CINEMATelugu Special Stories

నిబద్ధత గల గాత్రానికి నిలువెత్తు నిదర్శనం.. ఏ.పి.కోమల..

1948లో ఒరిస్సా లోని ఏ.పి.కోమల బరంపురం పట్టణంలో జరిగిన శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పాల్గొని శ్రీగణనాయకం అనే దీక్షితార్ కృతిని మృదు మధురంగా ఆలపించి బంగారు పథకాన్ని బహుమతిగా పొందింది ఒక చిన్న 8 ఏళ్ల ఓ బాలిక. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వచ్చిన దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ గారు ఆ బాలికను ప్రశంసించి మళ్లీ అదే కృతిని తిరిగి పాడించుకున్నారు. కొన్నాళ్ళ తరువాత తాను నేపథ్య గాయనిగా ఎదిగి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వేలాది గీతాలను ఆలపించారు. దీపావళి (1960) చిత్రంలో సరియా మాతో సమరాన నిలువగలడా అంటూ సత్యభామ పాత్రధారి అయిన సావిత్రి గారికి నేపథ్య గీతం పాడి ఔరా అనిపించుకున్నారు. తానే ఏ.పి.కోమల. తన పూర్తి పేరు ఆర్కాటు పార్థసారథి కోమల.

సంగీతం మీద విపరీతమైన పట్టు, నేర్పు, అవగాహన ఉండటంతో 1944లో తన తొమ్మిదేళ్ళ వయస్సు లోనే తనకు ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. రేడియోలో ప్రసారమయ్యే గానలహరి కార్యక్రమంలో తాను విద్యార్థినిగా పాల్గొనేది. అక్కడ పనిచేస్తుండగా సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. కోమల గారు ప్రయాగ నరసింహశాస్తి గారి సిఫారసు తో 1946లో చిత్తూరు వి.నాగయ్య తీసిన “త్యాగయ్య” లో తొలిసారిగా సినిమా పాట పాడింది. ఆనందభైరవి రాగంలో “మధురానగరిలో చల్లనమ్మ” అనే ఈ పాటకు తాను 250 రూపాయల పారితోషికం అందుకున్నారు. తాను సినిమాలలో పాడిన తొలిపాట, చివరి పాట తెలుగు పాటలే కావటం విశేషం.

ఎన్టీఆర్ గారు తమ బ్యానర్ కింద ఏ సినిమా నిర్మించినా చిత్రీకరణ మొదటి రోజు ప్రారంభగీతం ఏ.పి.కోమల గారితో పాడించేవారు. పాట రికార్డింగ్ అయిపోయిన తర్వాత కోమల గారు ఇంటికి వచ్చేస్తే ఎన్టీఆర్ గారే స్వయంగా ఇంటికి వచ్చి 116 రూపాయలు పారితోషికం ఇచ్చి వెళ్లేవారట. ఇంతటి మృదు మధుర గాయని ఏ.పీ.కోమల గారు దాదాపు మూడు దశాబ్దాలు తన గానంతో స్వరార్చన చేసినందు గాను ఈ సినీ సంగీత సరస్వతిని చెన్నై ప్రభుత్వం “కలైమామణి” బిరుదుతో సత్కరించింది.

కళాకారులు సున్నిత మనస్కులు. వారి వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఉపద్రవాలు కలిగినా తమ కెరీర్ దెబ్బ తినే అవకాశం ఉంది. అలాంటి ఉదాంతాలు అనేకం తన కళ్ళ ముందు తారసపడడం వలన తాను పెళ్లి చేసుకోలేదు. వేదిక ఎక్కితే చెరగని చిరునవ్వుతో స్నేహితుల మధ్య కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతున్నట్టు ఎంత క్లిష్టమైన పాటనైనా హాయిగా పాడేసే అద్భుత ప్రతిభాపాఠవాలు గల గాయని కోమల గారు. కర్ణాటక సంగీతంలోనే కాకుండా, సినీ సంగీత వేదికపై కూడా శాస్త్రీయ రీతికి చెందిన జావళులు, హాస్య గీతాలు, భక్తి గీతాలు, భజనలు, పద్యాలు, నృత్య గీతాలు అనేకం కోమల గళం నుంచి జాలువారి తెలుగు వారి మనసు వాకిట్లలో నేటికీ పల్లవిస్తూనే ఉన్నాయి.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    ఆర్కాట్ పార్థసారధి కోమల

ఇతర పేర్లు  :    ఏ. పి. కోమల 

జననం    :    28 ఆగష్టు 1934

స్వస్థలం   :     చెన్నై 

తండ్రి       :    పార్థసారథి 

తల్లి       :      లక్ష్మి 

వృత్తి      :    దక్షిణభారత దేశపు నేపథ్యగాయని

భర్త     :    అవివాహితురాలు

నేపథ్యం…

ఏ.పి.కోమల గారు 28 ఆగస్టు 1934 మద్రాసులో జన్మించారు. కోమల గారి పూర్తి పేరు “ఆర్కాట్ పార్థసారథి కోమల”. తండ్రి పార్థ సారథి, తల్లి లక్ష్మి. తన తల్లిదండ్రులకు తాను ఆరో సంతానం. వీరి తల్లిదండ్రులు ఇద్దరు సంగీతారాధకులే. అందువల్ల మూడు నాలుగు సంవత్సరాల వయస్సు లోనే కోమల గారు పాడడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో మద్రాసు రేడియోలో నాదస్వరం వాయించడానికి రాజమండ్రి నుంచి “గాడవల్లి పైడి స్వామి గారు వచ్చేవారు.

అలా వచ్చినప్పుడు తాను ఏ.పి.కోమల గారి ఇంటికి కూడా వస్తూ సంగీతం పట్ల కోమల గారికి ఉన్న ఆసక్తిని గమనించారు. దాంతో తాను ముచ్చటపడి “మీ అమ్మాయిని నాతో రాజమండ్రి పంపండి. సంగీతం నేర్పిస్తానని” కోమలి గారి అమ్మ నాన్నల్ని అడిగారు. వారు ఒప్పుకోవడంతో కోమల గారు రాజమండ్రిలో గురుకుల వాసం చేస్తూ రెండు సంవత్సరాలు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. అక్కడ ఎస్.జానకి గారు కూడా సంగీత పాఠాలు నేర్చుకునేవారు. ఎస్.జానకి గారు కోమల గారికి ఒక సంవత్సరం జూనియర్.

ఆల్ ఇండియా రేడియో లో…

నిజానికి ఏ.పి.కోమల గారి జీవితం అంతా రేడియోలోనే గడిచిపోయేది. అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో గానలహరి అనే కార్యక్రమంలో సంగీత శిక్షణ ఉండేది. ఆ కార్యక్రమంలో తనకు “సంధ్యా వందనం శ్రీనివాసరావు” గారి సంగీతం నేర్పారు. మల్లిక్ గారు లలిత సంగీతం నేర్పారు. అక్కడే బాలాంత్రపు రజనీకాంత రావు, యండమూరి సత్యనారాయణ రావు గార్ల నైపుణ్యం దగ్గరుండి చూశారు. వారు 10 నిమిషాలలో ఆరంభమయ్యే కార్యక్రమానికి అప్పటికప్పుడు పాట వ్రాసి వారే వరుస కట్టి కోమల గారికి నేర్పించేవారు.

అలా అప్పటికప్పుడు పాడటంతో వరుస కట్టుకోవడం కూడా రేడియోలోనే నేర్చుకున్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి “ఆకులో ఆకునై” అనే పాట రేడియోలో తాను పాడిన తొలి లలిత గీతం. ఆ తర్వాత కోమల గారు రేడియో ఉద్యోగి ని అయ్యారు. 1944లో యాభై రూపాయల పారితోషికం, 14 రూపాయల యుద్ధ భత్యంతో ప్రారంభమైన తన రేడియో జీవితం 1995లో గ్రేడ్ వన్ ఆర్టిస్టుగా రిటైర్ అయ్యే వరకు యాభై ఏళ్ళు హాయిగా గడిచిపోయింది. ఆల్ ఇండియా రేడియోలో తనకు హేమాహేమీలు పరిచయం అయ్యారు. స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా అఖిలాంధ్ర శ్రోతలకు దేశభక్తి గీతం ఆలపించి వినిపించిన అదృష్టం కూడా తనకే దక్కింది.

సినీ రంగ ప్రవేశం…

ఆ రోజులే వేరు చిత్తూరు వి.నాగయ్య గారు నిర్మించిన “త్యాగయ్య” లో తొలిసారిగా తనకు పాట పాడే అవకాశం లభించింది. “మధురా నగరిలో చల్లలమ్మ బోదు” అనే పాటను కె.జమునా రాణి తో కలిసి పాడారు. ఆనంద భైరవి రాగం. ఇదే పాటను “అభిమానం” అనే చిత్రంలో పి.సుశీలతో కలిసి పాడారు. అప్పట్లో దాదాపు మూడు నెలలు రేణుక సంస్థలో ఈ పాటకు రిహార్సల్ జరిగింది. మూడు నెలలు నాగయ్య గారే వారికి భోజనాలు చూసుకునేవారు. న్యూటోన్ స్టూడియోలో రెండు రోజుల పాటు ఆ పాటను రికార్డ్ చేశారు. “త్యాగయ్య” సినిమాకు తనకు అందిన పారితోషికం 250 రూపాయలు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బు ఖర్చు పెడితే అయిపోతుంది అని కోమల గారి నాన్న గారు ఇచ్చిన సలహా మేరకు తాను పది సవర్ల బంగారం కొనుక్కున్నారు.

తాను “రక్షరేఖ” లో “ఓహో రాజ సుకుమారా” అనే యుగళగీతం ఘంటసాల తో కలిసి తొలిసారిగా ఆలపించారు. తనను తెలుగులో ఎక్కువగా పాడించిన సంగీత దర్శకులు ఘంటసాల గారే. ఏ.పి.కోమల అంటే ఘంటశాల గారికి చాలా గౌరవం, నమ్మకం. కొత్త పాటలు, క్లిష్టమైన సంగతులు పాడాల్సి వస్తే కోమల గారినే పిలిపించి పాడించేవారు. ఘంటశాల గారు కోమల గారితో “దీపావళి” లో పాడించిన “సరియా మాతో సమరాన నిలువగలడా” అనే పాట అప్పట్లో బాగా ప్రసిద్ధి.

సాలూరి రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వంలో “పెంపుడు కొడుకు”, “రంగులరాట్నం” మొదలైన చిత్రాలలో కోమల గారికి మంచి పాటలిచ్చారు. తనకు పేరు తెచ్చిన “పదములే చాలు రామ” (బంగారు పంజరం) అనే పాట సాలూరి గారి సంగీతంలో పాడినదే. తాను పాడిన చివరి పాట కూడా సాలూరి గారి సంగీత దర్శకత్వం లోనిదే. “యశోదకృష్ణ” లో పి.సుశీల తో కలిసి ఓ పెళ్లి పాట పాడారు.

ఆ పాట తర్వాత తాను సినిమాలకు పాటలు పాడ లేదు. కారణం తెలియదు. ఆమె కంఠంలో మాధుర్యం తగ్గింది లేదు. కానీ ఎందుకో తనకు అవకాశాలు రాలేదు.

తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో ఆనాటి నేపథ్య గాయనీలందరితో కలిసి పాడారు. కన్నడ సినిమాలో పీ.బీ.శ్రీనివాస్ తోను, మలయాళం లో ఏ.ఎం.రాజాతోను పాడారు.

సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు కోమల, లీల గార్లతో కలిపి చాలా పాటలు పాడించారు.

ఎన్టీఆర్ గారి యన్.ఏ.టి సంస్థలో..

ఎన్టీఆర్ గారి స్వంత సంస్థ అయిన యన్.ఏ.టి సంస్థతో కూడా కోమల గారికి మంచి అనుబంధం ఉండేది.

ఆ సంస్థ ఏ చిత్రం తీసినా కూడా షూటింగ్ తొలి రోజు ప్రార్థన గీతం కోమల గారితోనే పాడించేవారు నందమూరి తారక రామారావు గారు.

ఎన్టీఆర్ గారికి కోమల గారంటే ఎంతో గౌరవం.

పాడడం పూర్తి కాగానే ఇంటి దగ్గర దించి రమ్మని తన తమ్ముడు త్రివిక్రమ రావు గారిని పురమాయించేవారు ఎన్టీఆర్ గారు.

వెంటనే కోమల గారికి 116 రూపాయల పారితోషికం ఇచ్చి పంపించేవారు.

ఎన్టీఆర్ గారి “జయసింహ”లో కోమల గారు పాడిన “మురిపెము మీద మీ కోరిక తీర”, “మనసైన చెలి పిలుపు” పాటలు తనకు పేరు తెచ్చిపెట్టాయి.

“పిచ్చి పుల్లయ్య” లో తాను, పిఠాపురం తో కలిసి పాడిన “ఓ పంతులుగారు” అని హాస్య గీతం కూడా మరపురానిదే. తాను తమిళంలో పాటలు పాడిన చివరి చిత్రం “మన్నిప్పు” (1968). యం.యస్. సుబ్బయ్య నాయుడు సంగీత దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో శిష్యురాలు పాత్రకు కోమల గారు, గురువు పాత్రకు పి.సుశీల గారు శాస్త్ర గీతాన్ని పాడారు. “మిస్సమ్మ” చిత్రంలో “బృందావనమది అందరిదీ” అనే పాట మొదట కోమల గారితో పాడించాలని రెండు నెలలు సాధన చేయించారు.

కానీ పారితోషికం దగ్గర తేడా రావడంతో పి.సుశీల గారు పాడారు.

కోమల గారు సినిమా రంగంలో ఎదగడానికి ముఖ్యంగా మలయాళంలో పాడటానికి ముఖ్య కారణం పి.లీల గారే.

కోమల కు ఒక పాట ఇవ్వండి, నేనొకటి పాడుతాను అంటూ సంగీత దర్శకులను అడిగి మరీ అవకాశాలు కల్పించిన సహృదయరాలు. కోమల, పి.లీల గార్లది సుదీర్ఘ స్నేహం.

రేడియోలో సినిమా పాటలు ప్రసారం చేయడం వల్ల లలిత గీతాలకు ప్రాచుర్యం తగ్గుతుంది అనే కారణంతో సినిమా పాటలు రేడియోలో వేయకూడదు అనే నిబంధనలు తీసుకొచ్చారు.

అప్పుడు జీ.వరలక్ష్మి గారు రేడియోలో మన పాటలు వేయడం లేదు కదా, మీరు కూడా రేడియో కళాకారుల చేత సినిమాలో పాటలు పాడించొద్దు అని పట్టు పట్టారు.

దాంతో కోమల గారు కొన్ని సినిమాలలో పాడే అవకాశం కోల్పోయారు.

అదీ కాక ఆ రోజుల్లో కొందరు కథానాయికలు నాకు ఫలానా గాయని మాత్రమే పాడాలని పట్టుబట్టే వారు. దాని వల్ల కూడా కోమల గారికి అవకాశాలు తగ్గిపోయాయి.

సినిమాల్లో ఎన్ని పాటలు పాడినా కూడా కోమల గారికి శాస్త్రీయ సంగీతం అంటేనే ఇష్టం.

త్యాగరాజు కీర్తనలు, దీక్షితార్ కృతులు పాడుకోవడంలో ఉన్న ఆనందం మరి ఎందులోనూ ఉండదు.

రత్నకాంతి, భవ ప్రియ, శ్రీ కంఠి రాగాలంటే తనకు చాలా ఇష్టం. ఈరోజుకీ ఉదయమే దేవుడి ప్రార్థన లాగా రెండు గంటల సంగీత సాధన చేస్తారు.

తన దగ్గరికి వచ్చే పిల్లలకు శాస్త్రీయ సంగీతం నేర్పిస్తుంటారు. తన శిష్యురాళ్ళు చాలామంది విదేశాల్లో స్థిరపడిపోయారు.

కలైమామణి గౌరవం..

ఒకసారి రేడియోలో తాను చేసిన శాస్త్రీయ సంగీత కచేరి విన్న ఎం.జి.రామచంద్రన్ గారు తాను ముఖ్యమంత్రిగా ఎంతో బిజీగా ఉండి కూడా కోమల గారిని అభినందిస్తూ మీ పాండిత్యానికి నా జోహార్లు అని స్వయంగా ఉత్తరం వ్రాశారు.

అలాగే ఓసారి రేవతి రాగంలో అన్నమాచార్య సంకీర్తన పాడారు.

ఆ పాటను రేడియోలో విన్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు తనకు వెంటనే ఇంటికి ఫోన్ చేసి మెచ్చుకున్నారు.

అంతేకాదు రేడియో స్టేషన్ కు వచ్చి కోమల గారిని అభినందించి వెళ్లారు.

నిర్వాన్ సంస్థ బాలమురళీకృష్ణ గారి  చేతుల మీదుగా “మధురవాణి” అనే టైటిల్ ప్రధానం చేసింది. దండపాణి దేశికల్, పెరియార్ అవార్డులు తీసుకున్నారు.

డాక్టర్ కే.వీ.రావు ఘంటసాల గాన సభ తరపున కోమల గారికి ఘంటసాల స్వర్ణ కంకణం ప్రధానం చేశారు. తమిళనాడు ప్రభుత్వం “కలైలామణి” గౌరవాన్ని ప్రసాదించింది.

వ్యక్తిగత జీవితం…

కోమల గారు వ్యక్తిగత జీవితంలో పెళ్లి చేసుకోలేదు. తాను అవివాహితులు. తన నాన్న గారు చిన్నతనంలోనే మరణించారు.

దాంతో కుటుంబ భారం అంతా తన మీద పడడం వలన తాను పెళ్లి చేసుకోలేదు. ఆ రోజుల్లో ఆడదాని సంపాదన మీద కూడా మగవాడి పెత్తనం ఉండేది.

తాను వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే తన పుట్టింటి వాళ్ళని చూసేవారు ఎవ్వరూ ఉండరని వివాహం చేసుకోలేదు. అంతే కాకుండా కళాకారులు సున్నిత మనస్కులు.

వారి వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఉపద్రవాలు కలిగినా కెరియర్ దెబ్బ తినే అవకాశం ఉంది. తమ బంధువులు, మిత్రులు, సన్నిహితులలో అలాంటి సంఘటనలు తాను అనేకం చూశారు.

ఒక గాయనికి ఎంతో ఘనంగా ఒక లాయర్ తో పెళ్లి జరిగింది. ఎంతో మంది చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో చిట్టిబాబు వీణ కచేరి, సాయి సుబ్బలక్ష్మి డాన్స్ ప్రోగ్రాం ఇలా ఎంతో ఘనంగా జరిగినా కూడా అతని స్వార్థపూరిత చింతన వలన వారి సంసారం సాఫీగా సాగాక, ఆమె ఎలా నరకం అనుభవించిందో కోమల గారు కళ్లారా చూశారు.

అత్త, ఆడబిడ్డల ఆరళ్లు, అనుమానాలతో మరో కళాకారిణి తన కేరీర్ ను ఎంత పోగుట్టుకున్నారో కోమల గారికి బాగా తెలుసు.

ఇలాంటి సంఘటనలు చూసి తన కుటుంబ సంక్షేమం కోసం పెళ్లి అనే మాట లేకుండా గడిపారు కోమల గారు. ఎందుకంటే తనకు సంగీతం ముఖ్యం.

సంగీతమే పరమానంద సాధకమని త్యాగరాజ గారు సెలవిచ్చారు. కనుక తనకు తన అన్నయ్య గజపతి, చెల్లెలు గంగ లే సర్వస్వం.

Show More
Back to top button