HISTORY CULTURE AND LITERATURE

ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు

ప్రత్యక్ష దైవం ఆదిత్యుడు జీవకోటికి మనుగడ  భాస్కరుడు

భగవంతుడు అంటే కంటికి కనిపించని అద్భుత సృష్టి. కనిపించని ఒక రూపాన్ని దేవుడిగా కొలిచి నమ్మకంతో భగవంతుడిని ప్రతి ఒక్కరూ కోరికలు కోరుకుంటారు. కంటికి భగవంతుడు కనిపించకపోయినప్పటికీ ఆధ్యాత్మిక శక్తి ఉన్నది అనేది భారతదేశంలో వేద పురాణాలు, సనాతన ధర్మం సూచించే దివ్య దృష్టి. భగవంతుడు కనిపించకపోయినప్పటికీ భక్తితో ఆరాధిస్తాము. కంటికి కనిపించే భగవంతుడు సూర్య భగవానుడు మాత్రమే. సూర్య భగవానుడు లేకపోతే సమస్త సృష్టి అంత నిశీధిలో కలవాల్సిందే.  భూమిపై జీవరాశులు మనుగడతో ఉన్నాయంటే అందుకు కారణం ఆదిత్యుడు. ఈ కారణంగానే ఆ సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవం  అంటారు.

హిందూ సంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. ఆయన జయంతిని రథసప్తమిగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు జన్మించిన రోజు అని అర్థం. భక్తులు సూర్య జయంతి రోజు ఆయనను ఆరాధిస్తారు. ఎక్కువగా పూజిస్తారు. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథ సప్తమి, సూర్య జయంతి పండుగ అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పండితులు పరిగణిస్తారు. రథసప్తమి నాడు ప్రతి ఇంట తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానాదులను ఆచరించి సూర్యోదయం అవుతుండగా సూర్యునికి నమస్కారం చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇంటిముందు రథం ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ పువ్వులతో అలంకరిస్తారు. సూర్య భగవానుడు రథం ద్వారా తమ ఇంటికి వస్తాడు అని భక్తుల విశ్వాసం.

ఆదిత్యని ఆరాధన ఇలా చేస్తారు..

సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,

అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.

మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,

కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః

రథసప్తమి రోజున అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇస్తాయని పురాణాల కథనం. 

రథసప్తమి నాడు ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినట్లయితే ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని తెలిపినట్టు వేద శాస్త్ర పండితులు చెబుతున్నారు. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి “అర్కః” అని  కూడా  పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.  

ఏడు అశ్వాల వాహన అధిపతి భానుడు..

సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలు వాహనాలుగా ఉంటాయి. ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలుగా పరిగణించారు. ఈ ఏడు గుర్రాలను వేదఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై సూర్య భగవానుడు స్వారీ చేస్తాడు. 12 రాసి చక్రాలు మేషం నుంచి మీనం వరకు సూర్యుడు ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది.  రథసప్తమి పర్వదినం నాటి నుండే రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుందని అదే రథసప్తమి యొక్క ప్రాముఖ్యత అని వేదాలు చెబుతున్నాయి.

“అర్క” నామంతో సంచరించనున్న భాస్కరుడు..

రథసప్తమి మొదలయ్యే మాసం మాఘమాసం.

మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం అని అంటారు.

కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. మాఘ మాసంలో భాస్కరుడు “అర్క” నామంతో సంచరిస్తాడు. సూర్య భగవానుని ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా, రథసప్తమి నుంచే ఉత్తరాయణస్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుందట. దక్షిణాయణం నుంచి విముక్తుడైన ఆదిత్యుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడట. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి, పితృ, దేవరుషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని వేద పండితులు నిర్ణయించారు.

రథసప్తమి నాడు ఏమి చేయాలంటే..

సూర్య భగవానుడికి ప్రత్యేకమైన రోజుగా పిలవబడే ఈ

రథసప్తమినాడు బంగారముతోగాని, వెండితోగాని, రాగితోగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో అలంకరించి ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమను ఉంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానం ఇవ్వాలి. ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూస్తూ కాలక్షేపం చేయాలి. రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కలుగుతాయి. 

సైన్స్ పరంగా చూసినట్లయితే..

వేద శాస్త్రాల ప్రకారం, భారతీయ హిందూ సంప్రదాయాల ప్రకారం సూర్య భగవానుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయనకు చేసే వ్రత నియమాలు, పూజ నియమాలు ఆరోగ్యాన్ని ప్రసాదించేవి. దైవచింతనతో మాత్రమే కాకుండా సైన్స్ పరంగా చూసినట్లయితే కూడా సూర్యుడు వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అందుకే వైద్యులు ఉదయం ఏడు గంటల నుండి సూర్యోదయ కిరణాలు శరీరానికి తగిలేలా నిత్యం ఉండాలని చెబుతారు. అదేవిధంగా సంధ్యా సమయంలోను ఓ పది నిమిషాల పాటు సూర్యకిరణాలు శరీరాన్ని తాకేలా నిలబడాలని చెబుతారు. ఎందుకంటే సూర్యకిరణాల వల్ల శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోతాయని వైద్యశాస్త్రం చెబుతుంది. ఇప్పటికీ పల్లెటూర్లలో సూర్యోదయం కంటే ముందే లేచి తల స్నానాలను ఆచరించి  సూర్యోదయం అవుతుండగా సూర్య నమస్కారాలు చేస్తారు. దీని వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా ఆరోగ్యంగా మనసు ప్రశాంతంగా మారుతుంది.

సూర్య భగవానుడి ఆలయాలు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లిలో ఉన్న సూర్య దేవాలయం ప్రముఖమైనది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు ఒక కి.మీ దూరంలో ఉంది. ఉత్తరాంధ్రలో ఇది ప్రసిద్ధ దేవాలయంగా చెప్పవచ్చు.ఇది భారతదేశంలో గల సూర్యదేవాలయాలలో ప్రాచీనమైంది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి.

అదేవిధంగా భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో గల కోణార్క సూర్యదేవాలయం, 13వ శతాబ్దానికి చెందిన సూర్య దేవాలయం. ఎర్ర ఇసుకరాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు. రథసప్తమి నాడు ఈ రెండు ఆలయాలలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. రథసప్తమినాడు ప్రత్యేకంగా ఆ రెండు ఆలయాలలోని గర్భగుడిలో ఉన్న సూర్యభగవానుడి విగ్రహం మీద స్వయంగా సూర్యకిరణాలు ప్రసరించి విగ్రహా రూపాలు ప్రకాశవంతంగా దర్శనమిస్తాయి.

Show More
Back to top button