త్వరలో ఐదు రాష్ట్రాల్లో వచ్చే.. శాసనసభ ఎన్నికలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఈ రెండు పార్టీల భవిష్యత్‌కు ఈ ఎన్నికలు పెద్ద పరీక్షే అవ్వనుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్లో మంచి మార్కులు కొట్టేసి అధికారంలోకి రావడానికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దోహదపడతాయనడంలో సందేహం లేదు. మోడీ తొమ్మిదిన్నరేళ్ల పాలనకు.. గతంలో కాంగ్రెస్ పదేళ్ల పాలనకు బేరీజు వేసుకునే విధంగా ఇవి ఉండబోతున్నాయి. అయితే, ప్రధానంగా ఇప్పుడున్న మోడీ ప్రభుత్వ పనితీరునే ప్రజలు అంచనా వేస్తారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాలక పార్టీల పాలనా తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాజస్థాన్‌లో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. అక్కడ కాంగ్రెస్‌కు నెగిటీవ్ పరిస్థితులు తప్పవన్న సంకేతాలు కూడా ప్రారంభం అయ్యాయి. ఇక మధ్యప్రదేశ్‌లోను బీజేపీకి పెద్దగా మార్కులు పడడం లేదు. ఛత్తీస్‌గడ్‌లో అటుఇటుగా పరిస్థితి ఉంది. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన, నియంతృత్వ పోకడలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పదేళ్లుగా అధికారంలో ఉండడం కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ తీరు అంతకన్నా దరిద్రంగా ఉంటుందన్న భావన కూడా ఉంది.
ఈ క్రమంలో అటు ప్రాంతీయ పార్టీలకు, ఇటు జాతీయ పార్టీలకు కూడా ఈ ఎన్నికలను పరీక్షగానే చూడాలి. నవంబరు 7న మొదలై డిసెంబరు 3న ఫలితాల ప్రకటనతో ముగిసే ఈ ఎన్నికల ద్వారా ఎవరి భవిష్యత్ ఏంటన్నది తేలనుంది. రాబోయే ఎన్నికల్లో సరళి ఎలా ఉండబోతుందో అన్న సంకేతాలను కూడా ఇవ్వనుంది. దీనికోసం దేశమంతా ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నది. ఏప్రిల్ లేదా మేలో పార్లమెంటు ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నాయి. శాసనసభల, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఒకే విధంగా వుండక పోయినా ఓటర్ల సరళి, పార్టీల పోకడలు అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ అయిదు రాష్ట్రాల్లో కీలకమైన మూడు హిందీ రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్నది కూడా తెలియనుంది.
ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మళ్లీ అధికారం కోసం బీజేపీ ఎత్తులు వేస్తోంది. గతంలో ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఒక్క మధ్యప్రదేశ్‌లో మాత్రం ఫిరాయింపులతో బీజేపీ గద్దెనెక్కింది. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, చత్తీస్‌గఢ్ భూపేష్పటేల్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తమదే విజయం అని డాంబికాలు పలికినా, చాలా హడావిడి చేసిన బీజేపీకి మునుగోడు దెబ్బ కొట్టింది. సంక్షేమ పథకాలు ,తెలంగాణ సెంటిమెంట్ గట్టెక్కిస్తుందని BRS భావిస్తుండగా కర్ణాటక తరహాలో ఇక్కడా గెలుస్తామని కాంగ్రెస్ నమ్మకంగా వుంది. మొత్తంగా ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ ఎంతగా ప్రజల ఆదరణ పొందుతున్నది ముఖ్యం. మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లో పాగా వేయడం BJPకి అవసరం. అలాగే తెలంగాణలో కనీసం 5-10 సీట్లయినా సాధించగలగాలి. కాంగ్రెస్ పార్టీకి కూడా రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో అధికారం నిలుపుకోవాల్సి ఉంది. మధ్యప్రదేశ్‌లో పోయిన పరువు దక్కించుకోవాల్సి ఉంది. ఇక తెలంగాణలో కూడా కర్ణాటక తరహాలో అధికారం చేపట్టగలగాలి. అప్పుడే వచ్చే.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి నిలబడే శక్తి వస్తుంది. లేకుంటే కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని మోడీ మరింత బలంగా ముందుకు తీసుకెళ్తారు అనడంలో అతిశయోక్తి లేదు.