వందేళ్ల క్రిందట భారతదేశ స్వతంత్ర పోరాటంలో చేసిన సాహసాల గురించి తెలుసుకునంటే దరిశి చెంచయ్య గారిని ఒక అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి వారితో పోల్చవచ్చు. దరిశి చెంచయ్య గారు జీవించిన కాలం 1890 నుండి 1964 వరకు 74 సంవత్సరాలు. అందులో సగభాగం స్వతంత్ర్య పోరాటానికి, సంఘసంస్కరణలకు వెచ్చించారు. నెల్లూరు జిల్లా కనిగిరిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దరిశి చెంచయ్య గారు తన 22 సంవత్సరాల వయస్సులో 1912లో పై చదువులకోసమని అమెరికా వెళ్లారు. అక్కడికి వెళ్లిన కొద్ది రోజుల్లో విప్లవ పార్టీ “గదర్ పార్టీ” లో స్థాపక సభ్యుడయ్యారు. రెండు నెలల పాటు ఒకవైపు అమెరికాలో వ్యవసాయ శాస్త్రం చదువుతూనే, ఇంకొక వైపు “గదర్ పార్టీ” నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తూ తానే స్వయంగా గెరిల్లా పోరాట విధానాలలో శిక్షణ తీసుకున్నారు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గద్దర్ పార్టీ పన్నిన వ్యూహంలో కీలకమైన పాత్ర పోషించారు దరిశి చెంచయ్య గారు. గదర్ పార్టీలో ఎక్కువ భాగం పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు ఉండగా, చెంచయ్య గారు ఒక్కరే తెలుగువారు. బ్రిటిష్ ప్రభుత్వం మీద దాడి చేయడానికి అమెరికా నుండి ఒక స్టీమర్ మీద ఆయుధాలు నింపుకొని బయలుదేరిన బృందంలో దరిశి చెంచయ్య గారు ఒక్కరే తెలుగువారు. అయితే తన బృందంలోని ఒక మిత్రుడు చేసిన నమ్మకద్రోహంతో బ్రిటీష్ సైనికులకు పట్టుబడి నాలుగు సంవత్సరాలు సింగపూర్, లాహోర్, కలకత్తా, ఢిల్లీ, కణ్ణనూరు మొదలైన జైళ్ళలో నరకాన్ని అనుభవించారు. వమరణం అంచులవరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి, సాహసాలు కూడా ఉన్నాయి. దేశాన్ని వదిలి వచ్చిన ఐదు సంవత్సరాల వరకు కుటుంబ సభ్యులు ఎవ్వరినీ చూడలేదు. 1919లో తాను విడుదలయ్యాక దేశ పరిస్థితులు అన్నీ మారిపోయాయి
1920 నుండి 1935 దాకా 15 సంవత్సరాల పాటు దరిశి చెంచయ్య గారు కాంగ్రెస్ పార్టీని అనుసరించారు. కానీ ఆ పార్టీ రాజీ ధోరణి నచ్చక దాంట్లో క్రియాశీలకంగా పాల్గొనలేకపోయారు. ఆ పదిహేను సంవత్సరాలు బ్రతుకు తెరువు కోసమని వివిధ ఉద్యోగాలు చేస్తూ, ఉద్యోగాలు లేనప్పుడు కేవలం రొట్టెలు తిని మంచినీళ్లు త్రాగి కడుపు నింపుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో నిలదొక్కుకున్న ఆ పదిహేను సంవత్సరాలు అద్భుతమైన సంఘసంస్కరణ కార్యక్రమాలు చేపట్టారు. వితంతు వివాహాలు, శిశు మరణాల నిరోధం, వేశ్యలకు వివాహాలు, మద్రాసు లో కార్మిక ఉద్యమాలు ఇలా ఒకటా, రెండా అనేక కార్యక్రమాల్లో పూర్తిగా అంకితమైపోయారు. 1935లో కమ్యూనిస్టు పార్టీ పరిచయంతో దరిశి చెంచయ్య గారి జీవితం మరో మలుపు కారణమైంది. తాను క్రమశిక్షణ కలిగిన మంచి కమ్యూనిస్టు అయ్యారు. ప్రజానాట్యమండలి, అభ్యుదయ రచయితల సంఘం, కమ్యూనిస్టు ఉద్యమాలు అన్నిటిలోనూ దరిశి చెంచయ్య గారు పాల్గొన్నారు. ఆ క్రమంలో మూడుసార్లు జైలుకు వెళ్లారు. ఆ దశ మరొక 15 సంవత్సరాలు గడిచింది.
1950లో తన 60 సంవత్సరాల వయసులో అనారోగ్య కారణాల వల్ల అన్ని ఉద్యమాలకు దూరమై తన జీవితంలోని మిగిలిన 15 సంవత్సరాలు సాహితీ వేత్త అయ్యారు. తన జీవిత చరిత్రతో పాటు ఇంకా చాలా పుస్తకాలు వ్రాశారు, ఎన్నో కథలు కూడా వ్రాశారు. దరిశి చెంచయ్య గారి భార్య సుభద్రమ్మ గారు కూడా తన భర్త లాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, తనదైన ముద్ర వేశారు. ఆ రోజుల్లోనే సుభద్రమ్మ గారు పిల్లల శిక్షణలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఒక పుస్తకం వ్రాశారు. దరిశి చెంచయ్య గారు వ్యవసాయ శాస్త్ర అధ్యాపకులు, గదర్ పార్టీకి చెందిన విప్లవ వీరులు, గుమస్తా, ఇన్సూరెన్స్ కంపెనీ స్థాపకులు, సంఘసంస్కర్త, కమ్యూనిస్టు, జీవిత చివరి దశాబ్దన్నర కాలంలో రచయిత.
జీవిత విశేషాలు…
జన్మ నామం : దరిశి చెంచయ్య
ఇతర పేర్లు : చెంచయ్య
జననం : డిసెంబరు 1890
స్వస్థలం : కనిగిరి , ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తి : విప్లవవాది, వ్యవసాయ శాస్త్రజ్ఞుడు, రచయిత, సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమర శీలి
జీవిత భాగస్వామి : అన్నపూర్ణ, సుభద్రమ్మ
పిల్లలు : ఇద్దరు
మరణ కారణం : వృద్ధాప్యం
మరణం : 1964
నేపథ్యం…
దర్శి చెంచయ్య గారు డిసెంబరు 1890లో కనిగిరిలో జన్మించారు. వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు పేదవాడే. కానీ చెంచయ్య గారు ఎదిగే నాటికి వాళ్ళ నాన్న గారు 15000 రూపాయలు సంపాదించి వారి ఊరిలో ఒక రకమైన గౌరవప్రదమైన పేరును నిలబెట్టుకున్నారు. చెంచయ్య గారికి ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కయ్యలు, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు. పెద్ద కుటుంబమే, కానీ వాళ్ళ నాన్నగారు కిరాణం దుకాణం నడుపుకుంటూ ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తుండేవారు.
1890 ప్రాంతాల్లో పల్లెటూర్లలో కుల వ్యవస్థ చాలా బలంగా ఉండేది. కనిగిరిలో ఉండే అందరికీ త్రాగునీటికి ఒకే బావి ఉండేది. ఊళ్లో వారంతా ఆ బావిలో నీరు వంతుల వారిగా తోడుకోవాలి. చెంచయ్య గారికి తొమ్మిది సంవత్సరాల వయస్సులో వాళ్ళ ఊరికి ఒక తహసిల్దారు వచ్చారు. ఆయన నౌకరుల సహాయంతో వంతులు లేకుండా ఎప్పుడంటే అప్పుడు మంచినీటిని బావిలోంచి గంగాళం లోకి తోడుకుంటూ ఉండేవారు.
ఆ ఊరిలో అందరూ మంచినీళ్లు పొదుపుగా వాడుకుంటూ ఉంటే ఆ తహాసీల్దారు ఆ నీళ్లను స్నానానికి, బట్టలు ఉతకడానికి వాడేవాడు. ఎన్నో రోజులు చూసి చూసి సహించలేని ఆ ఊరి ప్రజలు తహసీల్దారు పైన తిరగబడ్డారు. తహసీల్దారు పోలీసులను పిలిపించి ఉళ్ళో వాళ్ళ మీద దాడి చేయించాడు. ఆ సంఘటనలో చెంచయ్య గారి నాన్న గారి మీద కేసు పెట్టారు. దాని నుండి బయటపడడానికి బోలెడంత సమయం పట్టింది, డబ్బులు కూడా ఖర్చయ్యాయి. ఈ సంఘటనతో చెంచయ్య గారికి బాగా చదువుకుని తహసీల్దారు కావాలని అనిపించింది. దౌర్జన్యం చేయకుండా పరిపాలన మంచిగా ఎలా చేయాలో వారికి చూపించాలి అనుకున్నారు.
విద్యాబ్యాసం…
చెంచయ్య గారు హై స్కూల్ చదువుల కోసం ఒంగోలు వెళ్ళారు. తాను ఎలాంటి దురాలవాట్లకు బానిసవ్వనని వాళ్ళ నాన్న గారికి మాట ఇచ్చారు. అదే మాట అమెరికా వెళ్ళినా నిలబెట్టుకున్నారు. చెంచయ్య గారు మెట్రిక్యులేషన్ పాస్ అయ్యారు. ఒంగోలులో చదువుతున్నప్పుడే బిపిన్ చంద్రపాల్, చర్ల హరిసర్వోత్తమరావు గార్ల వంటి దేశభక్తుల ఉపన్యాసాలు విన్నారు. తనకు బ్రహ్మ సమాజం కార్యకర్తలతో పరిచయం ఏర్పడింది. తర్వాత మద్రాసులో డిగ్రీ చదువు కోసం వెళ్ళినప్పుడు కూడా తరుచూ రాజకీయ ఉపన్యాసాలు క్రమం తప్పకుండా వినేవారు. దేశ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న ఉద్యమాల గురించి తెలుసుకోవడం ఎక్కువైంది.
అమెరికా బర్కిలీ యూనివర్సిటీకి పయనం…
మద్రాసు పచ్చయ్యప్ప కళాశాలలో చదువుకున్న కొంతమంది విదేశాలకు వెళ్లడం గమనించిన చెంచయ్య గారు తాను కూడా విదేశాలలో చదువుకుని ఉద్యోగం సంపాదించాలనే బలమైన కోరికతో అమెరికా లో “బర్కిలీ విశ్వావిద్యాలయం” లో సీటు తెచ్చుకున్నారు. సరిగ్గా అదే సమయానికి చెంచయ్య గారి నాన్నగారు చనిపోయారు. ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకపోయినా తన బలవంతం మీదే 1912లో తన ఇరవై రెండు సంవత్సరాల వయస్సులో అమెరికా పయనమయ్యారు దరిశి చెంచయ్య గారు. కొలంబో నుండి ఓడలో ప్రయాణం. మధ్యలో జపాన్ లో ఓ మజిలీ.
జపాన్ లో ఉన్న కొద్ది రోజులలో జరిగిన ఒక సంఘటన తనను మరింత ధైర్యవంతంగా చేసింది. వేశ్య గృహానికి తీసుకెళ్లబోయిన ఒక రిక్షావాడిని పోలీసులు చేత మందలింపజేశారు చెంచయ్య గారు. 1912 డిసెంబరు లో శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరలోని బర్కలీ విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు దరిశి చెంచయ్య గారు. బర్కలీ విశ్వవిద్యాలయంలో భారతీయుల కోసం రెండు హాస్టల్ లు ఉండేవి. ఒక దానిలో పంజాబీ వాళ్ళు ఉంటే, ఇంకో హాస్టల్ లో బెంగాలీ, మహారాష్ట్ర, గుజరాత్ ఇలా మిగతా రాష్ట్రాల వారు ఉండేవారు. చెంచయ్య గారికి రెండు హాస్టల్లలో ప్రవేశం దొరికింది. అక్కడే గుంటూరుకు చెందిన భాగవతుల సోమయాజి శర్మ గారు కూడా ఉన్నారు. తనతో చెంచయ్య గారికి మద్రాసు రోజుల నుండి పరిచయం ఉంది.
“గదర్” పార్టీ స్థాపన…
తొందరలోనే చెంచయ్య గారికి బర్కిలీ విశ్వావిద్యాలయం లోని భారతీయ విద్యార్థుల సమూహాల పరిస్థితి అర్థం అయ్యింది. భారతీయ విద్యార్థుల సమూహాలలో ఒక వర్గం వారేమో బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమికొట్టి స్వరాజ్యాన్ని స్థాపించాలి అనుకునేవారు. ఇంకొక వర్గం వారేమో మంచి చదువులు చదివి భారతదేశం తిరిగి వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని అనుకునేవారు. చెంచయ్య గారికి అమెరికా వెళ్ళిన వారం రోజులకే విప్లవ వాదులతో పరిచయాలు పెరిగాయి. కార్యచరణ లో భాగంగా “లాలా హరిదయాళ్” అనే విద్యార్థి అమెరికాలో ఉన్న పంజాబీ యువకుల్ని సమయత్తం చేసి కార్యచరణ తీవ్రతరం చేశాడు.
ఎక్కడ పదిమంది విద్యార్థులు గుమిగూడినా వారికి భారత దేశ స్వతంత్ర్యం గురించి, బ్రిటిషు వారికి వ్యతిరేకంగా విప్ల పోరాటాలు జరపాల్సిన ఆవశ్యకత గురించి ఆవేశపూరితంగా ఉపన్యాసాలు ఇచ్చేవారు లాలా హరిదయాళ్. దానిలో భాగంగానే 1913 మొదట్లోనే శాన్ ఫ్రాన్సిస్కో సభలో గదర్ పార్టీకి అంకురార్పణ చేశారు. దానిలో అత్యధికులు పంజాబీలు, కొంతమంది బెంగాలీలు ఉండేవారు. అందులో ఉన్న ఒకే ఒక్క తెలుగు వాడు మన దరిశి చెంచయ్య గారు.
గెరిల్లా యుద్ధ తంత్రాలపై శిక్షణ…
గదర్ పార్టీ సభ్యులంతా 1925 సంవత్సరం వరకు కాశ్మీర్ రిపబ్లిక్ ని స్థాపించాలన్న ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. గదర్ పార్టీ తరపున ఒక పత్రికను కూడా స్థాపించారు. దాని పేరు గదర్. ఆ పత్రిక కూడా దేశ దేశాలకు విస్తరించింది. చాలా చోట్ల గదర్ పార్టీ శాఖలు మొదలయ్యాయి. వీటన్నింటికీ ప్రత్యక్ష సాక్షి ఒకే కార్యకర్త దరిశి చెంచయ్య గారు. లాలా హరిదయాళ్ ను అమెరికా వారు బహిష్కరించే సరికి ఆ పార్టీ బాధ్యతలను ఇంకొక పంజాబీ యువకుడు జితేంద్రనాథ్ లాహిరి స్వీకరించారు. ఆయన గదర్ పార్టీ యువకులకు యూనివర్సిటీలో గెరెల్లా యుద్ధ తంత్రాలను నేర్పడం మొదలుపెట్టాడు. కత్తి సాము, కుస్తీ, బాక్సింగ్ లాంటి వాటి మీద శిక్షణ ఇచ్చాడు. దరిశి చెంచయ్య గారు కూడా ఇందులో పాల్గొనేవారు.
దరిశి చెంచయ్య గారికి తన ఊరు నుండి బయలుదేరేటప్పుడు ఉన్న పిరికితనం ఇప్పుడు లేదు. దానికి కారణం జితేంద్రనాథ్ లాహిరి నే. చెంచయ్య గారికి బాక్సింగ్ నేర్పించారు. ఎదురు దాడి చేయడం ఎలాగో నేర్పించాడు. చెంచయ్య గారిలో ఉన్న పౌరుషాన్ని నిద్రలేపాడు. ఇవన్నీ తరువాత రాబోయే విప్లవ కార్యక్రమాలకు సంసిద్ధం చేయడంలో ఒక భాగం. ఇలాంటివన్నీ తరువాత సంవత్సరాలలో తాను జైలు పాలు అయినప్పుడు మానసికంగా దృఢంగా ఉండడానికి సహాయం చేశాయి అని తన ఆత్మకథలో వ్రాసుకున్నారు చెంచయ్య గారు. టెర్రరిస్ట్ రహస్య కార్యకలాపాలలో పాల్గొనేటటువంటి యువకులు అవలంభించే విధానాలను చెంచయ్య గారు శిక్షణ పొందారు. వాళ్లందరి ఆశయం ఏమిటంటే భారతదేశంలో వెలుపల విప్లవోద్యమాలను నిర్మించి బయట నుంచి ఒక్కసారిగా భారతదేశం మీద విరుచుకుపడి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలడం.
ఆయుధ సామాగ్రితో థాయ్ లాండ్ పయనం…
ఈ ప్రణాళికలో భాగంగా ఒక సంవత్సరం గడిచింది. 1914 లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. బ్రిటిషు ప్రభుత్వం మీద దాడి చేయడం ఇదే సరైన సమయం అనుకున్నారు గదర్ పార్టీ యువకులు. ఇతర యూనివర్సిటీలలో చేరి మిలిటరీ శిక్షణ పొంది, వ్యవసాయ శాఖలో కూడా పట్ట సంపాదించుకున్నారు దర్శి చెంచయ్య గారు. 1915 మే నెలలో చెంచయ్య గారికి గదర్ పార్టీ నుండి అత్యంత ప్రమాదకరమైన పనిని అప్పగించారు. మరి కొంత మందితో కలిసి ఆయుధాల్ని స్టీమరు మీద శాన్ ఫ్రాన్సిస్కో నుండి థాయిలాండ్ కి తీసుకెళ్లాలి. అప్పట్లో థాయిలాండ్ ను సయామ్ అనేవారు. ముందుగా ఆయుధాలతో బర్మాను వశపరచుకోవాలి. అక్కడి నుండి భారతదేశం లోపలికి దండెత్తాలి. ఆయుధాలు ఉన్న స్టీమరును తీసుకొని దరిశి చెంచయ్య గారి బృందం థాయ్ లాండ్ బయలుదేరింది.
బ్రిటీషు వారికి పట్టుబడి తొలిసారి జైలుకు ..
జర్మనీలో శిక్షణ పొందిన వందలాదిమంది థాయిలాండ్ లో ఈ ఆయుధాల కోసం వేచి చూస్తున్నారు. అక్కడి నుండి సాహాస కృత్యాలు ఒకదానివెంట ఒకటి మొదలయ్యాయి. స్టీమరును థాయిలాండ్ తీసుకెళ్లడం అంత సామాన్యమైన విషయం కాదు. మధ్యలో ఎదురైన నౌకాశ్రయాలు అన్నీ కూడా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంటాయి. ఎక్కడ పట్టుబడినా ప్రాణాపాయమే. అన్నీ తెలిసే విప్లవ కార్యక్రమాలలోకి దూకారు కాబట్టే చెంచయ్య గారు అన్నింటికి సిద్ధపడ్డారు. తనతో పాటు ఇద్దరు గద్దర్ పార్టీ సభ్యులు కూడా ఉన్నారు. అందులో భాగంగా ఒకరు బెంగాల్ చటర్జీ, ఇంకొకరు ఇంకొకరు పంజాబీ జ్యోతి సింగ్.
స్టీమరు జపాన్ లో ఆగింది. అక్కడ ప్రవాసంలో ఉన్న చైనా నాయకుడు సన్ యెట్ సేన్ ని కలుసుకున్నారు. వాళ్ళ అబ్బాయి చెంచయ్య గారికి యూనివర్సిటీలో సహధ్యాయి. సన్ యెట్ సేన్ విప్లవ కార్యక్రమాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెంచయ్య గారికి వివరంగా చెప్పారు. అక్కడి నుండి మనీలాలో ఆగి జర్మన్ రాయబారికి తమ ప్రణాళికను వివరించారు. అక్కడి నుండే సింగపూర్ వెళితే బ్రిటిషు సైనికులకు దొరికిపోతానని సరాసరి బ్యాంకాక్ చేరుకున్నారు. అక్కడ ఒకరోజు బస చేశారు. అక్కడ గదర్ పార్టీ సభ్యులకు ఇవ్వడమే మిగిలి ఉంది. అయితే వాళ్ల బృందంలోనే ఉన్న కోవర్టు సభ్యులు ఇచ్చిన సమాచారంతో బ్యాంకాక్ లోనే బ్రిటిష్ సైనికులు చెంచయ్య గారిని తమతో ఉన్న గద్దర్ పార్టీ సభ్యులను అరెస్టు చేశారు.
కాల్పులకు భయపడని చెంచయ్య...
బ్రిటీషు వారు అరెస్టు చేసిన దగ్గరి నుండి చెంచయ్య గారి జీవితం ఆరు సంవత్సరాలు వివిధ రకాల జైల్లోనే మగ్గిపోయింది. తనను అరెస్టు చేసిన తొలినాళ్ళలో చెంచయ్య గారిని తనతో పాటు ఉన్న బలవంత్ సింగ్, అమర్ సింగ్, ఠాకూర్ సింగ్, శివ ప్రసాద్ గుప్తా, ఛటర్జీ అందరినీ కూడా ఒకే గదిలో చేర్చి గదర్ పార్టీ రహస్యాలు చెప్పమని బెదిరించారు బ్రిటిషు సైనికులు. “పార్టీ రహస్యాలు చెబుతావా లేక తుపాకీతో కాల్చమంటావా, నీకు ఐదు నిమిషాల సమయం ఇస్తున్నాము” అన్నారు బ్రిటిష్ సైనికులు చెంచయ్య గారితో. “నాకు సమయం అక్కర్లేదు కాల్చుకోండి” అన్నారు చెంచయ్య గారు బ్రిటీషు వారితో. చెంచయ్య గారిని గోడకు నిలబెట్టి తుపాకీలు పేల్చారు బ్రిటీషు సైనికులు. బుల్లెట్లు దూసుకెళ్లాయి. కానీ అవి డమ్మీ బుల్లెట్లు. తనను చంపడం ఉద్దేశం కాదు, నిజాన్ని రప్పించడం.
సింగపూర్ జైలుకు తరలింపు…
చెంచయ్య గారి బృందాన్ని రెండు నెలల తరువాత బ్యాంకాక్ నుండి సింగపూర్ తరలించారు. అక్కడికి వారం రోజులు నౌకలోనే ప్రయాణం. నానా ఇబ్బందులు పెట్టారు. ఇద్దరిద్దరిని కలిపి సంకెళ్లు వేసి కాళ్ళను కట్టివేయడమే కాకుండా వారిని ఓపెన్ డెక్ లో పడేశారు. విపరీతమైన చలిలో గజగజ వణికిపోతున్నా గానీ జంట సంకెళ్ళతో బందీగానే ఉండాలి. మలమూత్రాలకు వెళ్లాలన్నా, తిండి తినాలన్నా అన్ననీ అక్కడే. వారిని సింగపూర్ మిలటరీ జైల్లో విడివిడి గదులలో బంధించారు. పడుకోవడానికి ఒక బెంచి, నీళ్లు త్రాగడానికి ఒక ముంత, మలమూత్రాదులకు ఒక కుండ ఇచ్చారు. తుడుచుకోవడానికి ఒక కాగితం కూడా ఇవ్వలేదు. పళ్ళు తోముకోవడం స్నానం చేయడం ఇలాంటివి మర్చిపోవాల్సిందే. అలాంటి ఏకాంతవాస శిక్షణ వల్ల వాళ్లతో ఒకరికి మతి భ్రమించింది. చెంచయ్య గారేమో నరాల వ్యాధి బారిన పడ్డారు (జీవితాంతం ఆ వ్యాధి చెంచయ్య గారిని వేధించింది).
జైలులో చిత్ర హింసలు…
దేశం కోసం దేశమాత విముక్తి కోసం శిక్ష అనుభవించాడే కానీ ఏ క్షణంలోనైనా అప్రూవర్ గా మారి లొంగి పోదామని అనుకోలేదు. సింగపూర్ నుండి కలకత్తా అక్కడినుండి లాహోర్, కణ్ణనూరు, వెల్లూరు, కోయంబత్తూరు, వివిధ ప్రదేశాలు, జైల్లో వివిధ అనుభవాలు, వివిధ చిత్ర హింసలు, లాఠీ దెబ్బలు, బూటు కాలితో తన్నడాలు మామూలే. కొన్నిసార్లు బట్టలు లేకుండా చీకటి గదిలో బంధీ చేస్తూ ఉండేవారు. వీటిని తట్టుకోలేక చెంచయ్య గారు జైలర్ కు ఎదురు తిరిగిన సందర్భాలు, ఎదురెదురుగా పోట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విప్లవ వీరులంటే పంజాబీ, బెంగాలీ యువకులు ఎక్కువగా కనిపించే రోజులలో ఒక తెలుగువాడు చూపించిన తెగువ తెగింపు అది.
జైలు నుండి విడుదల…
1912లో ఇల్లు వదిలాక ఆరు సంవత్సరాల వరకు కుటుంబ సభ్యులను చూడనేలేదు దరిశి చెంచయ్య గారు. 1918లో కణ్ణనూరు జైల్లో ఉండగా చెంచయ్య గారి తల్లి తమ్ముడు వచ్చారు. అప్పటికే ఇద్దరు అన్నయ్యలు, వదినలు చనిపోయారు. తమ్ముడు ఒక్కడి మీదే కుటుంబ బాధ్యత అంతా పడింది. ఆరేళ్లకు జైల్లో ఉన్న కొడుకును చూసిన తల్లి మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ తరువాత 1918 డిసెంబరు లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత దరిశి చెంచయ్య గారి జైలు చివరి మజిలీ అయిన కోయంబత్తూరు జైలు నుండి విడుదల చేశారు. ఆ రోజుల్లో అప్పటివరకు జైల్లో ఉన్న తొలి దక్షిణ భారతదేశ రాజకీయ ఖైదీ దరిశి చెంచయ్య గారు ఒక్కరే.
రాజీ పడని మనస్తత్వం…
సాయుధ పోరాటాలు, కుట్రలు, ఉరిశిక్షలు వీటితో నిండిన గదర్ పార్టీ ప్రపంచంలో నుండి గాంధీజీ చేస్తున్న అహింస ప్రపంచంలోకి అడుగుపెట్టారు దరిశి చెంచయ్య గారు. అప్పటికే తన వయస్సు 30 సంవత్సరాలు. అప్పటినుండి అంటే 1920 నుండి 1935 వరకు చెంచయ్య గారి జీవితంలో ఇంకొక దశ. ఈ దశలోనే దేశ రాజకీయాల పట్ల విముఖత పెరగడం, సంఘసంస్కరణ కార్యక్రమాలను ఉద్యమాలుగా నిర్మించడం, వ్యక్తిగతంగా రెండుసార్లు వివాహాలు, కుటుంబం నిలదొక్కుకోవడం కోసం వివిధ ఉద్యమాలు ఇవన్నీ జరిగాయి.
1920 ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్వాతంత్ర్యం కేవలం రాజకీయ స్వాతంత్రం మాత్రమే. “రాజకీయంగా మా హక్కులు మాకిస్తే మీ పాలనలో మేము కొనసాగుతాం” అనేది కాంగ్రెస్ సిద్ధాంతం. అది కుదరదు అంటే అప్పుడు సంపూర్ణ స్వతంత్ర్యం కోసం పోరాడుతామని కాంగ్రెస్ వాదన. ఈ రాజీ ధోరణి చెంచయ్య గారికి నచ్చలేదు. అప్పటివరకు విప్లవ యోధులతో కలిసి దేశం వెలుపలే ఉండి అంత తీవ్రంగా స్వతంత్ర్యం కోసం పోరాడిన చెంచయ్య గారు కాంగ్రెస్ కు దూరంగా ఉండటం అనేది తాను నమ్మిన సిద్ధాంతాలకు రాజీపడని మనస్తత్వాన్ని సూచిస్తుంది.
సంఘసంస్కరణ ఉద్యమాలతో…
అయితే ఆ 15 సంవత్సరాలు తనలో ఉన్న దేశభక్తిని సంఘసంస్కరణలకు ఉపయోగించారు. ఆ కోణంలో కూడా ఒక క్రమ పద్ధతిలో ఉద్యమాలను ఎంపిక చేసుకుని కృషి చేశారు. 1920 – 21 లో గూడూరులో కొణక కనకమ్మ తో కలిసి మద్యపానం నిషేధం కోసం పనిచేశారు. వేశ్యా వృత్తి నిర్మూలన కోసం పనిచేస్తున్న యామినీ పూర్ణ తిలకమ్మ గారితో కలిసి పనిచేశారు. వేశ్యలకు వివాహం జరిపించడం అనే ఉద్యమం మీద నాలుగేళ్లు పనిచేశారు. బాల వితంతువుల వివాహం కోసం చాలా తీవ్రంగా కృషి చేశారు. ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, చెంచయ్య గారు విజయం సాధించారు. తమ సామాజిక వర్గమైన వైశ్యులలో తొలి వితంతు వివాహం జరిపించిన ఘనత దరిశి చెంచయ్య గారిదే. తాను వేసిన ముందడుగును చూసి ఇతర కులాలలో వితంతు వివాహాలలో వేగం పెరిగాయి.
అన్నపూర్ణమ్మ తో పెళ్లి…
1920 – 1935 మధ్యకాలంలో తన వ్యక్తిగత విషయానికి వస్తే మద్రాసు, గుంటూరు లాంటి ప్రాంతాలలో తనకు సన్మానాలు చేశారు, దేశభక్తుడు అనే పొగిడారు. తన సొంత ఊర్లో తన సామాజిక వర్గం వారు మాత్రం తనను వెలివేస్తున్నామన్నారు. ఆ బెదిరింపులకు చెంచయ్య గారే కాదు, వాళ్ళమ్మ గారు కూడా బెదరలేదు. 1921 లో అన్నపూర్ణమ్మ గారిని వివాహం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఇష్టం లేని చెంచయ్య గారు ఆ వైపు ప్రయత్నాలు విరమించుకున్నారు.
రాజకీయ నాయకులు సహాయం చేస్తామన్న ఒప్పుకోలేదు. కొన్నాళ్లు రొట్టెలు తిని, మంచినీళ్లు తాగి గడిపారు. చివరికి జట్కా బండి కూడా తోలడానికి తాను సిద్ధపడ్డారు. ఎలాగైతే నేమి అడయార్ లో అనిబీసెంటు నిర్వహిస్తున్న నేషనల్ కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది. అది కూడా విద్యార్థులతో విప్లవ ఉద్యమాల గురించి మాట్లాడను అనే ఒప్పందంతో. అయితే అది కూడా ఎక్కువ కాలం సాగలేదు. అనిబీసెంటు మహాత్మా గాంధీ గారిని వ్యతిరేకిస్తూ వ్యాసాలు వ్రాస్తుందనే ఉద్దేశంతో ఆ కళాశాలకు చెంచయ్య గారు స్వస్తిచెప్పారు.
కొంతకాలం రాజీపడి ఇంపీరియల్ ఇండస్ట్రీస్ అనే ప్రభుత్వ కంపెనీలో చేరి ఎరువుల అమ్మడం చేశారు. చెంచయ్య గారు నెల్లూరు వెళ్ళినప్పుడు యువకులు “విదేశీ వస్తు బహిష్కరణ చేయాల్సింది పోయి విదేవ్యశ్రీ వస్తువులు కొనమని అంటున్నారేమి” అని ప్రశ్నించడంతో ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా ఇచ్చేశారు చెంచయ్య గారు. తాను మిత్రులతో కలిసి గుంటూరులో ఒక ఇన్సూరెన్స్ కంపెనీని పెట్టారు. భాగస్వాములు చేసే మోసాలు నచ్చక దాంట్లో నుంచి బయటకు వచ్చేసారు. బ్యాంకు స్థాపించాలని అనుకున్నారు. అది కూడా నచ్చలేదు. అవన్నీ చేస్తూనే సంఘసంస్కరణ కార్యక్రమాలను కొనసాగించారు.
సుభద్రమ్మ తో రెండవ పెళ్లి….
భార్య అన్నపూర్ణమ్మ గారు కూడా భర్త చేపట్టే ప్రతి కార్యక్రమంలోను పాల్గొంటూ ఉండేవారు. పెళ్లయిన పదేళ్లకు తాను చనిపోవడంతో సుభద్రమ్మ గారిని 1931లో ద్వితీయ వివాహం చేసుకున్నారు. మాంటిస్సోరి విద్యా విధానంలో శిక్షణ తీసుకున్న తొలితరం మహిళల్లో “సుభద్రమ్మ” గారు ఒకరు. సుభద్రమ్మ గారు కూడా చెంచయ్య గారు చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ భాగస్వామిగా ఉండేవారు. 1935 వచ్చేసరికి చెంచయ్య గారి వయస్సు 45 సంవత్సరాలు. ఇద్దరు సంతానం సంపాదించింది ఏమీ లేదు. రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేసినా నిలువ చేసింది ఏమీ లేదు. చెంచయ్య గారు మద్రాసులో ఉండగా రష్యా దేశంలో జరిగిన పరిస్థితుల గురించి భార్యతో కలిసి ఒక ఆంగ్ల పుస్తకం చదివారు. అందులో విశేషాలు బాగా ఆకట్టుకున్నాయి.
కార్మిక నాయకుడి గా….
అదే సమయంలో విశాఖపట్నంలో ఏదో ఒక ఉద్యోగం చూసుకొని అక్కడికి వచ్చారు చెంచయ్య దంపతులు. అక్కడ మెడికల్ కళాశాలలో విద్యార్థిగా ఉన్న చండ్ర రాజేశ్వరరావుతో తమకు పరిచయం ఏర్పడింది. రాజేశ్వరరావు చెంచయ్య గారికి మార్క్స్, ఎంగిల్స్ సిద్ధాంతాలను వివరించి చెప్పారు. అక్కడినుండి చెంచయ్య గారికి సోషలిస్టు విధానాల మీద పూర్తి విశ్వాసం ఏర్పడింది. కమ్యూనిస్టు ను పూర్తిగా నమ్మారు. 1936 నుంచి 1940 దాకా కాంగ్రెస్ సోషలిస్టుగాను, అక్కడి నుండి కమ్యూనిస్టు సోషలిస్ట్ గాను మారారు. కమ్యూనిస్టులో కీలక సభ్యుడయ్యారు. మళ్లీ కార్యాచరణ మద్రాకు మారింది. కార్మిక ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. అక్కడి కార్మిక నాయకుడు భాటే తో కలిసి కార్మికులను సంఘటితం చేశారు చెంచయ్య దంపతులు. 50 వేల బీడీ కార్మికులు ఉన్న కార్మిక సంఘానికి చెంచయ్య గారు నాయకుడయ్యారు.
రెండవ సారి జైలుకు…
దేశం మొత్తం మీద శానిటరీ వర్కర్ల సంఘం మద్రాసు లో ప్రారంభమైంది. దానికి మొదటి నాయకుడు చెంచయ్య గారే అయ్యారు. మద్రాసులోనే సిమ్సన్ కార్మిక సంఘం సమ్మెకు చెంచయ్య గారు నాయకత్వం వహించారు. ఆ సందర్భంలో తనను 1946లో అరెస్టు చేసి నెల్లూరు జైల్లో పెట్టారు. దాదాపు మళ్ళీ 20 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తరువాత మళ్ళీ జైలు జీవితం ప్రారంభమైంది. 1946లో చెంచయ్య గారు జైలుకి వెళ్ళేటప్పటికీ రాజకీయ ఖైదీల సంఖ్య 100 లలో చేరింది. ఈసారి చెంచయ్య గారికి జైలులో అనేక మంది రాజకీయాలకు నాయకులతో పరిచయం ఏర్పడింది. టంగుటూరు ప్రకాశం పంతులు గారు, రంగా గారు, బులుసు సాంబమూర్తి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వారు పరిచయం అయ్యారు. చెంచయ్య గారిని రెండేళ్ల తర్వాత 1947లో విడుదల చేశారు.
మూడవ సారి, నాలుగవ సారి జైలుకు…
జైలు నుండి వచ్చాక భార్య “సుభద్రమ్మ” గారితో కలిసి కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఈసారి ప్రజానాట్యమండలి, అభ్యుదయ రచయితల సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. 1946లో అభ్యుదయ రచయితలకు ఆశ్రయమిస్తున్నందుకు సాకుగా చూపించి చెంచయ్య గారిని మూడోసారి జైలుకు పంపించారు. భారతదేశానికి స్వతంత్ర్యం రావడానికి ఒక్కరోజు ముందు 14 ఆగస్టు 1947 నాడు జైలు నుండి విడుదలయ్యారు. చెంచయ్య గారినీ మళ్లీ ఏప్రిల్ 1948లో రాజకీయ పాఠశాలను నడుపుతున్నారు అనే నేపంతో పోలీసులు అరెస్టు చేశారు. నాలుగోసారి జైలుకెళ్ళి 8 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. మధ్యలో వాళ్ళ అక్కయ్య చనిపోతే తాత్కాలిక విడుదల (పెరోల్) ఇవ్వడానికి నెల రోజులు పట్టింది. చెంచయ్య గారు జైలులో ఉండగానే 19 అక్టోబరు 1948లో కమ్యూనిస్టు పార్టీ నుండి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు.
సాహిత్య వేత్త గా “నేను నా దేశం” ఆత్మకథ…
రాజకీయాలనుండి బయటకు రావడం పూర్తిగా తన వ్యక్తిగతమైనది అని అంగీకరించారు. 60 సంవత్సరాల వయస్సులో రాజకీయాల నుండి పూర్తిగా దూరమయ్యారు చెంచయ్య గారు. మిగతా జీవితాన్ని సాహితీ రంగానికి అంకితం చేయాలని భావించి ప్రపంచ సాహిత్యంలోని అద్భుతమైన పుస్తకాలు కనీసం ఒక 100 అనువాదాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1951 మే నెలలో “ఇంటింటి విజ్ఞాన మాల” అనే సంస్థను రిజిస్టర్ చేసి దానిద్వారా విద్యార్థులను కరస్పాండెంట్ కోర్సులు నిర్వహించాలని అనుకున్నారు.
తాను అనుకున్నట్లే తన జీవితకాలంలో 25 పుస్తకాలు ప్రచురించారు. “నేను నాదేశం” అనే ఆత్మ కథను సెప్టెంబరు 1951 లో పూర్తిచేసి 1952లో ప్రచురించారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి ప్రముఖుల జీవిత చరిత్రలు 20 వరకు వ్రాశారు. ఆత్మకథ చివరిలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని భార్య సుభద్రమ్మ గారి కోసం కేటాయించారు. ఆమె 18 సంవత్సరాల వయస్సు లోనే అనిభీసెంటుతో కలిసి “మహిళా భారత సమాజం” అనే సంస్థను స్థాపించారు. డాక్టరు ముత్తు లక్ష్మి రెడ్డి గారితో కలిసి మాంటిస్సోరి స్కూల్ స్థాపనలో విశేషమైన కృషి చేశారు.
కన్నుమూత…
మద్రాసులో మొదలైన మొదటి దళిత సేవా సంఘానికి అధ్యక్షుడు ప్రకాశం పంతులుగారు అయితే, కార్యదర్శి సుభద్రమ్మ గారు. ఆమె కూడా స్వయంగా కొన్ని పుస్తకాలు వ్రాశారు. దరిశి చెంచయ్య గారు 1964లో తన 74 సంవత్సరాల వయస్సులో వివిధ ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. దరిశి చెంచయ్య గారు వ్రాసుకున్న తన “ఆత్మ కథ” ప్రామాణిక ఆత్మకథ అని విశ్లేషకులు అభిప్రాయం. అందులో అవసరమైన చోట తనలోని బలహీనతల గురించి తాను చేసిన పొరపాట్ల గురించి భేషం లేకుండా వ్రాసుకున్నారు దరిశి చెంచయ్య గారు.
ముగింపు…
తన జీవితంలోని మొదటి 20 సంవత్సరాలు, చివరి 15 సంవత్సరాలు మినహాయిస్తే, మిగతా 40 సంవత్సరాలు కూడా దేశం కోసం, సంఘం కోసమే జీవించారు దరిశి చెంచయ్య గారు. అన్నింటినీ మించి గదర్ పార్టీ స్థాపనలో కీలకమైన పాత్ర పోషించిన ఏకైక తెలుగువాడు దర్శి చెంచయ్య గారు. ఆయన గురించి ఈనాటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి 1915 – 1919 మధ్యలో తాను కొనసాగించిన విప్లవ వీరుని జీవిత సంఘటనలతోటి “అడ్వెంచరస్ థ్రిల్లర్స్” సినిమాకు స్క్రిప్టు ను వ్రాసుకోవచ్చు.
చెంచయ్య గారి జీవిత ప్రయాణంలో ఆనాటి ప్రముఖులు ఎందరో తారసపడతారు. గద్దర్ పార్టీ హరదయాళ్ సింగ్, కర్తార్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు బులుసు సాంబమూర్తి గారు, టంగుటూరి ప్రకాశం పంతులుగారు, పట్టాభి సీతారామయ్య గారు, కొనక కనకమ్మ గారు, కమ్యూనిస్టు పార్టీ పుచ్చలపల్లి సుందరయ్య గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, ప్రజానాట్యమండలి గరికపాటి రాజారావు గారు ఇంకా ఎంతోమంది. “నేను నాదేశం” పుస్తకం చదవకపోతే వెంటనే కొని చదవండి. ఒక అద్భుత ప్రపంచంలో విహరించిన అనుభూతి కలుగుతుంది. ఇంతవరకు ఈ వ్యక్తి గురించి ఎందుకు తెలుసుకోలేకపోయాం అన్న భావన తప్పనిసరిగా కలిగి తీరుతుంది.