ప్రస్తుత కాలంలో మారిన జీవనం వల్ల చాలా మందికి నిద్రపోతున్నప్పుడు ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అవరోధాలు ఏర్పడితే గురక వస్తుంది. అలాగే ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. సన్నని మార్గం ద్వారా గాలి తీసుకోవడం వల్ల గుర్ర్.. అనే శబ్దం వస్తుంది. గురకలో రెండు రకాలు ఉన్నాయి. అవి పాథలాజికల్, ఫిజియోలాజికల్ అనేవి. వీటిలో ఫిజియోలాజికల్ గురక సాధారణంగా వచ్చే గురక. దీని వల్ల అంత ప్రమాదం ఉండదు. కానీ పాథలాజికల్ గురక చాలా హానికరమైనదని, దీని వల్ల ‘స్లీప్ అప్నియా’ (నిద్రలో శ్వాస ఆగిపోవడం) జరగవచ్చని పాల్మనాలజిస్టులు చెబుతున్నారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా ఉంటుంది. వాయునాళాలు తక్కువ వ్యాకోచంతో ఉంటాయి. మెడ, గొంతు భాగంలో అధిక బరువు ఉన్నా.. గురక వస్తుంది. టాస్సిలైటిస్, సైనస్ రోగుల్లో కూడా గురక వచ్చే అవకాశం ఎక్కువ. మద్యపానం, ధూమపానం, మానసిక ఒత్తిడి, విపరీతమైన ఆలోచనలు కూడా గురకకు కారణం కావొచ్చు.
* గురక నివారణ ఇలా..
పాథలాజికల్ గురక ఒబెసిటి, బీపీ, గుండె జబ్బులకు కారణమైతుందని వైద్య నిపుణులు అంటున్నారు. హైపో థైరాయిడ్ ఉన్నవాళ్లకు ఈ గురక చాలా ప్రమాదం. కొన్నిసార్లు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. గురక రాకుండా ఉండాలంటే కింది సూచనలు పాటించండి.
* ప్రతిరోజూ రాత్రి నిద్రపోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్ చేయవచ్చు.
* అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
* ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* కొద్దిగా పిప్పర్‌మెంట్ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.
* ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్రపోతే మంచి ఫలితం కనిపిస్తుంది.
* రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. తద్వారా చాలా కంట్రోల్ అవుతుందట.
* వెల్లకిలా పడుకోకుండా పక్కకి తిరిగి లేదా బోర్ల పడుకుంటే గురక రాకుండా ఉంటుంది.