ఆంధ్ర నాటకరంగ చరిత్రలో సువర్ణ అధ్యాయానికి, సుదీర్ఘ అధ్యయనానికి కారణమైన నాటక సంస్థ “సురభి”. గత 137 సంవత్సరాలుగా అయిదు, ఆరు తరాల కుటుంబాలు నాటక ప్రదర్శననే నమ్ముకొని జీవనం సాగించడం సాధారణమైన విషయం కాదు. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా, మానవ జీవన విధానంలో ఎన్ని పరిణామాలు సంభవించినా రాజకీయ, ఆర్థిక, శాస్త్రీయ, విజ్ఞాన మొదలైన రంగాలలో ఎన్నో విప్లవాత్మకమైన సంఘటనలు జరిగినా, ఎప్పుడో 137 సంవత్సరాల కిందట ఒక వ్యక్తి అంకితభావంతో స్థాపించి, ప్రదర్శించిన నాటక ప్రదర్శనని ఆరు, ఏడు తరాలు కూడా కొనసాగించడం అనేది బహుశా ప్రపంచ రికార్డు అయ్యి ఉండాలి. ఆ రికార్డును నెలకొల్పినది కొనసాగిస్తున్నది “సురభి నాటక సమాజం”. దానికి పునాది వేసిన ఆ ద్రష్ట పేరు “వనారస గోవిందరావు”.
గోవిందరావు గారు జీవించి ఉండగానో లేక మరణించిన తరువాతనో “సురభి నాటక సంస్థ” ఒక వ్యవస్థ లాగా కొనసాగింది. ఈ 137 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని శాఖోపశాఖలుగా విస్తరించిన సురభి నాటక సమాజం ఉచ్ఛస్థాయిలో వెలిగిన రోజులలో సుమారు 60 శాఖలు ఉండేవి. ప్రస్తుతం 15 శాఖలుగా కొనసాగుతున్నాయి. ఇంత సుదీర్ఘమైన సాంస్కృతిక వారసత్వానికి ఆద్యులు “ఆంధ్ర నాటక కళోద్ధారక వనారస గోవిందరావు” గారు. సురభి నాటక సంస్థ అనేది కుటుంబ సభ్యులంతా, ముఖ్యంగా స్త్రీలు కూడా నాటక ప్రదర్శనలో పాల్గొనడం, నాటక ప్రదర్శనకు కావలసిన ఏర్పాట్లని, విభాగాలాన్ని ఆ కుటుంబ సభ్యులే నిర్వహించుకునేవారు. ఇలాంటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది గోవిందరావు గారే.
ఇక్కడ నాటకం అంటే ఎక్కువసార్లు పౌరాణిక నాటకమే. పౌరాణిక నాటకాలలో కూడా ఆ కాలంలోను సాంకేతికతను ఉపయోగించుకొని “వైర్ ట్రిక్స్” లాంటివి ప్రవేశపెట్టింది సురభి గోవిందరావు గారు మరియు ఆయన తమ్ముడు వనారస చిన్నరామయ్య గారు. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ లేని రోజులలో కూడా రంగస్థలం మీద ఆకాశం నుంచి మెరుపులు కురిపించే బాణాలు, ఆకాశము నుండి నారదుడిని క్రిందికి దించడం ఇలాంటి రంగస్థల మాయాజాలనికి రూపకల్పన చేసిన వ్యక్తి గోవిందరావు గారు. తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద నటించిన కళాకారులంతా సురభి నాటక సంస్థలోని ఒక శాఖలకు చెందిన వారే.
గోవిందరావు గారి కుటుంబం ఎక్కువ రోజులు నివసించి ఉంది, నాటకాలు ప్రదర్శించింది కడప జిల్లాలోని “సురభి” అనే ఊరు. కాబట్టి కాలక్రమంలో నాటక సంస్థలో సురభి పేరు చేరడం, వారందరిని “సురభి కళాకారులు” అని పిలవడం ఆనవాయితీగా మారింది. కానీ గోవింద రావు గారు మొట్టమొదటిసారిగా 1886లో ప్రారంభించిన నాటక సమాజం పేరు మాత్రం “శ్రీ శారద మనోవినోదిని సభ”. “సురభి” అనే ఊరు అసలు పేరు “సరుగు”. కాలక్రమంలో అది “సురభి” అయ్యింది. గోవిందరావు గారు సురభి అనే నాటక సంస్థ ప్రారంభించడం వెనక చాలా ఉదంతాలు ఉన్నాయి.
జీవిత విశేషాలు…
జన్మ నామం : పకీరప్ప
ఇతర పేర్లు : గోవిందప్ప
జననం : 1867
స్వస్థలం : సురభి, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తి : రంగస్థల నటులు, నాటకరంగ వ్యవస్థాపకులు
తండ్రి : గంపరామన్న
తల్లి : పకీరమ్మ
జీవిత భాగస్వామి : సుబ్బమ్మ,
పిల్లలు : పది మంది కుమార్తెలు, అయిదుగురు కుమారులు
మరణ కారణం : వృద్ధాప్యం
మరణం : 19 డిసెంబరు 1953,
ఏలూరు దగ్గర పొలసనపల్లి
గోవిందరావు పూర్వికులు…
నాలుగు, ఐదు వందల సంవత్సరాల క్రిందట పూనే సమీపంలో నివాసం ఉండే కొన్ని కుటుంబాల వారు ఛత్రపతి శివాజీ ఆస్థానంలో సేనాధిపతులుగా, ఉప సేనాధిపతులుగా, ఇతర ఉద్యోగులుగా పనిచేస్తూ ఉండేవారు. వారందరూ విద్యావంతులు, సంగీత, సాహిత్యాలలో ఆరితేరిన కళాకారులు కూడా. శివాజీ పరిపాలన తర్వాత మహమ్మదీయుల దండయాత్రలో తమ స్వస్థలాన్ని వదిలి వారంతా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. వారిలో కొంతమంది నిజాం పరిపాలన లోని బీదరు లాంటి ప్రాంతాలకు, మరి కొంతమంది బళ్లారి, రాయదుర్గం, ఆదోని లాంటి ప్రాంతాలకు వలస వెళ్లారు. దశాబ్దాల కాలక్రమంలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు వీళ్ళలో కొంతమంది రాయలసీమ ప్రాంతాలకు చేరుకొని మరాఠీలో పాటలు పాడమే కాకుండా చిన్న చిన్న ప్రదర్శనలు ఇస్తుండేవారు. క్రమక్రమంగా అదే వారి జీవనాధారం కూడా అయ్యింది.
చర్మ నాటకం…
మరి కొన్నాళ్లకు ఈత మట్టలను బొమ్మలుగా కత్తిరించి తోలుబొమ్మలాట ప్రదర్శిస్తుండేవారు. ఆ రోజుల్లో వాటిని “చర్మనాటకం” అనేవారు. అప్పట్లో వారి జీవన విధానం ఎలా ఉండేదంటే తోలుబొమ్మలాట ప్రదర్శిస్తే మరునాడు ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించేవారు. ఎవరికి తోచింది వారు ఇస్తుండేవారు. ఇలా ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి సంచారజీవనం చేసుకునేవారు. వీళ్లలో కొందరు కడప జిల్లా “సురభి” అనే గ్రామం చేరుకొని అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ఆంధ్రదేశమంతటా తిరుగుతూ తోలుబొమ్మలాట ఆడిస్తుండేవారు. గోవిందరావు పూర్వికుల పరిస్థితి ఇది. పంతోమ్మిదో శతాబ్దం వచ్చేసరికి అంటే 1820 ఆ ప్రాంతంలో తోలుబొమ్మలాటలో ప్రధానమైన వారు ముగ్గురు. పెద్ద రామయ్య, వెంకోజీరావు, కృష్ణాజీరావు. వీరినే రామప్ప, వెంకటప్ప, కృష్ణప్ప అంటుండేవారు. వీరిని తోలుబొమ్మలాట నుండి నాటకాల వైపు మళ్ళించిన కథానాయకుడు “వనారస గోవిందరావు”.
గోవిందరావు జననం…
నిజానికి గోవిందరావు ఈ వంశీయుడు కాదు. గోవిందరావు అసలు పేరు ఫకీరప్ప. 1868వ సంవత్సరం కడప జిల్లా హనుమద్గుండము అనే ఊరిలో జన్మించాడు. గోవిందరావు నాన్న గారి పేరు గంపరామన్న, అమ్మగారి పేరు పకీరమ్మ. ఈయనకు ఇద్దరు అన్నయ్యలు. వీరిది చాలా పేద కుటుంబం. వీరు కూలినాలి చేసుకుని జీవనం గడిపేస్తుండేవారు. ఒకసారి వారి ఊరికి కరువు సంభవించినప్పుడు ప్రభుత్వం వారు జమ్మలమడుగు నుంచి హనుమద్గుండము వరకు రోడ్డు వేయించే కార్యక్రమం చేపట్టారు. ఆ రోడ్డు పనికి ఈ పకీరన్న కుటుంబం అంతా వెళ్లారు. అకస్మాత్తుగా కలరా తగిలి ఫకీరప్ప తల్లిదండ్రులు, అన్నదమ్ములు చనిపోయారు. ఫకీరప్పకు బంధువులు ఎవరూ లేరు. ఫకీరప్పను ఒకతను చేరదీశాడు. అతడు దొరల దగ్గర వంట పని చేస్తుండేవాడు. అతని పేరు బెస్త రోషన్న. రాత్రులు రోషన్న ఫకీరప్పకు భోజనం తెచ్చేవాడు.
బాల్యం…
పగటిపూట కిరాణా షాపులో పనిచేస్తూ ఆ ఫకీరప్ప పొట్టపోసుకుంటూ ఉండేవాడు. 1877వ సంవత్సరంలో ఫకీరప్ప కు స్ఫోటకం తలిగి ఒళ్లంతా కురుపులతో రసి కారుతూ చూడడానికి అసహ్యంగా ఉండేవాడు. ఎవ్వరూ దగ్గరికి వచ్చి క్షేమ సమాచారం చూడడానికి సాహసించలేదు. ఎక్కడో దొర గారి అరుగు మీద పడుకునేవాడు. ఎవ్వరూ చూడక బాధపడుతూ ఉన్నాడు. బెస్త రోషన్న వచ్చి భోజనం పెడుతుండేవాడు. రామప్ప, వెంకప్ప, కృష్ణప్ప ఈ ముగ్గురు కలిసి ఆ గ్రామానికి తోలుబొమ్మలు అడడానికి వచ్చారు. ముగ్గురి అన్నదమ్ముల అమ్మగారు చెన్నమ్మ ఫకీరప్పను చూసింది. ఆమెకు చాలా జాలేసింది. ఆ అరుగు మీద స్ఫోటకంతో బాధపడుతూ ఉన్న ఆ బాలుడిని తీసుకెళ్లి నీళ్లు పోసి, పసర్లు రాసి ఆ వ్యాధి నుండి ఫకీరప్పను బయటకు తీసుకువచ్చింది. ఆ ఊరి దొర గారి సిఫారసు మేరకు ఆ బాలుడిని చెన్నమ్మ గారు పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ల కొడుకులలో మధ్యవాడు వెంకప్ప అతని భార్య సుంకమ్మ దంపతులు ఆ పిల్లవాడిని దత్తత తీసుకుని గోవిందప్ప అని పేరు పెట్టారు. ఆ గోవిందప్పనే గోవిందరావు, వనారస గోవిందరావు.
నాటకరంగం…
వెంకప్ప వద్దకు వచ్చిన తర్వాత నాలుగేళ్ల వరకు ఆడుతూ పశువుల మేపుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు గోవిందప్ప. కొద్దిరోజుల తర్వాత వీళ్ళ పెదనాన్న రామప్ప తెలుగు నేర్పించి చదువు చెప్పిస్తుండేవాడు. తోలుబొమ్మలాట వద్దకు తీసుకెళ్తుండేవాడు. కాలక్రమేనా గోవిందప్పకు సంగీతం, ఫీడేలు వాయించడం లాంటివి నేర్పారు. వీరంతా మద్రాసు, బొంబాయి, హైదరాబాదు తిరిగి తోలుబొమ్మలాట ఆడించేవారు. అలా వారి వెంట గోవిందప్ప వెళుతుండేవాడు. గోవిందప్పకు మరాఠీ నాటకాలు, అరవ నాటకాలు చూసే అవకాశం వచ్చింది. సారంగధర, వస్త్రాపహరణం, భువనేంద్రసభ లాంటి నాటకాలు చూశాడు. ఇల్లు ఇల్లు తిరిగే డబ్బులు వసూలు చేయడం నచ్చని ఆ కుర్రాడు, మనం కూడా నాటకాలు వేస్తే బాగుండునని రామప్ప, వెంకప్ప లకు సూచించాడు. కానీ వారు ఖాతరు పెట్టలేదు. ఇవన్నీ మన వల్ల కాదని వారు కొట్టిపారేసారు. దీంతో ఆ కుర్రాడు నంద్యాల పారిపోయాడు.
సుబ్బమ్మ తో వివాహం…
నంద్యాల పారిపోయిన గోవిందప్ప నాటకాలు నిర్వహించే జ్యోతి సుబ్బయ్య వద్ద పనికి చేరాడు. రెండు పూటలా తింటే తనను పంపించేస్తారని వారి వద్ద ఒక్కపూట మాత్రమే అన్నం తింటుండేవాడు. వాళ్ళు ఆడే నాటక విధానం పరిశీలిస్తూ, వాళ్ళు ధరించే వస్తువులను సేకరిస్తూ ఉండేవాడు. అలా వారు హరిశ్చంద్ర నాటకం వేస్తుండగా విశ్వామిత్ర పాత్రధారి అందుబాటులో లేడు. అప్పుడు ఈ గోవిందప్పను పిలిచి తనతో విశ్వామిత్రుని పాత్ర ధరింపజేశారు. ఆ విధంగా తొలిసారి రంగస్థలం మీద విశ్వామిత్రుడు పాత్రతో రంగస్థలం ప్రవేశం చేశారు గోవిందప్ప. ఇది తెలిసిన వెంకప్ప, రామప్ప లు జ్యోతి సుబ్బయ్య తో గొడవపడి గోవిందప్పను వెనక్కి రప్పించి 1885 సంవత్సరంలో సుబ్బమ్మ అనే యువతిని ఇచ్చి వివాహం చేశారు. సురభి అనే ఊరిలో అల్లపురెడ్డి చెన్నారెడ్డి, కొవ్వూరి రామిరెడ్డి లు వియ్యంకులు అవుతున్నారు. ఆ సందర్భంలో రామప్ప, వెంకటప్పని పిలిచి తోలుబొమ్మలాట ఆడించాల్సిందిగా కోరారు.
తొలి నాటకం “కీచకవధ”…
తోలుబొమ్మలాటకు బదులుగా నాటకం వేయడానికి రామప్ప, వెంకటప్పలను ఒప్పించిన గోవిందప్ప వారికి నాటకం ఏ విధంగా వేయించాలో నేర్పించి కొవ్వూరు రామిరెడ్డి వారి ఇంట్లో జరిగిన నాటకంలో “కీచకవధ” అనే నాటకం వేయించారు గోవిందప్ప. అదే కాలక్రమంలో “సురభి నాటక సంస్థ” కు బీజం వేసి, 137 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి నాంది పలికిన తొలి నాటకం “కీచకవధ”. ఆ ప్రదర్శన జరిగినప్పుడు పులివెందుల సబ్ మెజిస్ట్రేటివ్ గోవిందనాయుడు గారు కూడా ఆ నాటకాన్ని చూశారు. ఆయన మెచ్చుకొని వాళ్ళ ఊరు పులివెందుల పిలిపించి ఆ నాటక ప్రదర్శన చేయించారు. ఈ రెండు సంఘటనల వల్ల నాటక ప్రదర్శన మీద ఉన్న గౌరవం పెరిగి నాటకాలు వేయడానికి, నాటకాలలో కొనసాడానికి నిర్ణయించుకున్నారు రామప్ప, వెంకప్పలు. ధన సాయం కోసం పునరాలోనలో పడిన వారికి చెన్నారెడ్డి, నాగిరెడ్డిలు సహాయం చేయగా, ధర్మవరం నుండి సుబ్బదాసు అనే అతనిని పిలిపించి సారంగధర, శకుంతల లాంటి నాటకాలు నేర్చుకొని అక్కడి నుండి నాటకాలు వేయడం ఆరంభించారు.
“శ్రీ శారద మనోవినోదిని సభ”…
ఆ నాటక సమాజానికి వారు పెట్టుకున్న పేరు “శ్రీ శారద మనోవినోదిని సభ”. అందులో ఉండే స్త్రీ పాత్రలను తన కుటుంబ సభ్యులలో ఉన్న స్త్రీలతోనే వేయించేవారు. 1886లో ప్రారంభమైన దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఆంధ్రదేశం, నైజాము, బర్మ లాంటి దూర ప్రదేశాలకు వెళ్లి ఊరూరా తిరుగుతూ నాటకాలు వేయడం కొనసాగించారు. ఈ క్రమంలో వనారస కుటుంబం సోదరులు, వాళ్ళ పిల్లలు, ఇంకా నాటకాలు వేస్తూ వస్తున్న ఆ నాటక సమాజం 1900 సంవత్సరం వచ్చేసరికి శాఖోపశాఖలుగా విస్తరిస్తూ విడిపోవడం జరిగింది. గోవిందప్ప పేరే కాలక్రమంలో గోవిందరావుగా మారిపోయింది.
వనారస గోవిందరావు తర్వాత అంతటి దీక్షతో పట్టుదలతో నాటకాలు వేసిన వాడు వనారస చిన రామయ్య. వనారస గోవిందరావు గారు ఆనాటి ప్రముఖ రచయితలు అయిన ధర్మవరపు సుబ్బదాసు, ఉప్పవరపు సుబ్బారావు, విశ్వనాథ కవిరాజు, మల్లాది వెంకట కృష్ణశాస్త్రిలతో కొత్త కొత్త నాటకాలు వ్రాయించేవారు. కేవలం నాటక సంస్థ కోసం నాటకాలు వ్రాయించి వారికి పారితోషికం కూడా ఇస్తుండేవారు. నాటకాలకు ప్రొఫెషనల్ టచ్ తీసుకువచ్చింది కూడా వనారస గోవిందరావు గారే. ఒక్కొక్క ఊర్లో రోజు విడిచి రోజు నెల రోజులపాటు వేసిన నాటకం వేయకుండా గోవిందరావు గారి బృందం నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు.
దొంగ పాత్రలో గోవిందరావు…
అలా తన వద్ద 12 నాటకాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి. వాటిలో కొన్ని కురుక్షేత్రం, దశావతారాలు, భక్త ప్రహ్లాద, మహాభారతం, చింతామణి, కృష్ణ లీలలు, సారంగధర లాంటివి. అన్ని నాటకాలలోని అన్ని పాత్రలు కూడా గోవిందరావు గారి కుటుంబ సభ్యులే వేస్తుండేవారు. ఆ తరువాత బయట నుంచి వచ్చిన కళాకారులను కూడా సంస్థలో చేర్చుకొని సురభి కుటుంబాన్ని పెంచుకున్నారు. పౌరాణిక నాటకాలలో పురాణ పాత్రలన్నీ ముఖ్యంగా విశ్వామిత్రుడు, నకులుడు, ఆంజనేయుడు, దొంగ, అర్జునుడు (సుభద్ర), రాజరాజ నరేంద్రుడు, హరిశ్చంద్రుడు, అనిరుద్ధుడు, రావణుడు, శ్రీరాముడు (సంపూర్ణ రామాయణం), విక్రమార్కుడు, బిల్వ మంగళుడు, జగన్మోహనుడు, హిరణ్యకశిపుడు, రుక్మాంగదుడు. ఇలాంటి పాత్రలు అన్నీ కూడా గోవిందరావు గారే నటిస్తుండేవారు. కాంతామణి నాటకంలో దొంగ పాత్రలో అద్భుతంగా నటిస్తుండేవారు గోవిందరావు గారు. ఆ రోజులలో ఆ నాటకం కరపత్రాలలో కంపెనీ ప్రొప్రయిటర్ గారిచే దొంగ వేషం వేయించబడును అని ప్రత్యేకంగా ప్రచారం చేయిస్తుండేవారు.
క్రమశిక్షణకు మారుపేరు “సురభి నాటక సంస్థ”…
1915 వరకు “సురభి” అనే ఊర్లోనే ఉంటూ దేశమంతా ప్రదర్శనలు ఇచ్చేవారు. 1915 తర్వాత ఏలూరు దగ్గర ఉన్న పొలసనపల్లి అగ్రహారం వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. 1917లో భీమవరం లో “లంక దహనం” అనే నాటకం లో హనుమంతుని పాత్ర వేస్తూ తోకకు నిప్పంటించినప్పుడు గోవిందరావు గారి ఒళ్లంతా కాలిపోయింది. ఆ సంఘటన నుండి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది గోవిందరావు గారికి. తనకు చికిత్స జరుగుతున్నా కూడా మిగతావారు నాటకాలను ప్రదర్శించే వారు. ఒక్కసారి నాటకం ప్రకటిస్తే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆపేవారు కాదు.
సురభి కమలాభాయి తల్లి గారు నాటకం వేస్తుండగా తనకు నొప్పులు వస్తే తెర క్రిందికి వేసి ప్రసవం చేసి ఆ అమ్మాయిని తీసుకువచ్చి ప్రేక్షకులకు చూపించారు. ఒకసారి మనోహర్ అనే నటుడు దృశ్య దృశ్యానికి మధ్య తెర వెనక్కి వెళ్ళినప్పుడు గుండెపోటు వచ్చి అక్కడే మరణించాడు. కానీ ఆ విషయం ప్రకటించకుండా, ఎవ్వరికీ తెలియకుండా అలాంటి పోలికలు ఉన్న ఇంకొకరిని తీసుకువచ్చి ఆ దృశ్యాన్ని కొనసాగించారు. తరువాత మరుసటి నాడు పేపర్లో చూసేవరకు ఆ విషయం ఎవ్వరికీ తెలియలేదు. అంత నిబద్ధత, క్రమశిక్షణ నాటక సభలకు అలవాటు చేసుకున్నారు వనారస గోవిందరావు గారు.
సేవా కార్యక్రమాలలో గోవిందరావు…
అగ్ని ప్రమాదం తర్వాత గోవిందరావు గారికి నటించడం సాధ్యం కాలేదు. నాటకం మధ్య మధ్యలో హాస్యం చెబుతూ నాటకాల నిర్వహణకే పరిమితమయ్యారు. 1920 ప్రాంతంలో పొలసనపల్లి లో నివసిస్తూ సురభి వారు నాటకాలు వేస్తుంటే, గోవిందరావు గారు ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. పొలసనపల్లి చుట్టుపక్కల వాళ్ళు గోవింద రావు గారిని నాటకాలు వేసే వ్యక్తిగానే కాకుండా ఒక సమాజసేవకుడిగా కూడా గౌరవిస్తూ ఉండేవారు. అక్కడున్న రోజులలో పాటు బడ్డ శివాలయాన్ని పునరుద్ధరించారు.
అలాగే పిల్లలను చదువుకోవడానికి ఒక ఆ ఊరిలో ఒక పాఠశాలను కూడా స్థాపించారు. వారికోసం కోసం రెండు మూడు బావులు త్రవ్వించారు. ఆ ఊరు మీదుగా ద్వారకా తిరుమల కు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఒక సత్రాన్ని కూడా కట్టించారు. అలాగే పేద విద్యార్థులకు విద్యను అభ్యసించడానికి పారితోషికం కూడా ఇస్తుండేవారు. ఆ ఊరి గ్రంథాలయానికి విరాళాలు ఇస్తుండేవారు. నాటకాల నుండి విరమించిన బీద కళాకారులకు సహాయం చేస్తూండేవారు. ఇవన్నీ కూడా “సురభి నాటక సంస్థ” స్థాపించిన వన వనారస గోవిందరావు గారు చేపట్టిన సేవా కార్యక్రమాలు.
“ఆంధ్ర నాటక కళాపరిషత్తు” స్థాపన…
1929 నాటికే గోవిందరావు గారికి “ఆంధ్ర నాటక కళోద్ధారక” అనే బిరుదు ఉండేది. నాటకాలకు ఎక్కువ ప్రోత్సాహం కలిగించాలనే ఉద్దేశంతో వివిధ రంగాలలో ప్రసిద్ధులు అయినటువంటి కొంతమందితో “ఆంధ్ర నాటక కళాపరిషత్తు” అనే నాటక సంస్థను కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, విశ్వనాథ కవి గారు, చిట్టి పూర్ణయ్య గారు, సాంఖ్యాయన శర్మ గారు వీరితో పాటు వనారస గోవిందరావు గారు కూడా స్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉన్నారు. “ఆంధ్ర నాటక కళాపరిషత్తు” కొన్ని దశాబ్దాల పాటు వైభవోపేతంగా కొనసాగింది. దాని తరపున నాటక పోటీలు నిర్వహించి నాటక సమాజం ప్రోత్సహిస్తుండేవారు. ఆ రోజులలో ఆంధ్ర నాటక కళాపరిషత్తు పోటీలలో బహుమతులు తీసుకోవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండేది. తరువాత దశాబ్దాలలో ప్రఖ్యాత సినీ కళాకారులైన ఎన్టీఆర్, జగ్గయ్య, సావిత్రి గారు మొదలైన వారు ఈ ఆంధ్ర నాటక కళాపరిషత్తు వారు నిర్వహించిన పోటీలలో పాల్గొని బహుమతులు పొందిన వారే.
కన్నుమూత…
వనారస గోవిందరావు గారు తాను నారు వేసి, నీరు పోసి, పెంచి పోషించిన “సురభి నాటక సంస్థ” శాఖలుగా విస్తరించడాన్ని తాను జీవించి ఉండగానే చూడగలిగారు. ఆయన 70వ జన్మదినాన్ని అభిమానులు, కళాకారులు, అందరు కలిసి ఏలూరులో మహా వైభవంగా నిర్వహించారు. సంపూర్ణమైన, సంతృప్తికరమైన జీవనాన్ని గడిపిన గోవిందరావు గారు 19 డిసెంబరు 1953లో తన 80 యేట కన్నుమూశారు. ఏలూరులో తన శిలా విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు అభిమానులు. ఒక వ్యక్తి ముందు చూపు ఎన్ని తరాలని కళా రంగంలో నడిపిస్తుందో గమనిస్తే వనారస గోవిందరావు గారి గొప్పతనం అర్థమవుతుంది. గోవిందరావు గారి కుటుంబ సభ్యులంతా నాటక రంగాన్నే నమ్ముకుని, ఆ కళ నే ముందుకు తీసుకెళ్తూ జీవించారు, ఇంకా జీవిస్తూనే ఉన్నారు.
వ్యక్తిగత జీవితం…
వ్యక్తిగత విషయానికి వస్తే సుబ్బమ్మను మొదట వివాహం చేసుకున్న గోవిందరావు గారు లక్ష్మమ్మ ను రెండో వివాహం చేసుకున్నారు. వారికి పది మంది కూతుళ్లు, నలుగురు కొడుకులు. వీరంతా చిన్నతనం నుండే రంగస్థలంలో నాటకాలలో పాల్గొని నాటకాలు వేస్తూ ఉండేవారు.
★ రేఖాంధార్ సుభద్రమ్మ….
వనారస గోవిందరావు గారి సంతానంలో ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఒకరు గోవిందరావు గారి ఐదవ సంతానం “సుభద్రమ్మ”. ఈమె 1911 లో జన్మించారు. ఇతర సంతానం లాగానే ఆమెకు సంగీతం నేర్పించి కళాకారిణి గా పరిచయం చేశారు తండ్రి వనారస గోవిందరావు గారు. రేఖాంధార్ వెంకటేశ్వరరావు గారిని వివాహం చేసుకున్న తరువాత రేఖాంధార్ సుభద్రమ్మ గా “రంగస్థలం” లో ప్రసిద్ధి చెందారు. భర్తతో కలిసి 1935 ప్రాంతాల్లో వెంకటేశ్వర నాటక సమాజం స్థాపించారు. ఆ నాటక సమాజం 87 సంవత్సరాల తరువాత కూడా ఇప్పటికీ కూడా కొనసాగించడం గమనించదగ్గ విషయం. మిగతా నటీమణుల లాగా స్త్రీ పాత్రలకే పరిమితం కాకుండా రంగస్థలం మీద శ్రీరాముడు, సత్యవంతుడు, మన్మధుడు, నారదుడు ఇలా అనేక పురుష పాత్రలను రంగస్థలం మీద పోషించారు రేఖాంధార్ సుభద్రమ్మ గారు. ఆ రోజులలో సురభి నాటకాలే ఆకర్షణ అయితే, సుభద్రమ్మ గారి పోషించిన పురుష పాత్రలు కూడా ఇంకా ఆకర్షణీయంగా ఉండేవి.
★ కావేటి పూర్ణిమ…
గోవిందరావు గారి సంతానంలో చెప్పుకోదగ్గ ఇంకొక వ్యక్తి కుమార్తె పూర్ణిమ. వివాహం అనంతరం కావేటి పూర్ణిమ అయ్యారు. 1918లో జన్మించిన పూర్ణిమ సుభద్రమ్మ గారికి స్వయాన చెల్లెలు. ఈమె రంగస్థలంపై స్త్రీ పాత్రలకే పరిమితమయ్యారు. మొదట్లో తండ్రి స్థాపించిన నాటక సంస్థలో నటించిన పూర్ణిమ, తరువాత కాలంలో 1944లో “పూర్ణిమ ఆర్ట్ థియేటర్” అనే సొంత నాటక సమాజాన్ని కొనసాగించారు. తెలుగు టాకీలు మొదలైన కొత్తలో కన్నాంబ, శ్రీరంజని, రామతిలకం లాంటి ప్రసిద్ధ రంగస్థలం నటీమణులు సినిమాలలోకి వెళ్లడంతో కావేటి పూర్ణిమ గారు వాళ్ళ స్థానాన్ని రంగస్థలంపై భర్తీ చేయగలిగారు. ఆ రోజులలో ప్రసిద్ధ నటీనటుల ప్రక్కన నటించారు కాబట్టి పూర్ణిమ గారు.
సురభి సంస్థ నుండి నాటకాలతో ప్రారంభించి సినిమా రంగానికి వెళ్లిన తొలి కళాకారులలో “సురభి కమలాభాయి” తరువాత చెప్పుకోదగ్గ కళాకారిణి కావేటి పూర్ణిమ. సారథి ప్రొడక్షన్ వారి “అపవాదు” చిత్రంతో ఒక ముఖ్య పాత్ర ద్వారా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత జగదీష్ పిక్చర్స్ వారి “సత్యభామ” లోనూ నటించారు పూర్ణిమ గారు. 1948లో విడుదలైన “జంధ్యాల గౌరీనాద శాస్త్రి” గారి సొంత చిత్రం “గీతాంజలి” లో హీరోయిన్ గా నటించారు కావేటి పూర్ణిమ గారు. చివరి రోజుల్లో సుభద్రమ్మ, పూర్ణిమ లాంటి కళాకారులంతా “ఏలూరు” లోనే స్థిరపడ్డారు. వారితో బాటే “సురభి కమలాభాయి” కూడా ఏలూరు లోనే నివసించారు. సురభి అనగానే గుర్తొచ్చే మరొక నటి “సురభి బాలసరస్వతి”. ఆమె వనారస గోవిందరావు గారికి మనవరాలు. వీరే కాకుండా వందలాది మంది కళాకారులను కూడా ఉన్నారు సురభి నాటక సమాజంలో.