Telugu News

చూపు లేదు.. ఆడియోలు వింటూ.. IAS కొట్టా..

ఆమెకు అందరిలా కంటి చూపు లేదు. విధి వక్రించడంతో 5ఏళ్ల వయసులోనే కంటి చూపును కోల్పోయింది. కంటి చూపు లేకపోవడాన్ని సాకుగా మార్చుకోలేదామె. ఆత్మవిశ్వాసాన్ని కంటి చూపుగా మార్చుకుంది. ఒక్కో అడుగు ముందుకు వేసింది. పట్టుదలతో కష్టపడి చదివింది. అమ్మానాన్న సహకారంతో అడ్డంకులు దాటుకొని ముందుకు సాగింది. అందరికీ ఎంతో కష్టతరమైన సివిల్స్‌ను ఆమె సాధించింది. కథ మొత్తం తెలియాలి అంటే.. మధురైకి చెందిన పూర్ణ సుందరి గురించి తెలుసుకోవాల్సిందే. తండ్రి సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తూ.. తల్లి ఇంటి పనులు చేసుకుంటూ కూతుర్ని చదివించారు. ఒక్కోసారి తినడానికి తిండికి కూడా లేని పరిస్థితి వాళ్లది. పైగా కూతురికి చూపు లేదు. ఆ చూపులేని కూతురికే ఓ ఆలోచన వచ్చింది. కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేయాలని నిర్ణయించుకుంది. ప్రతి ఫలమే ఐఏఎస్.

అందుకు తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించింది. మొదటి మూడుసార్లు సివిల్స్‌లో విజయం సాధించలేకపోయింది. అవమానాలు మొదలయ్యాయి. పరిస్థితులు వెక్కిరించాయి. అయినా.. ఆమె ప్రయత్నం ఆపలేదు. నాలుగోసారి ట్రై చేసింది. ఈ క్రమంలోనే చూపులేని ఆమెకు.. పుస్తకాలను ఆడియో ఫార్మాట్‌లో మార్చి ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు ఎంతో సహాయం చేశారు. కష్టపడి చదివి.. జాతీయ స్థాయిలో 286 ర్యాంకు సాధించి, ఐఏఎస్‌కు ఎంపికై విజయాన్ని ముద్దాడిందామె.
అభ్యర్థులకు పూర్ణ సుందరి సలహా
పోటీ పరీక్షల్లో.. కొందరికి త్వరగా సక్సెస్‌ వస్తే.. మరికొందరికి ఆలస్యంగా వస్తుంది. కానీ, ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక రోజు సక్సెస్‌ వస్తుంది. నా విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రతి సబ్జెక్టుకూ ఎంత టైమ్‌ పడుతుందో అంచనా వేసుకోవాలి. అవగాహన లేని సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఏదైనా సమస్య ఉంటే, అది ఎందుకు వస్తుంది, దాని పరిష్కారం ఏమిటి అని ఆలోచించాలి. తొందరపడి అనవసరపు నిర్ణయాలు తీసుకోవద్దు. మాక్ టెస్టులు రాయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో మీకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే టెక్నిక్‌తో చాలా మంది విజయం సాధిస్తున్నారు.


Show More
Back to top button