GREAT PERSONALITIESTelugu Cinema

నటనకు కంచుకోట విన్నకోట రామన్న పంతులు

విన్నకోట రామన్న పంతులు (13 ఏప్రిల్ 1920 – 19 డిసెంబరు 1982)

“వీళ్ళమ్మా శిఖతరగ, ప్రతి గాడిద కొడుకు తిండిపోతుల్లా నా యింట జేరి నన్ననేవాళ్ళే”. “తాంబోలం యిచ్చేసాను. యిహ తన్నుకు చావండి” లాంటి సంభాషణ తెలుగు వారు మరచిపోలేరు. గురజాడ గారు కన్యాశుల్కం లో ఆ మాట చెప్పిస్తారు. కన్యాశుల్కం నాటకం గానీ, సినిమా గానీ చూసిన వారికి ఆ మాట గుర్తుండిపోతుంది. అందుకు గల కారణం ఆ పాత్ర యొక్క అద్భుతమైన అభినయం. ఆ స్వరం, ఆ రౌద్రం ప్రత్యేకం. ఆ నటుడి పేరు విన్నకోట రామన్న పంతులు. నటులు శాశ్వతం కాదు. నటన అజరామరం.

రంగస్థలం, సినిమా రంగం, ఆకాశవాణి నటులు, ప్రయోక్త, రూపశిల్పి, మార్గదర్శి, బహుముఖ ప్రజ్ఞాశాలి విన్నకోట రామన్న పంతులు గారూ. తన 62 ఏళ్ళ జీవితంలో 40 సంవత్సరాలు నాటకారంగానికి, కళాకారులని తీర్చి దిద్దడానికి, మేకప్ వేయడానికి, నాటకంలో కర్టెన్లు కట్టడానికి వెచ్చించారు. తన ఇంటినే రిహార్సల్ గదిలా మార్చేశారు. నటనకు, దర్శకాత్వానికే అత్యధిక సమయం వినియోగించారు. విన్నకోట గారూ దర్శకత్వం వహించిన నాటకాలలో నటించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటులు ఎందరో ఉన్నారు. రామచంద్ర కాశ్యప, ఏ.ఆర్.కృష్ణ, నిర్మలమ్మ, మురళీ మోహన్, అన్నపూర్ణ, వీరభద్ర రావు, సుబ్బరాయ శర్మ, జంధ్యాల వంటి వారు ఈ జాబితాలోకే వస్తారు.

డి.వి.నరసరాజు, రామన్న పంతులు గార్లు కలిసి ఎన్నో నాటకాలు సృష్టించారు. నరసరాజు వ్రాసిన “నాటకం” అనే నాటకంలో కేవలం ఐదు నిమిషాల నిడివి ఉన్న పాత్ర వేసి పరిషత్తులో ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు విన్నకోట రామన్న పంతులు గారూ. రచయితగా, దర్శకుడిగా, రూపశిల్పిగా, నటుడిగా, నాటక పరిషత్తు నిర్వహకుడిగా, పరిషత్తు న్యాయ నిర్ణేతగా, నాటక శిక్షణ శిబిరాల అధ్యాపకుడిగా, సమ్మేళనాలలో వక్తగా, విన్నకోట గారూ చేసిన సేవలకు ఆధునిక, సాంఘిక నాటకం మురిసిపోయింది. ఆయన కాలంలో నాటకం అక్షరాలా మెరిసిపోయింది.

జీవిత విశేషాలు.

  • జననం :   13 ఏప్రిల్ 1920
  • స్వస్థలం:        విజయవాడ..
  • తండ్రి    :       విన్నకోట వేంకట కృష్ణయ్య
  • తల్లి      :            అన్నపూర్ణమ్మ
  • వృత్తి     :  నటుడు, దర్శకుడు, న్యాయవాది
  • పిల్లలు  :     విన్నకోట విజయరాం
  • మరణం:    19 డిసెంబరు 1982 (వయసు 62)

జననం..

విన్నకోట రామన్న పంతులు గారూ 13 ఏప్రిల్ 1920 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలో విజయవాడలో వేంకటకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం విజయవాడ లోని గాంధీజీ మునిసిపల్ పాఠశాలలో, కాకినాడలోని ఎఫ్.ఎ.సి.ఆర్.కళాశాలలో, విజయనగరంలోని మహారాణి కళాశాలలో, పూనాలోని న్యాయశాస్త్ర కళాశాలలో సాగింది. విన్నకోట రామన్న పంతులు గారూ న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తరువాత, వృత్తి రీత్యా న్యాయవాదిగా ఒకవైపు జీవితాన్ని కొనసాగిస్తూనే మరోప్రక్క నటుడిగా నాటకాల్లో పాత్రలు ధరిస్తూ నాటకరంగం అభివృద్ధి కోసం పాటుపడ్డారు.

విన్నకోట రామన్న పంతులు గారూ నటనకు, ఆహార్యానికి సంబంధించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. వాటి మీద నటశిక్షణ, రూపశిల్పం, నాటక ప్రయోగం, రంగస్థల శాస్త్రం, వాచికాభినయం, మేకప్, మూకాభినయం, రససిద్ధాంతం, అంగికాభినయం, లైటింగ్, రంగస్థల నిర్మాణం, సాత్వికాభినయం మొదలైన పుస్తకాలు కూడా వ్రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటి ప్రేక్షక సంఘం నటరాజ కళామండలిని విన్నకోట గారూ స్థాపించారు. నాట్య సంఘం కార్యదర్శిగా, రాఘవకళా కేంద్రం కార్యదర్శిగా సేవలను అందించారు. దర్శకులు జంధ్యాల, నటుడు మురళీమోహన్, హాస్య నటులు సుత్తి వీరభద్రరావు, సుబ్బరాయ శర్మ మొదలైన వారికి నటనలో శిక్షణను ఇచ్చారు విన్నకోట రామన్న పంతులు గారూ. తెలుగు రంగస్థల, సినిమా నటులు విన్నకోట విజయరాం గారూ విన్నకోట రామన్న పంతులు గారి కుమారులే. టెలివిజన్ నటుడు, సినిమా నటుడు, ముద్దమందారం ప్రదీప్ ఇతని మనుమడు.

నాటక రంగంలో రామన్న పంతులు…

విజయవాడలో పుట్టి, నటన పట్ల ఆసక్తి పెంచుకొని న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ నాటకం, సినిమా, రేడియో మూడు ప్రక్రియలోనూ తనదైన ముద్ర వేశారు విన్నకోట రామన్న పంతులు గారు. సాంఘిక నాటకాలలో రామచంద్ర కాశ్యప, బళ్లారి రాఘవ గార్ల సమకాలీకులు రామన్న పంతులు గారు. వారితో కలిసి కొన్ని ప్రదర్శనలు చేశారు. “కన్యాశుల్కం”, “వరవిక్రయం”, “నాటకం”, “ఇనుపతెరలు”, “సంభవామి యుగే యుగే” ఇలా ఎన్నో. తన జీవిత మజిలీలో అధిక భాగం నాటక రంగానికే కేటాయించారు.

తన 62 ఏళ్ల జీవితం లో 40 సంవత్సరాలు నాటకానికి, కళాకారులను తీర్చిదిద్దడానికి, మేకప్ వేయడానికి, వెచ్చించారు. తన ఇంటిని నాటక శిక్షణ గదిగా మార్చేశారు. నటన, దర్శకత్వాలకి అత్యధిక సమయం వినియోగించారు. రామన్న పంతులు గారు దర్శకత్వం వహించిన నాటకాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటులు ఎందరో ఉన్నారు. రామచంద్ర కాశ్యప, ఏ.ఆర్.కృష్ణ, నిర్మలమ్మ, మురళీమోహన్, అన్నపూర్ణ, వీరభద్రరావు, సుబ్బరాయ శర్మ, జంధ్యాల వంటి వారు నాటకాల జాబితాలోకి వస్తారు.

డి.వి.నరసరాజు గారు, రామన్న పంతులు గారు కలిసి ఎన్నో అద్భుతమైన నాటకాలు సృష్టించారు. నరసరాజు గారు వ్రాసిన “నాటకం” అనే నాటకంలో కేవలం ఐదు నిమిషాల నిడివి ఉన్న పాత్ర వేసి పరిషత్తులో ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు రామన్న పంతులు గారు. రచయితగా, దర్శకుడిగా, రూపశిల్పిగా, నటుడిగా, నాటక పరిషత్తు నిర్వహకుడిగా, పరిషత్తు న్యాయ నిర్ణేతగా, నాటక శిక్షణ శిబిరాల అధ్యాపకుడిగా, సమ్మేళనలో వక్తగా విన్నకోట గారు చేసిన సేవలకు ఆధునిక సాంఘిక నాటకం మురిసిపోయింది. రామన్న పంతులు గారి కాలంలో నాటకం అక్షరాలా మెరిసిపోయింది.

చిత్ర రంగంలో…

చలనచిత్ర నటులు జగ్గయ్య గారు, సి.ఎస్.ఆర్ గారు, యస్వీ రంగారావు గారు లాంటి మేటినటుల సమకాలీనవారు రామన్న పంతులు గారు. విజయవాడ మీద ప్రేమ, న్యాయవాద వృత్తి, నాటక రంగం పట్ల అంకితభావం, ఇవన్నీ కూడా రామన్న పంతులు గారిని ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వలేదు. అయినా కూడా ఆణిముత్యాల్లాంటి పాత్రలు తనను వరించాయి. “గంగిగోవు పాలు గరిటడైనా చాలు” అన్న చందాన నటించారు. బంగారు పాప, వరుడు కావాలి, కన్యాశుల్కం, దొంగ రాముడు, చదువుకున్న అమ్మాయిలు, బాటసారి, భక్త రామదాసు, శ్రీమతి, సాక్షి, బంగారు పిచ్చుక, స్నేహం, ముద్దమందారం చిత్రాల్లో రామన్న పంతులు గారు వేసిన పాత్రలు ఇప్పటికీ నిలిచిపోతాయి.

“ముద్దమందారం” సినిమాకి ఆయన శిష్యుడు జంధ్యాల దర్శకత్వం వహించడం ఒక విశేషం అయితే, ఆయన మనవడు ప్రదీప్ ఆ సినిమా హీరో అవ్వడం మరొక విశేషం. రామన్న పంతులు కుమారుడు విన్నకోట విజయరామ్ ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపిస్తాడు. అలా మూడు తరాల నటులు ఒకే సినిమాలో నటించడం మరో విశేషం. బాపు దర్శకత్వం వహించిన “సాక్షి” సినిమాలో మునసబుగా, “బంగారు పిచుక” సినిమాలో భార్య చాటు భర్తగా, “ముద్దమందారం” లో ప్రేమ జంటను కలిపే తాతగా రామన్న పంతులు గారి నటన మర్చిపోలేనిది.

విన్నకోట గారి చిత్ర సమాహారం..

  • బంగారు పాప (1954) – జమీందారు
  • కన్యాశుల్కం (1955) – అగ్నిహోత్రావధాన్లు
  • దొంగరాముడు (1955)
  • వరుడు కావాలి (1957)
  • బాటసారి (1961) – జమీందారు
  • శ్రీకృష్ణ కుచేల (1961)
  • చదువుకున్న అమ్మాయిలు (1963)
  • రామదాసు (1964)
  • ఇల్లాలు (1965)
  • శ్రీమతి (1966)
  • సాక్షి (1967) – మునసబు
  • బంగారు పిచిక (1968) – సన్యాసిరాజు
  • స్నేహం (1977)
  • ముద్ద మందారం (1981)
  • మల్లెపందిరి (1982)
  • ముగ్గురమ్మాయిల మొగుడు (1983)..

కన్యాశుల్కం లో అగ్నిహోత్రావధానులుగా…

విన్నకోట రామన్న పంతులు గారి సినిమాలలో కన్యాశుల్కం ప్రత్యేకమైనది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సిన విషయం నటుల నటన గురించి. ఎంతో ప్రసిద్ధి చెందిన కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ గారు వ్రాశారు. ఈ కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా తీసి జనాన్ని మెప్పించటానికి ఎంతగానో ప్రయత్నం జరిగింది. ఈ చలన చిత్రంలో నలుగురి నటన బాగా చెప్పుకోతగ్గది. లుబ్దావధానులుగా, గోవిందరాజుల సుబ్బారావు గారు, రామప్ప పంతులుగా సి.ఎస్.ఆర్ గారు, మధురవాణిగా సావిత్రి గారు. ఈ ముగ్గురూ కూడి ఉన్న దృశ్యాలన్నీ కూడ నటనను అత్యున్నత స్థితికి తీసుకువెళితే, వీరితో పాటుగా అగ్నిహోత్రావధానులుగా నటించిన విన్నకోట రామన్న పంతులు గారు కూడ నటనలో పొంకం చెడకుండా తన పాత్రకు సరైన న్యాయం చేశారు.

“వీళ్ళమ్మా శిఖతరగ, ప్రతి గాడిద కొడుకు తిండిపోతుల్లా నా యింట జేరి నన్ననేవాళ్ళే”. “తాంబోలం యిచ్చేసాను. యిహ తన్నుకు చావండి” లాంటి సంభాషణలతో అద్భుతంగా అభినయించారు. ఆ సన్నివేశాల్ని తెలుగు వారు ఎప్పటికీ మరచిపోలేరు. అందుకు గల కారణం ఆ పాత్ర యొక్క అద్భుతమైన అభినయం. తన నటనలో ఆ స్వరం, ఆ రౌద్రం అంత ప్రత్యేకం. నందమూరి తారక రామారావు, ప్రతినాయకుడు వంటి, నాయక పాత్రను చక్కగా పోషించాడు.

జంధ్యాల గారితో అనుబంధం..

“సాక్షి” సినిమాలో బాపు రమణలు విన్నకోట రామన్న పంతులు గారి పాత్రను మలచిన తీరు కూడా అద్భుతం. జంధ్యాల గారూ కూడా విన్నకోట రామన్న పంతులు గారితో తన సినిమాల్లో నటింపచేసి, గురువు గారి ఋణం తీర్చుకున్నారు. వీరితో ముద్దమందారంలో కీలకమైన పాత్ర ధరింపజేశారు. దర్శకుడిగా జంధ్యాల గారికి ఇదే మొట్టమొదటి సినిమా కూడా. జంధ్యాల గారూ తన బాల్యంలో తొలిసారిగా విన్నకోటవారి కంపెనీలో నటించడం విశేషం. విన్నకోట రామన్న పంతులు గారికి “ఆకాశవాణి”తో ఉన్న అనుబంధం చాలా గొప్పది. వారి చివరి శ్వాస వరకూ అనేక నాటకాలకు పాత్రపోషణ చేసి అలరించారు. “సీతాపతి సంసారం” ధారావాహికంగా వచ్చింది. ఇందులో ప్రధానమైన పాత్ర వీరిదే. ఇది ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ప్రేక్షకులకు ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పరచారు.దాని పేరు “నటరాజ కళామండలి”.

ముద్ద మందారంలో మూడు తరాల నటులు..

జంధ్యాల గారికి విన్నకోట రామన్న పంతులుగారు గురుతుల్యులు. జంధ్యాల గారు చిన్నతనంలో విన్నకోట రామన్న పంతులు ఇంట్లోనే ఎక్కువగా పెరిగారు. రామన్న పంతులు గారి చిన్న కొడుకు విన్నకోట విజయరామ్, జంధ్యాల గారికి మంచి స్నేహితులు. విజయరామ్ మేనల్లుడు, రామన్న పంతులు గారి మనవడు అయిన ప్రదీప్ ఆ సమయంలో డిగ్రీ చదువుతుండేవాడు. అతను నటించిన ఓ నాటికను చూసిన జంధ్యాల గారు అతనితో “నిన్ను సినిమా హీరోని చేస్తాను రా” అని ఈ సినిమాలోకి తీసుకున్నారు.

మద్రాసులో జంధ్యాల గారు తన ఇంట్లోనే ప్రదీప్ ని ఉంచేసి తనకి డ్యాన్సులు, ఫైట్లు, గుర్రపుస్వారీలు, కార్ డ్రైవింగ్ లాంటివన్నీ నేర్పించారు. కొత్త తెలుగు సినిమాలు చూసి, వాటిలో హీరోలు ఎలా చేస్తున్నారో చూడమని ప్రదీప్ కి సూచించారు జంధ్యాల గారు. కథానాయిక పాత్రకు కూడా కొత్త నటినే తీసుకోవాలని భావించిన జంధ్యాల గారు,  ఆ సమయానికి “హరిశ్చంద్రుడు” సినిమాలో చిన్న పాత్రలో నటించిన పూర్ణిమ కు ఆ అవకాశం దక్కింది. సినిమాల్లో గాయని కావాలని ఉద్యేశ్యం తప్ప పూర్ణిమ నటి కావాలనుకోకపోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులకు సినిమాల్లో నటి కావడంపై సదుద్దేశం లేక పోవడం వలన వారు మొదట ఈ అవకాశాన్ని నిరాకరించారు.

జంధ్యాల గారు పూర్ణిమ తండ్రికి తాను విశ్వనాథ్ గారి శిష్యుణ్ణనీ, తమ చిత్రాల్లో అసభ్యతకు తావుండదనీ చెప్పి ఒప్పించారు. ప్రదీప్ తాత విన్నకోట రామన్న పంతులు గారు కథానాయకి తాత గానూ, ప్రదీప్ మేనమామ విన్నకోట విజయరామ్ గారు పోలీస్ కానిస్టేబుల్ గానూ నటించారు. ప్రదీప్, దుర్గలు చేరిన హోటల్ మేనేజర్ పాత్రలో హాస్యనటునిగా ప్రఖ్యాతి పొందిన సుత్తివేలు నటించారు. కండువా కట్టుకుని, ఒంటికి నూనె రాసుకుని నత్తి నత్తిగా మాట్లాడే పాత్రలో ఏవీఎస్ నటించారు. తర్వాతి కాలంలో ఆయన కూడా మంచి హాస్యనటుడు అయ్యారు.

ఆకాశవాణి లో “ఓకల్ స్టార్” గా…

ఆకాశవాణి లో నటుడిగా విన్నకోట రామన్న పంతులు గారి ప్రస్థానం, చరిత్ర మరువలేనిది. ఎన్నో నాటకాలు, ఎన్నో నాటికలు, ఎన్నో ధారావాహికలు. రేడియో హీరోగా ఉన్న రోజుల్లో రామన్న పంతులు గారు రేడియోకే హీరో. ఓకల్ స్టార్. తనదైన ప్రత్యేక కంఠ స్వరంతో శ్రోతలను కట్టిపడేసేవారు. ఒకటో, రెండో నాటికలు రేడియోలో వేసి ఏ.ఐ.ఆర్ ఆర్టిస్ట్ అని విస్టింగ్ కార్డు వేసుకునే రోజుల్లో విసిటింగ్ కార్డు అవసరం లేని రేడియో సూపర్ స్టార్ గా వెలిగారు రామన్న పంతులు గారు. 1975 ప్రాంతాల్లోనే ఆకాశవాణి డైలీ సీరియల్ (లైవ్) సీతాపతి సంసారంలో ఆయన సీతాపతి. “వరవిక్రయం” లో రామన్న పంతులు గారి పాత్ర నటీనటులకు మార్గదర్శకం.

విన్నకోట గారి మరణం.

19 డిసెంబరు 1982 లో తన 62వ యేట విన్నకోట రామన్న పంతులు గారు కన్నుమూశారు. విన్నకోట రామన్న పంతులు శిష్యులలో చెప్పుకోదగ్గవారు జంధ్యాల, వీరభద్రరావు, విజయరాం, ప్రదీప్. జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన “ముద్దమందారం” (1981) విన్నకోట గారు నటించిన సినిమాలలో ఆఖరిది. దీంట్లో మూడు తరాలకు చెందిన ఆయన కుటుంబసభ్యులు పాల్గొనడం విశేషం. ప్రదీప్ తాత గారు అయిన విన్నకోట రామన్నపంతులు కథానాయకి తాత గానూ, ప్రదీప్ మేనమామ విన్నకోట విజయరామ్ పోలీస్ కానిస్టేబుల్ గానూ, ప్రదీప్ కథనాయకుడి గానూ నటించారు. మూడు తరాల నటులను నటింపజేసిన జంధ్యాల గారూ తన గురువు గారి ఋణాన్ని ఆ విధంగా తీర్చుకున్నారు.

సశేషం.

“కన్యాశుల్కం” నాటకంలో అగ్నిహోత్రావధానులు ఒక పాత్రయితే, “కన్యాశుల్కం” చిత్రంలో అది పాత్ర కాదు, సజీవమూర్తి. ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన నటుడు విన్నకోట రామన్న పంతులు. ఆ చిత్రం చూసిన వాళ్లకు ఆయన అసలు పేరు గుర్తులేదు. ఆయన పేరు అగ్నిహోత్రావధానులు. అంతే. విజయవాడలో రామన్న పంతులు గారు వృత్తి రీత్యా వకీలు. ప్రవృత్తి రీత్యా నటుడు, దర్శకుడు మరెన్నో. ఒకవైపు నాటకాలు, మరోవైపు సినిమాలు ఆయనకు ఎంతో ఖ్యాతిని తెచ్చి పెట్టాయి. అయినా విన్నకోట గారు తన వృత్తిని, ఊరిని వదులుకోలేదు. ముఖ్యంగా రంగస్థలాన్ని అస్సలు వదలలేదు.

అయితే ఆయన నటన అంటే అభిమానం ఉన్న సినిమా రంగం ఆయన్ని పూర్తిగా వదులుకోదలచలేదు. రామన్న పంతులు గారు తన నటనా వైదుష్యం వాహినీ వారి “బంగారు పాప”, అన్నపూర్ణా వారి “చదువుకున్న అమ్మాయిలు”, భరణీ వారి “బాటసారి”, బాపు గారి “సాక్షి”, “బంగారు పిచిక” మొదలైన చిత్రాల్లో ప్రదర్శించారు. రామన్న పంతులు గారు ఎన్ని వేషాలు వేసినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ ఆయన విన్నకోట రామన్న పంతులు కాదు నులక అగ్నిహోత్రావదానులే.

“నటశిక్షణ” అనే పుస్తకాన్ని వ్రాసి రంగస్థలం మీద నటుడు ఎలా రాణించాలో సాంకేతికను ఏవిధంగా పెంపొందించాలో 50 ఏళ్ళ క్రితమే చెప్పిన రచయిత రామన్న పంతులు గారు. నట శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి రామన్న పంతులు. నటుడికి ఆహార్యం చేసుకోవడం రావాలని చెప్పేవారు పంతులుగారు. మామూలుగా ఒక వ్యక్తికి ఒక ప్రజ్ఞ ఉంటుంది. కానీ విన్నకోట రామన్న పంతులు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందరికో స్ఫూర్తి ప్రదాత.

Show More
Back to top button