేరి వెళ్ళిపోతాడు.

జమీందారు వద్ద మాట పడ్డ పార్వతి తండ్రి అంతకన్నా మంచి సంబంధం తెచ్చుకోగలమని భార్యని పోగొట్టుకొని, పిల్లలు గల నలభై ఏళ్ళ దుర్గాపురం ఊరి జమీందారు భుజంగరావు (సి.యస్.ఆర్. ఆంజనేయులు) తో సంబంధం కుదుర్చుకొని వస్తాడు. తనని మరచిపొమ్మని దేవదాసు అది వరకే పంపిన ఉత్తరంతో పార్వతి ఆ వివాహనికి ఒప్పుకొంటుంది. పార్వతిని మరచిపోలేని దేవదాసు తిరిగి ఊరి బాట పడతాడు.

కానీ అప్పటికే పార్వతి పెళ్ళి వేరొకరితో నిశ్చయం అయిపోయినదని తెలుసుకొని భగ్నహృదయుడౌతాడు. పార్వతిని మరచిపోవటానికి విఫల యత్నాలు చేస్తున్న దేవదాసుకి సరదాగా స్నేహితుడు భగవాన్ (శివరాం పేకేటి) మద్యాన్ని ఇస్తాడు. భగవాన్ వారిస్తున్ననూ దేవదాసు తాగుడుకి బానిసవుతాడు. ఊరికి వచ్చిన దేవాదాసుని పార్వతి కలిసి తనతో పాటే తన ఊరు రమ్మంటుంది. పోయేలోపు ఒకసారి వస్తానని వాగ్దానం చేస్తాడు దేవదాసు.

చంద్రముఖి (లలిత) అనే వేశ్యతో భగవాన్ ద్వారా దేవదాసుకి పరిచయం అవుతుంది. పార్వతి పట్ల దేవదాసుకి ఉన్న ప్రేమని చూసి చలించిపోతుంది. దేవదాసుకు ఇష్టం లేకపోవటంతో తన వేశ్యావృత్తిని త్యజించి, దేవదాసునే పూజిస్తూ అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. తన పట్ల అంతటి మమకారాన్ని పెంచుకొన్న చంద్రముఖిని దేవదాసు అభిమానించటం మొదలు పెడతాడు. కానీ ఈ జన్మకి మాత్రం తాను ప్రేమ, పెళ్ళిళ్ళకి దూరమని తెలుపుతాడు.

మితి మీరిన తాగుడు వలన కాలం గడిచే కొద్దీ దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది. ఇది తెలిసిన తండ్రి మరణిస్తాడు. అన్న దేవదాసుకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా జాగ్రత్తపడతాడు. మరణించే లోపు ఒక్కసారైనా పార్వతిని చూడాలని పార్వతి మెట్టిన ఊరికి దేవదాసు బయలుదేరతాడు. పార్వతి ఇంటి వద్దనే తనని చూడకనే మరణిస్తాడు. మరణించినది దేవదాసే అని తెలుసుకొని పార్వతి కూడా అతనిని చూడకనే మరణించటంతో కథ ఖేదాంతం అవుతుంది.

కథకు మూలం బెంగాలీ దేవదాసు నవల..

బెంగాలీ సాహిత్యంలో అగ్రగామి అయిన శరత్ చంద్ర చటోపాధ్యాయ గారి రచనలలో ఒకటైన దేవదాసు (1917) నవల నుండి కథను తీసుకున్నారు. శరత్ చంద్ర చటోపాధ్యాయ ఆనాటి సమాజం లోని అనేక అంశాలను , మధ్యతరగతి జీవితాలను నవలలు గా మలుస్తూ దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. శరత్ చంద్ర స్త్రీల గురించి చాలా గొప్పగా వ్రాశారు. పితృస్వామ్య సమాజంలో వారి పరిస్థితి గురించి స్పష్టంగా మరియు నిజాయితీగా వివరించారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా తాను తన నిరసనను తెలియజేశారు. తాను వ్రాసిన నవలల ఆధారంగా 44 సినిమాలు వివిధ భాషల్లో రూపొందాయి.

మతం పేరుతో జరుగుతున్న అన్యాయాలు, మూఢ నమ్మకాల గురించి కుండ బ్రద్దలు కొట్టినట్లు తన నవలలలో వ్రాశారు. తన మొదటి నవల “బడదిది”, పాఠకులలో బాగా ప్రాచుర్యం పొందింది. “బిందుర్ ఛెలే”, “పరిణిత”, “బైకుంతేర్ విల్”, “దేవదాస్”, “శ్రీకాంత”, “చరిత్రహిన్” తన ఇతర ప్రసిద్ధ నవలల్లో కొన్ని. తన నవల “పథేర్ దాబీ”, అయితే దాని విప్లవాత్మక నేపథ్యం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ నవలను నిషేధించింది. తన కథలపై “దేవదాస్”, “పరిణిత”, “శ్రీకాంత” మొదలైన అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించబడ్డాయి. వాటిలో ముఖ్యమైనది దేవదాసు.

ఈ నవలను ఆయన 1917 లో మొదటిసారి పబ్లిష్ చేసారు. ఈ నవల  ఎంతెలా జనం  లోకి చొచ్చుకుపోయింది అంటే పురాణాలు ,చరిత్రలు కాకుండా భారతీయ భాషల్లో అత్యధికసార్లు సినిమాగా తీయబడ్డ కథగా రికార్డ్ సృష్టించింది. మొదటసారి గా 1928 లోనే సైలెంట్ సినిమాగా నరేష్ మిత్ర దర్శకత్వం లో రూపొందింది . తరువాత బెంగాలీ (1935 ),హిందుస్తానీ (1936 ) , అస్సామీ (1937) భాషల్లో పీసీ బారువా దర్శకత్వంలో తీశారు. తరువాత దీనిని తెలుగు ,తమిళ భాషల్లో 1953లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అక్కినేని ,సావిత్రిలతో  నిర్మించారు. ఆ తరువాత హిందీ లో 1955 లో దిలీప్ కుమార్ హీరోగా బిమల్ రాయ్ దర్శకత్వంలో మళ్ళీ రీమేక్ చేసారు . ఆ తరువాత కూడా  అనేక సార్లు ,వివిధ భాషల్లో దేవదాస్ ను రీమేక్ చేస్తూనే వస్తున్నారు .

పాత్రలు – పాత్రధారులు..

అక్కినేని నాగేశ్వరరావు – దేవదాసు

సావిత్రి – పార్వతి

యస్.వీ.రంగారావు – జమీందారు నారాయణ రావు

చిలకలపూడి సీతారామాంజనేయులు – భుజంగరావు

లలిత – చంద్రముఖి

దొరైస్వామి – నీలకంఠం

ఆరణి సత్యనారాయణ – ధర్మన్న

శివరాం పేకేటి – భగవాన్

సీతారామ్ – బండివాడు

ఆర్.నాగేశ్వరరావు

కంచి నరసింహారావు

చంద్రకుమారి

సురభి కమలాబాయి

వెంకయ్య

సీత

అన్నపూర్ణాదేవి

విజయలక్ష్మి

బి.యస్.ఆర్.కృష్ణ

డబ్బాచారి

సుధాకర్

కమల

లక్ష్మి

ప్రభావతి

బేబీ అనూరాధ

నటీ నటుల ఎంపిక..

ముందుగా దేవదాసు చిత్రానికి ముహూర్త ప్రారంభోత్సవం జరిగాక కథనాయికగా భానుమతి రామకృష్ణ గారిని తీసుకుందామని అనుకున్నారు. అయితే చిత్ర నిర్మాత అయిన డి.యల్.నారాయణ గారు అంతకుముందు భానుమతి రామకృష్ణ గారి దగ్గరే సహాయకులుగా పనిచేశారు. దాంతో భానుమతి గారికి తన పట్ల చిన్నచూపు అనిపించి తాను నటించనని చెప్పేశారు. ఆ తరువాత పార్వతి పాత్రకు షావుకారు జానకి ని అనుకున్నారు. ముహూర్తానికి షావుకారు జానకి, గిరిజ, అక్కినేని నాగేశ్వరావు గార్లు వచ్చారు. షావుకారు జానకి గారికి డేట్లు కుదరలేదు. చేసేది లేక తమ రెండవ సినిమా “శాంతి” లో నటించిన సావిత్రి గారు గుర్తొచ్చారు.  డి.యల్.నారాయణ గారు, వేదాంతం రాఘవయ్య గారు కలిసి విజయవాడ వెళ్లి సావిత్రి గారు నటించిన “పెళ్లి చేసి చూడు” సినిమా చూశారు. ఆ సినిమా లో సావిత్రి గారి నటన బావుండడంతో ఆమెను కథానాయకిగా తీసుకున్నారు. అప్పటికి సావిత్రి గారి వయస్సు 17 సంవత్సరాలు. ఆ వయస్సులో అంత బరువైన పాత్ర ధరించడం మాములు విషయం కాదు.

చిత్రీకరణ కు ప్రతికూల పరిస్థితులు..

భరణి పిక్చర్స్ వారు తీసిన “లైలా మజ్ను” తీస్తున్న సమయంలో ఆ సంస్థలో పనిచేస్తున్న సంభాషణల రచయిత సముద్రాల రాఘవాచార్య, సంగీత దర్శకులు సి.ఆర్.సుబ్బారామన్, నిర్మాణ భాద్యతలు చూసుకున్న డి.యల్.నారాయణ, నృత్య దర్శకులు వేదాంతం రాఘవయ్య లు కలిసి “వినోదా పిక్చర్స్” స్థాపించి వేదాంతం రాఘవయ్య దర్శకులుగా మొదట సినిమా “స్త్రీ సాహాసము” తీశారు. 1951 ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. దాంతో రెండవ సినిమాగా దేవదాసు తీయాలనుకున్నారు.

దేవదాసు చిత్రానికి ముహూర్తం 1951 అక్టోబర్ 24 రాత్రి 7 గంటల 45 నిమిషాలకు రేవతి స్టూడియోలో  ప్రారంభమైంది. సినిమా ప్రకటన చేసేసరికి అందరి చూపు దేవదాసు సినిమా పైనే ఉంది. అక్కినేని గారు సినిమాల్లోకి వచ్చి అరేళ్లయినా పూర్తవలేదు. జానపద చిత్రాలలో నటించే అక్కినేని గారు దేవదాసు పాత్ర వేయడం ఏమిటి? దానికి ఏమాత్రం అనుభవం లేని దర్శకులు వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం చేయడం ఏంటి? అని అందరూ ఆశ్చర్య పోయారు. పది రోజులు చిత్రీకరణ నడిచింది. చిత్ర నిర్మాతలు సీనియర్ సముద్రాల, సి.ఆర్. సుబ్బారామన్, డి.యల్. నారాయణ, వేదాంతం రాఘవయ్య గార్లు, ఈ నలుగురు మిత్రులు ఆలోచనలో పడి దేవదాసు చిత్ర నిర్మాణాన్ని ఆపుదామని నిర్ణయం తీసుకున్నారు.

వెంటనే “కొవ్వలి లక్ష్మీ నరసింహారావు” గారి కథ తీసుకొని రెండు మూడు నెలల్లోనే “శాంతి” అనే తక్కువ బడ్జెట్ తో సినిమా తీశారు. వినోద బ్యానర్లో తీసిన ఈ చిత్రానికి కూడా దర్శకుడు వేదంత రాఘవయ్య గారే. తనకు దర్శకుడుగా “శాంతి” రెండవ సినిమా. ఈ సినిమా ద్వారా రామచంద్ర కశ్యప, పేకేటి శివరాంల ను పరిచయం చేశారు రాఘవయ్య గారు. ఇందులో సావిత్రి గారు ప్రధాన పాత్ర చేశారు. 1952 ఫిబ్రవరి 15 విడుదలయ్యి ఓ మాదిరి విజయం సాధించింది.

ఈ సినిమా పూర్తవగానే ఆ నలుగురు మిత్రులు “దేవదాసు” చిత్రం నిర్మాణం కొనసాగించాలని చర్చలు ప్రారంభించారు. డి.ఎల్.నారాయణ తప్ప మిగతా ముగ్గురు వేదాంతం రాఘవయ్య, సముద్రాల, సి.ఆర్.సుబ్బరామన్ లు దేవదాసు చిత్రాన్ని ఆపేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. కానీ దేవదాసు చిత్రం పై డి.ఎల్.నారాయణ గారికి గట్టి నమ్మకం ఉంది. నిర్మాతగా బాధ్యతలు నేను చూసుకుంటాను మీ విభాగాలు మీరు కానిచ్చేయండి అని డి.ఎల్.నారాయణ గారు అన్నారు. మిగతా వాళ్ళు సరేనన్నారు. దేవదాసు చిత్రం నిర్మాణం మళ్ళీ పట్టాలకెక్కింది.

సంగీతం, పాటలు, సంభాషణలు…

దేవదాసు చిత్రానికి మాటలు, పాటలు సముద్రాల రాఘవాచార్య గారు వ్రాశారు. అంతకు ముందు నుంచే సముద్రాల గారు సినిమాలలో మాటలు, పాటలు వ్రాస్తూ వచ్చారు. ఆ రోజులలో పండితుల నుండి పామరుల వరకు కూడా ప్రతీ ఒక్కరికి అర్థమయ్యేలా అలవోకగా సంభాషణలు ఉన్నాయి. “వెర్రి కుదిరింది”, “రోకలి తలకు చుట్టండి”, “పన్నీరు పోసి పెంచినా ఉల్లి మల్లె అవుతుందా” లాంటి సామెతలు, సంభాషణలు తెలుగు దనాన్ని ఉట్టి పడేలా చేస్తాయి. అలాగే పాటల విషయానికి వస్తే ఇందులో ప్రతీ పాట ఒక ఆణిముత్యం. “కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్”, “మరపురాని బాధ కన్నా మధురమే లేదు”, గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు”, జగమే మాయ బ్రతుకే మాయ”, బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్” లాంటి పాటలు ఇప్పటికీ అజరామంగా నిలిచిపోయాయి.

సి.ఆర్. సుబ్బారామన్ గారు తమిళనాడు లో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందినవారు. తానే సంగీతం అందించిన ఈ చిత్రానికి చక్కటి బాణీలను సమాకూర్చారు. ఆ రోజుల్లోనే సుమారు సంవత్సరానికి సుమారు 14 చిత్రాలకు సంగీతం అందించేవారు.

అంత తీరికలేకున్నా కూడా దేవదాసు చిత్రానికి సంగీతం అందించారు. దురదృష్టవశాత్తు 10 పాటలు పూర్తవగానే చనిపోయారు. 

అప్పటికీ సి.ఆర్.సుబ్బారామన్ గారి వయస్సు కేవలం 27 సంవత్సరాలే కావడం విశేషం.

ఆ తరువాత మిగిలిన పాటలను యం.యస్. విశ్వనాథన్, రామ్మూర్తి గారు పూర్తి చేయడం విశేషం.

చిత్రీకరణ…

దేవదాసు సినిమా చూసిన వాళ్లలో చాలామంది ఇప్పటికీ కూడా అక్కినేని నాగేశ్వరావు గారు ఈ సినిమాలో తాగుబోతుగా కనపడడానికి ఉపవాసాలు చేసి నటించారని అనుకుంటారు గానీ అది ఏమాత్రం నిజం కాదు. తనకు పెరుగన్నం తింటే నిద్ర వస్తుందని అందుకని ,రాత్రిపూట పెరుగు తిని ,నిద్ర వస్తున్న సమయంలో షూటింగ్ జరిపామని అందుకే కళ్ళు మూతలు పడిపోతూ తాగుబోతు లా స్క్రీన్ పై కనపడ్డానని అక్కినేని గారు ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.

అలాగే నటన అంటే ఆకలితో ఉన్న పాత్ర చెయ్యాలంటే కడుపు మాడ్చుకుని షూటింగ్ చేస్తే అది నటన అవ్వదనీ, కేవలం కమిట్మెంట్ మాత్రమే అవుతుందని అనేవారు.

కడుపునిండా తిని ఏమీ తినని వాడిలా కనపడడం కదా నటన అంటే అనేవారు అక్కినేని గారు.

దేవదాసు సినిమాలో నటించడానికి ముందే సావిత్రి గారు దేవదాసు నవలను క్షుణ్ణంగా చదివి, ఆ నవలను ఆవాహన చేసుకుని నటించారు.

సన్నివేశాలలో నటించేటప్పుడు చిత్రికరణలో కట్ చెప్పినా కూడా అందులోనే లీనమై ఉండిపోయేవారట.

పార్వతి నాయనమ్మ పాత్ర ధరించిన  నటి సురభి కమలాభాయి, పార్వతి స్నేహితురాలి పాత్రలో సీత చక్కగా నటించారు.

దేవదాసు బాధను పోగొట్టడానికి మద్యం అలవాటు చేసిన పాత్రలో పేకేటి శివరాం నటించారు.

దేవదాసు విరహవేదనతో రగిలిపోతున్నప్పుడు చంద్రముఖి ని పరిచయం చేసి తన దుఃఖాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రాధాన్యత ఉన్న పాత్రలో పేకేటి శివరాం కూడా బాగా నటించారు.

పార్వతి రెండవ వివాహం చేసుకున్న జమిందారు కొడుకు గా జి.వి.జి.కృష్ణ గారు, సినిమా పతాక సన్నివేశాలలో అక్కినేని గారిని గుర్రపు బండిలో తీసుకెళ్లే పాత్రలో సీతారాం, దేవదాసు నౌకరు గా నటించిన అరణి సత్యనారాయణ (శోభన్ బాబు గారి ఊరికి చెందిన వారు) వీరంతా తమ తమ పాత్రలకు చక్కటి న్యాయం చేశారు.

పాటలు…

★ అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా…

★ అందం చూడవయా ఆనందించవయా…

★ ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా! పంతమా మువ్వ గోపాలా! నా స్వామీ..

★ ఓ దేవదా చదువు ఇదేనా (పెద్దలు)..

★ ఓ దేవదా చదువు ఇదేనా (పిల్లలు)..

★ కల ఇదని నిజమిదని తెలియదులే బతుకింతేనులే..

★ కుడి ఎడమైతె పొరపాటు లేదోయ్, ఓడి పోలేదోయ్..

★ చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంత చీకటైతె..

★ జగమే మాయ బ్రతుకే మాయ..

★ పల్లెకు పోదాం పారుని చూదాం చలో చలో…

విడుదల…

“దేవదాసు” తెలుగు చిత్రం 26 జూన్ 1953 నాడు విడుదలైంది. ఈ చిత్రం విడుదల చేయడానికి ఏ ఒక్క పంపిణీదారుడు కూడా ముందుకు రాలేదు.

దాంతో నిర్మాత డి.యల్.నారాయణ గారు వినోదా పిక్చర్స్ సర్క్యూట్ అనే పంపిణీ సంస్థ ను పెట్టి దేవదాసు చిత్రాన్ని విడుదల చేశారు.

ఈ సినిమా విడుదల రోజున పత్రికలో కథానాయిక, కథనాయకులు లేకుండా వినూత్న పేపరు ప్రకటన వేశారు.

బాటు “దేవదాసు” తమిళ వెర్షన్ మూడు నెలల తర్వాత 11 సెప్టెంబర్ 1953 నాడు విడుదలైంది.

ఈ చిత్రం రెండు వెర్షన్ లలో అద్భుతమైన విజయం సాధించింది.

విమర్శనాత్మకంగా ఉన్నా కూడా రెండు వెర్షన్లు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడాయి. ఈ సినిమా చాలా చోట్ల వందరోజుల వేడుక చేసుకుంది.

అన్ని భాషలలో తీసిన దేవదాసు చిత్రాలలో కెల్లా తెలుగులో తీసిన చిత్రమే మంచి పేరు తీసుకొచ్చింది.

అయితే సినిమా విడుదలైన తర్వాత, లాభాల విభజనపై భాగస్వాముల మధ్య గొడవలు జరిగాయని, అలాగే సుబ్బరామన్ భార్య లలిత తన బ్యాలెన్స్ రెమ్యునరేషన్ కోసం కోర్టును కూడా ఆశ్రయించాల్సి వచ్చిందని రాండర్ గై పేర్కొన్నాడు. 2002లో, 33వ “ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా” సందర్భంగా “దేవదాస్ రెట్రోస్పెక్టివ్ సెక్షన్” క్రింద ఈ చిత్రం ప్రదర్శించబడింది.

దేవదాసు సినిమా విశేషాలు…

★ ఈ సినిమా దర్శకుడైన వేదాంతం రాఘవయ్య గారు చిత్రీకరణ చాలా భాగం రాత్రుళ్ళే చేశారు.

దీని వలన నాగేశ్వరరావు గారికి సరైన నిద్రలేక కళ్ళు ఉబ్బెత్తుగా తయారయ్యి తాగుబోతులాగా సహజంగా అగుపించారు..

★ భగ్న ప్రేమే ప్రాథమిక కథాంశంగా వచ్చిన తెలుగు సినిమాలలో దేవదాసు మొట్ట మొదటిది అని చెప్పుకోవచ్చు.

భగ్న హృదయుడి పాత్ర పై అక్కినేని ఇప్పటికీ చెక్కు చెదరని ముద్ర వేశారు..

★ 1971 లో విడుదలైన “ప్రేమనగర్”, 1981 లో విడుదలైన “ప్రేమాభిషేకం” లో కూడా భగ్నహృదయుడిగా అక్కినేనే నటించటం, ఆ పాత్రలు మరల దేవాదాసుని గుర్తు చేయటం విశేషం..

★ ఈ సినిమా లోని పాటలు 70 ఏళ్ళ తరువాత కూడా తెలుగునాట మారు మ్రోగుతూనే ఉన్నాయి..

★ ఈ సినిమా వంద రోజుల వేడుకను హైదరాబాదు, రవీంద్ర భారతిలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి అక్కినేని, ఎన్టీఆర్, సావిత్రి, వాణిశ్రీ వంటి తెలుగు సినీ ప్రపంచపు అతిరథ మహా రథులందరూ ఆ వేడుకకు విచ్చేశారు..

★ ఈ చిత్ర కథను శరత్ చంద్ర వ్రాసిన దేవదాసు అనే బెంగాలీ నవల నుండి తీసుకున్నా కూడా చక్రపాణి గారు ఆ కథకు అనేక మార్పులు చేసి తెలుగు సంస్కృతికి అనుగుణంగా వ్రాశారు..

★ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన సి.ఆర్. సుబ్బారామన్ గారు అతి పిన్న వయస్సు (27) లోనే మరణించడం విషాదకరం..

★ 1974 లో కృష్ణ గారు “దేవదాసు” గా నటించిన సినిమా విడుదలై 50 రోజులు ఆడితే, అదే సమయంలో మళ్ళీ విడుదలైన నాగేశ్వరరావు గారి దేవదాసు సినిమా 200 రోజులు ఆడింది..

★ అన్ని భారతీయ భాషలలో కలసి దాదాపు 10 సార్లు ఈ చిత్రం విడుదల అయినా కూడా నాగేశ్వరరావు దేవదాసుగా నటించిన ఈ చిత్రానికి వచ్చినంత పేరు మరే దేవదాసు చిత్రానికీ రాలేదు..

★ 2002లో, 33వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా “దేవదాస్ రెట్రోస్పెక్టివ్ సెక్షన్” క్రింద ఈ చిత్రం ప్రదర్శించబడింది..

★ వంద సంవత్సరాల భారతీయ సినిమాలో ​​ఏప్రిల్ 2013లో, న్యూస్18 ఈ చిత్రాన్ని “100 అత్యుత్తమ భారతీయ చిత్రాల జాబితాలో చేర్చింది…

★ ఇండో-ఏషియన్ న్యూస్ సర్వీస్ దేవదాసు నాగేశ్వరరావు యొక్క “ఉత్తమ చిత్రాలలో” ఒకటిగా అభివర్ణించింది..

★ 1955 లో బిమల్ రాయ్ దర్శకత్వం వహించిన చిత్రంలో దేవదాస్ పాత్రను పోషించిన దిలీప్ కుమార్ , తన పాత్ర కంటే నాగేశ్వరరావు నటన అద్భుతంగా ఉందని ఒప్పుకున్నాడు..

Show More
Back to top button