GREAT PERSONALITIESTelugu Special Stories

ఆంధ్రవిజ్ఞాన సర్వస్వాన్ని స్థాపించిన సాహితీ కృషీవలుడు. కొమర్రాజువెంకటలక్ష్మణరావు!

తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాతగా కీర్తి గడించిన లక్ష్మణరావు పండితులు.. తెలుగువారికి చరిత్ర పరిశోధనలను పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి కృషి చేసిన ఉత్తమ విజ్ఞానవేత్త. 

ఒక విజ్ఞాన సర్వస్వ సంస్థకు సుస్థిరమైన పునాదులు వేసిన సాహితిమూర్తి.. ఆయనే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు.. ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. తెలుగు భాష సాంస్కృతిక, సారస్వత పునరుజ్జీవనానికి కొమర్రాజు విశేష కృషి జరిపారు అనడంలో సందేహం లేదు. తెలుగులో చరిత్ర, పరిశోధనలు, వైజ్ఞానిక గ్రంథాలు లేని కొరతను తీర్చడానికి ఆయన మహోద్యమం గావించారు. తెలుగు చరిత్ర పరిశోధనా పితామహుడిగా పేరొందిన లక్ష్మణరావు వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జీవిత, సాహిత్య విశేషాలను మనం ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:

నేపథ్యం

1877లో కృష్ణాజిల్లా, నందిగామ తాలూకా పెనుగ్రంచిపోలులో జన్మించారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. తండ్రి వెంకటప్పయ్య, తల్లి గంగమ్మ. వీరి పూర్వీకులు సాహిత్యాన్ని ఎక్కువగా అభిమానించేవారు. అప్పటి మునగాల సంస్థానంలో దివాన్‌గా పని చేశారు. లక్ష్మణరావు బాల్యంలోనే తండ్రి మరణించారు. వరుసకు సోదరుడైన శంకరరావు వద్దే ఉంటూ, తన ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు. ఆపై లక్ష్మణరావు మేనమామ అయిన బండారు మాధవరావు నాగపూరు(ప్రస్తుత మహారాష్ట్ర)లో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవభార్య అచ్చమాంబ(ఈమె ప్రముఖ రచయిత్రి) లక్ష్మణరావుకు సోదరి. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ దగ్గరకు వచ్చి చదువుకున్నాడు. పాఠశాల చదివే రోజుల్లోనే ఆయన మరాఠీ నేర్చుకున్నారు. చదువుతోపాటు రచనలు చేయడం అంటే ఎంతో మక్కువ. అలా 1900లో బి.ఏ పట్టా అందుకున్నాడు. అనంతరం, 1902లో ఎం.ఏ.లో ఉత్తీర్ణుడయ్యాడు. తెలుగు, మరాఠీ, ఇంగ్లీషు మాత్రమేకాక సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషల్లో ఆయనకు విశేష ప్రావీణ్యం ఉంది.

సాహితీ కృషి

మహారాష్ట్రలో విద్యాభ్యాసమైన తరువాత ఆయనకు మునగాల రాజా నాయని వెంకటరంగారావు సంస్థానంలో  ఉద్యోగం లభించింది. అప్పటి రాజాకు అభ్యుదయ భావాలు మెండుగా ఉండేవి. పైగా తెలుగు భాషాభిమాని. లక్ష్మణరావు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. ఇందుకు ఆ రాజావారు ఎంతో ప్రోత్సాహామందించారు. మొదటి నుంచి ఆయన సఖ్యతవల్లే, కొమర్రాజుకి తెలుగు భాషాభివృద్ధికి మీద ఆసక్తి పెరిగింది. తిలక్, అగార్కర్, గోఖలే, రనడే… వంటి మన దేశ జాతీయ నాయకుల ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉండేది. దీంతో ‘కేసరి’ అనే మరాఠీ పత్రికలో ఆయన వ్యాసాలు రాయడం మొదలు పెట్టారు.

అప్పట్లో సమాచార్, విజ్ఞాన్ విస్తార్ అనే పత్రికలకు సంపాదకత్వం వహించాడు. మహారాష్ట్ర వంటి పత్రికలలో తరచుగా వ్యాసాలు రాసేవాడు. ప్రాచీన మహారాష్ట్ర కవి మోరోపంత్ రచించిన భారతాన్ని పరిశోధించి, సరిదిద్ది శుద్ధప్రతిని తయారుచేసి కర్ణపర్వానికి ఎడిటర్ గా పని చేశారు. ఆయన సంపాదకత్వం వహించిన మొదటి గ్రంథం ఇదే.

అయినా ఆంధ్రభాషతో కాని, ఆంధ్రదేశ వ్యవహారాలలో పరోక్షంగా ఆయన కల్పించుకునేవారు. నాగపూరులో ఉంటూనే తెలుగు పత్రికలలో వ్యాసాలు రాశారు. అప్పట్లో బెజవాడ క్రైస్తవ పాఠశాల ఉపాధ్యాయులు రాయసం వేంకటశివుడు స్త్రీవిద్యా వ్యాప్తికోసం నడిపిన “తెలుగు జనానా” పత్రికలో అచ్చమాంబ, లక్ష్మణరావుల వ్యాసాలు తరచుగా వచ్చేవి. ఇందులో “శివాజీ చరిత్రము” ఆయన మొదటి తెలుగు గ్రంథం. “హిందూ మహా యుగము”, “ముస్లిమ్ మహాయుగము” వంటి ఆయన వ్యాసాలు వచ్చినప్పటికి, తరువాత “లక్ష్మణరాయ వ్యాసావళి” పేరుతో ఇవన్నీ ప్రచురితమయ్యాయి.

విజ్ఞాన సర్వస్వాలను స్థాపించి

1901లో హైదరాబాదులోని అప్పటి రెసిడెన్సీ బజారులో రావిచెట్టు రంగారావు స్వగృహంలో శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయాన్ని ప్రారంభించారు. దీంతో ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వమును తయారుచేసే మహత్కార్యాన్ని మొదలుపెట్టిన వ్యక్తిగా తెలుగు సాహితీ చరిత్రలో నిలిచిపోయారు. లక్ష్మణరావుతో పాటు రాజా నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహ శాస్త్రి వంటివారి కృషి కూడా ఇందుకు తోడైంది.

1904లో హనుమకొండలో శ్రీ రాజరాజ నరేంద్ర భాషానిలయం, 1905లో సికింద్రాబాద్‌లోని ఆంధ్రసంవర్థినీ గ్రంథాలయాన్ని నెలకొల్పారు.

1906లో విజ్ఞాన చంద్రికా మండలి స్థాపించడంలో కొమర్రాజు లక్ష్మణరావు ముఖ్యభూమిక పోషించారు.

తెలంగాణలో తెలుగు భాష స్థితిని మెరుగుపరచడమే ఈ గ్రంథాలయ స్థాపన ముఖ్య ఉద్దేశ్యంగా అయన తెలిపారు. తెలుగునాట అధునాతన వసతులతో ప్రారంభమైన మొదటి గ్రంథాలయం కూడా ఇదే.

తెలుగు భాషకు ఈ సంస్థ ద్వారా విశేషమైన సేవలు అందాయి. ఆదిరాజు వీరభద్రరావు వంటి మహనీయులు దీనికి కార్యదర్శులుగా పనిచేశారు.

అనంతరం ‘విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి’ ముద్రణాలయాన్ని స్థాపించారు. నాయని వెంకట రంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావుల ప్రోత్సహంతో ఇది వెలసింది.

ఈ మండలి తర్వాతి రోజుల్లో ఆంధ్రా-తెలంగాణల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేసింది. సంఘసంస్కరణ, జాతీయోద్యమం వ్యాప్తి లక్ష్యాలుగా ఈ సంస్థ పనిచేసింది.

అంతేకాకుండా ఈ ముద్రణాలయంలో ప్రపంచ మహాపురుషుల జీవిత చరిత్రలను ప్రచురించడం విశేషం.

ఇది మొదలు 1906-11 మధ్య కాలంలో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి సుమారు 30 గ్రంథాలను ప్రచురించింది. 12వ శతాబ్దంలో మల్లికార్జున శివాచార్యుడు రచించిన ‘శివతత్వసారం’ శతకానికి లక్ష్మణరావు పీఠిక రాశారు.

1912లో దీనికి అనుబంధంగా విజ్ఞాన చంద్రికా పరిషత్తును స్థాపించారు. గ్రంథ పఠనాభిరుచిని పెంపొందించడం ఈ  పరిషత్తు లక్ష్యం.

1916లో కొవ్వూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించిన వారిలో లక్ష్మణరావు ముఖ్యులు. కొంతకాలం కార్యదర్శిగా కూడా పనిచేశారు.

1922లో హైదరాబాదులో లక్ష్మణరావుతో పాటుగా ఆదిరాజు వీరభద్రరావు కలసి ఆంధ్ర పరిశోధక మండలిని స్థాపించారు. చరిత్ర పరిశోధన, శాసన గ్రంథాలను ప్రకటించడం, అముద్రిత గ్రంథాలను ప్రకటించడం ఈ సంస్థ లక్ష్యాలు. తెలంగాణా శాసనాలను ప్రచురించింది. తరువాత కొన్నాళ్ళకు దీనిని లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మార్చడం జరిగింది. ఈ సంస్థ ప్రస్తుతం నామమాత్రంగా హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యాలయంలో ఉంది.

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము

ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారందరికీ పంచిపెట్టాలని ఆయన ఎంతో తపించిపోయాడు. బ్రిటిష్ ఎన్‌సైక్లోపీడియా తరహాలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని స్థాపించాలని ఆయన ఆకాంక్ష. 1912-13 కాలంలో ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టాడు. ఆయనే ఇందుకు ప్రధాన సంపాదకులు, ప్రధాన రచయితగా వ్యవహరించారు. అప్పటికే ఆయనకు అనేక శాస్త్ర సంబంధిత విషయాలలో ప్రవేశం ఉంది.

స్వయంగా పండితులు, ఇందుకు విశేష పరిశోధన గావించారు. ఈ క్రతువులో ఎందరో మహానుభావులు భాగస్వాములయ్యారు.

లెక్కకు మించి వ్యాసాలు రాశారు. ఎటువంటి ధనసహాయం, ప్రభుత్వసాయం లేకుండానే ఇది విజయవంతంగా నడిచింది.

ఒక్కరోజు విడవకుండా లక్ష్మణరావు, హరిసర్వోత్తమరావులు కలిసి, మద్రాసు కన్నెమెరా గ్రంథాలయంలో లభ్యమయ్యే పుస్తకాల నుంచి సమాచారాన్ని సేకరించారు. అనువాదాలకు తావివ్వలేదు.

ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధించి, సమగ్రమైన స్వీయ వ్యాసాలను రాయడమంటే అతిశయోక్తి కాదు.

మొదట ‘అ’ అక్షరంతో నెలకు వంద పేజీల చొప్పున మొదటి గ్రంథాన్ని వెలువరించారు. ఇది మూడు సంపుటాలుగా ప్రచురితమైంది.

ఇందులో విజ్ఞానశాస్త్రము, భాష, ఖగోళశాస్త్రం, చరిత్ర, కళ వంటి వివిధ విషయాలపై దాదాపు 40 వ్యాసాలను కూర్చాడు. అధర్వణవేదం, అద్వైతం, అభిజ్ఞాన శాకుంతలం, అలంకారాలు, అష్టాదశ మహాపురాణాలు, అష్టాధ్యాయి వంటి ఎన్నో వైవిధ్యమైన విషయాలపై కూడా వ్యాసాలు రాశారు.

ఆ రోజుల్లో విజ్ఞాన సర్వస్వంలోని చక్కని ముద్రణ, కాగితం, చిత్రాలు, పటాలు.. ఇతర ఏ ప్రచురిత గ్రంథాలకు సాటి రాలేదట.

తెలుగులో శిలాశాసనాలు, ఇతర గ్రంథాల పరిశోధనలు చేశారు. ఆ సమయంలోనే ఆయనకు ఉబ్బసం వ్యాధి ఎక్కువైంది. మదనపల్లెలో కొంతకాలం విశ్రాంతి తీసుకొని, తిరిగి మద్రాసు చేరుకున్నారు.

ఆంధ్ర సంపుటం రాసేందుకు శాసనాలు పరిశీలిస్తున్న క్రమంలోనే 1923 జూలై 12న లక్ష్మణరావుగారు మరణించారు.

అలా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం లక్ష్మణరావు తర్వాత పరంపరగా కొనసాగుతూ వచ్చింది. ఈ సంస్థ 1986లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమైంది.

ఆ తరువాత ఉర్లాం జమీందారు అయిదు సంపుటాలలో “ఆంధ్ర విజ్ఞానం” అనే పేరుతో 1938-1941 కాలంలో గ్రంథాన్ని ప్రచురించాడు.

ఇతరాంశాలు

లక్ష్మణరావు ప్రత్యక్షంగా దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. కానీ అయన రచనల ద్వారా దేశాభిమానాన్ని చాటుకున్నారు.

బాల్యవివాహాలను వ్యతిరేకించాడు. స్త్రీలలో విద్యాభివృద్ధికి ప్రయత్నించారు.

ఆంధ్రదేశంలో ప్రసిద్ధులైన చరిత్రకారులు, వివిధశాస్త్రవేత్తలు ఆయనద్వారా ఆకర్షితులై ‘విజ్ఞానచంద్రికా గ్రంథమండలి’ ద్వారా దేశానికి పరిచయమయ్యారు. 

గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ప్రముఖ ఆంధ్ర రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథ రచయిత అయ్యదేవర కాళేశ్వరరావు, తెలంగాణా నాయకుడు ఆంధ్రపితామహుడు మాడపాటి హనుమంతరావు, అనేక సాహితీ సాంస్కృతిక సంస్థలకు సేవచేసిన రావిచెట్టు రంగారావు వంటివారు లక్ష్మణరావుకు సహచరులు.

లక్ష్మణరాయ పరిశోధనామండలి కార్యదర్శిగా తెలంగాణంలో చరిత్ర పరిశోధన సాగించిన ఆదిరాజు వీరభద్రరావు లక్ష్మణరావు దగ్గర శిక్షణ పొందినవారే.

విజ్ఞాన సర్వస్వం కృషిలో లక్ష్మణరావుకు తోడుగా నిలిచిన రాయప్రోలు సుబ్బారావు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రథమాచార్యులుగా పనిచేయడం విశేషం.

Show More
Back to top button