Telugu Featured News

అయ్యా..!ఉచితాలు సరే..ఉపాధి ఏది?

తెలంగాణ రాష్ట్రం వస్తే… బతుకులు బాగుపడతాయి. మా నీళ్లు, నిధులు, మా నియామకాలు మాకు వస్తాయని గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాటి నాయకుల నుంచి నేటి యువకుల దాకా రైళ్లను పరిగెత్తించి, దాదాపు 1300 మంది యువకుల ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించిన రాష్ట్రం తెలంగాణ. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఏం జరుగుతోంది?.  తెలంగాణ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇలా అన్ని రంగాల్లో బలంగా ఉందని చెప్పుకునే నాయకులకు.. ఇటీవల విడుదలైన నిరుద్యోగ రేటులోనూ అగ్రస్థానంలో ఉందన్న విషయం బోధపడటం లేదా అనే విమర్శలు వస్తున్నాయి.

అలాంటి సమస్యను పక్కదారి పట్టిస్తూ.. ప్రస్తుతం ఎన్నికల తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధికై ప్రకటించే తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని గుర్తించకపోవడం దారుణం అని నిరుద్యోగులు ధ్వజం ఎత్తుతున్నారు. ఎంతసేపు వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, ఆసరా పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్ల గురుంచి.. మరోవైపు కులాల పేరుతో దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అంటూ ఒకరిని మించి ఒకరు హామీలిస్తున్నారే కానీ, రాష్ట్ర భవిష్యత్తుకు వెన్నెముక అయినటువంటి యువకుల ప్రస్తావన అనేది మేనిఫెస్టోల్లో లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక కొంత మేరకు నోటిఫికేషన్లు రిలీజ్ చేసినా.. అందులో పరీక్షలకు సంబంధించి వివిధ అంశాలపై కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం కావాలనే నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు గతంలో ఇదే అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే యేడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని కల్పిస్తామని ప్రకటించారు. కానీ నేటికీ ఆ మాటలు నీటిమూటలుగానే ఉన్నాయని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రం మిగులు నిధులతో ఉన్నా.. యువతకు సరైన అవకాశాలు లభించక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం మాత్రం మొక్కుబడి పేరుతో పండుగల పేరుతో ఇనాముల పేరుతో, నజరానాల పేరుతో కోట్లాను కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడం ఘోరం అని అంటున్నారు.

ఉద్యోగం వస్తే మా బతుకులు బాగుపడతాయని అనేక మంది నిరుద్యోగులు ఏళ్లకుయేళ్లు కన్నతల్లిదండ్రులని, పుట్టిన నేలను వదిలేసి, ఉన్న కాసింత పొలాలను అమ్ముకొని కోటి ఆశలతో ఈ విశ్వనగరానికి వచ్చి బతుకు జీవుడా అంటూ తిండితినో తినకనో రాత్రనకా పగలనకా ఉద్యోగాలకై సన్నద్ధమవుతుంటే.. నోటిఫికేషన్ రాక వచ్చినా వాయిదా పడుతూ లేదా రద్దవుతూ, పరీక్ష ఫలితాలు విడుదలవ్వక సతమతమవుతూ ఇటు నచ్చని ఉద్యోగం చేయలేక.. అనేక మంది యువకులు మానసిక క్షోభను అనుభవిస్తూ ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సమాజంలోని రాజకీయ పార్టీలు మేల్కొని జరగబోయే ఎన్నికల్లో ప్రజలను సోమరులుగా మార్చే ఉచిత హామీ పథకాల కంటే.. స్వయం కృషితో ఎదిగే పథకాలకు అలాగే విద్య, వైద్య రంగాలకు పెద్దపీటవేస్తూ తెలంగాణ శ్రేయస్సు కోసం పాటుపడాలి. ఎందుకంటే ఉచితపథకాలు ప్రస్తుతానికి సంతృప్తిగా అనిపించినా భవిష్యత్తు పరంగా చాలా ప్రమాదకరం అని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. 

Show More
Back to top button