Telugu Special Stories

హాస్యరచనలకు పెట్టింది పేరు…ముళ్ళపూడి వెంకటరమణ

ముళ్ళపూడి వెంకటరమణ పాత్రికేయునిగా, కథారచయితగా, సినీరచయితగా, నిర్మాతగా ఇలా తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ముళ్లపూడి వారు అచ్చమైన తెలుగు రచయిత. 

తెలుగులో నవలలు, సమీక్షలు, కథలు, సినిమాకథలు, హాస్య కథలు.. ఇలా ఎన్నో ప్రక్రియలు రాశారు.

ముఖ్యంగా తన హాస్యరచనల ద్వారా ప్రసిద్ధులైన… 

ఈయన రాసిన పిల్లల పుస్తకం ‘బుడుగు’కు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం ఉంది.

మిత్రుడు, ప్రఖ్యాత చిత్రకారులైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా  పేర్కొంటారు. అటువంటి గొప్ప కథకులు, స్థితప్రజ్ఞులు.. ముళ్ళపూడి వెంకటరమణగారి జయంతి.. ఈ నెల(జూన్ 28న) కావడంతో.. ఈ సందర్భంగా ఆయన జీవిత, సాహిత్య కృషి విశేషాల గురుంచి ఈరోజున ప్రత్యేకంగా తెలుసుకుందాం:

జననం

1931 జూన్ 28న తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరంలో జన్మించారు ముళ్ళపూడి వెంకట రమణగారు. అసలుపేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం. తల్లి ఆదిలక్ష్మి. అప్పట్లో గోదావరి ఆనకట్ట కార్యాలయంలో పనిచేసేవారట. వీరి పూర్వీకులు బరంపురానికి చెందినవారు. కుటుంబమంతా గోదావరి ఒడ్డున ఒక మేడలో నివసించేవారు. తొమ్మిదేళ్ళ ప్రాయంలో తండ్రి మరణించారు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. చేసేదేంలేక మద్రాసుకు మకాం మారారు. ఒక మెట్టగదిలో ముళ్లపూడి, ఆయన సోదరుడు, తల్లి ఉండేవారట. తల్లి విస్తర్లు కుట్టడం, ప్రెస్సులో కంపోజింగ్‌ పనులు చేసి ఇద్దరూ పిల్లల్ని చూసుకునేవారు. ఆ విధంగానే రమణగారూ మద్రాసులోని పి.ఎస్.స్కూల్ లో 5, 6 తరగతుల వరకు చదువుకున్నారు. ఆపై 7, 8 తరగతులు రాజమండ్రిలోని వీరేశలింగం హైస్కూల్ లోనూ, ఆనర్స్ వరకు కేసరీ స్కూల్ లోనూ చదివారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్కలు, డిబేట్లు, వ్యాసరచన పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ చూపేవారట. హాబీగా ఎప్పుడూ పద్యాలు అల్లేవారు. నాటకాలలో వేషాలు సైతం వేసేవారట.

సాహిత్య కృషి

తెలుగులో హాస్య రచనను ఆరాధించే ప్రతి ఒక్కరికీ రమణగారు సుపరిచితమే. ఆయనకు బాల్యం నుంచి తెలుగు సాహిత్యమంటే మక్కువ ఎక్కువ.

ఫ్రీలాన్సరుగా జీవితం మొదలుపెట్టి ఏకంగా సినిమా రచయితగా ఎదిగారు. తెలుగువారికి విశేష రచనలను అందించారు.

అనువాద రచన ‘ఎన‌‌‌‌‍‌‌‌బై రోజుల్లో భూప్రదక్షిణం’,

ఆయన స్వీయ ఆత్మకథ(కోతి కొమ్మచ్చి ట్రయాలజి)లు ఎంతో ప్రత్యేకం.

ఆయన అక్కినేనిగారి జీవిత చరిత్రను సైతం రాశారు.

1945లో “బాల” అనే పత్రికలో రమణ మొదటి కథ “అమ్మ మాట వినకపోతే”… అనే రచన అచ్చయ్యింది. అందులోనే “బాల శతకం” పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఈ స్పూర్తితో “ఉదయభాను” అనే ఒక పత్రికను మొదలుపెట్టి, ఎడిటర్ గానూ ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎస్సెల్సీతో చదువు ఆపేసిన రమణ… చిన్నాచితకా ఉద్యోగాలు చేశారు. 1954లో ఆంధ్రపత్రిక డైలీలో సబ్ ఎడిటర్‌గా చేరారు. ఆంధ్రపత్రికలో పనిచేసేటప్పుడే బుడుగు రాశారు. పాత్రికేయునిగా రాణిస్తూనే కథారచయితగా ఆయన సత్తా చూపారు.

రెండుజెళ్ల సీత, సీగానపెసూనాంబ, బుడుగు, అప్పారావు వంటి విశేష రచనలు చేశారు.

రచనల జాబితా

బుడుగు– ఇది చిన్న పిల్లల భాష, మనస్తత్వం, అల్లరి గురించి హాస్య ప్రధానమైన బొమ్మలతో కూడిన రచన,

రుణానందలహరి– అప్పులఅప్పారావు అప్పుల ప్రహసనం,

గిరీశం లెక్చర్లు– సినిమాలపై సెటైర్లు,

విక్రమార్కుని మార్కు సింహాసనం– సినీ మాయాలోక చిత్ర విచిత్రం,

రాజకీయ బేతాళ పంచవింశతి-రాజకీయ చదరంగం గురించి ఉంటుంది. ఇవేకాక

ఆయన రచనలు పత్రికలలో వ్యాసాలు, విశ్లేషణలుగా వచ్చినవి ఎక్కువే ఉన్నాయి.

వీటితోపాటు సినిమా కథలు, సంభాషణలు ఉండనే ఉన్నాయి. ముళ్ళపూడి సాహిత్యాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 8 సంపుటాలుగా ప్రచురించింది. అవి, 

కథా రమణీయం-1:  సీతా కళ్యాణం, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్, రాజకీయ బేతాళ పంచవింశతి, ఇతర కథలు…

కథా రమణీయం-2: రుణానందలహరి, కానుక, రాధాగోపాలం, సాక్షి, ఆకలీ- ఆనందరావు, విమానం కథ, ఇతర కథలు…

బాల రమణీయం  బుడుగు,

కదంబ రమణీయంనవ్వితే నవ్వండి, పీఠికలు, వ్యాసాలు, ఇతర రచనలు…

కదంబ రమణీయం గిరీశం లెక్చరర్లు, కృష్ణలీలలు, వ్యాసాలు, ఇతర రచనలు…

సినీ రమణీయం– చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు, స్వదేశీ విదేశీ చిత్రాలపై సమీక్షలు, విక్రమార్కుని మార్కు సింహాసనం కథలు…

సినీ రమణీయం– కథానాయకుని కథ(అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), చలనచిత్ర ప్రముఖులపై వ్యాసాలు…

అనువాద రమణీయం80 రోజుల్లో భూప్రదక్షిణ, పిటి 109,

కోతి కొమ్మచ్చి– ముళ్ళపూడి వెంకటరమణ జీవిత చరిత్ర. (ఇది స్వాతి పత్రికలో ప్రచురితమైంది.)

బాపురమణీయం

బాపు.. ఈ పేరు తెలియనివారు ఉండరేమో బహుశా… ప్రముఖ చిత్రకారుడు, తెలుగు సినిమాల చిత్ర దర్శకుడు… వెంకటరమణ.. పాత్రికేయుడు, కథారచయిత.. ఆయన 14వ ఏటా నుంచి బాపు నేస్తం కావడం విశేషం. యాదృచ్ఛికం ఏంటంటే, రమణగారిది తూర్పు గోదావరి జిల్లా అయితే, బాపుగారిది పశ్చిమ గోదావరి జిల్లా.

రమణగారి రచనకో రూపముంటే.. బాపు బొమ్మ దానికి ప్రాణం పోస్తుంది. అరవైల నాటి “సాక్షి” నుంచి  “భాగవతం” వరకూ వీరు కలిసి చేసిన అద్భుతాలు ఎన్నెన్నో.

బాపు చిత్రసీమలో అడుగుపెట్టాక, ఆయన దర్శకత్వంలో రూపొందిన ప్రతీ చిత్రానికి ముళ్ళపూడి రచన సాగింది. వీరి మైత్రి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ ‘బాపూరమణీయం’గా పేరుగాంచింది. 

చిత్రసీమలో స్నేహం అన్నమాట వినిపించిన ప్రతీసారి ఈ ఇద్దరు మిత్రుల పేర్లు తప్పక వినిపిస్తాయి. 

ముళ్ళ‌పూడి వెంక‌టరమణ పేరు వినగానే వెంటనే బాపూ కూడా గుర్తొస్తారు. వీళ్ళిద్దరూ తీసిన చిత్రాలు అప్పటి తరాన్ని అంతలా నవ్వుల లోకంలో ముంచెత్తాయి. మరీ ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ నటించిన పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, శ్రీకాంత్ నటించిన రాధాగోపాలం, చంద్రమోహన్ నటించిన బంగారు పిచ్చుక.. ఇలా ఎన్నో…

ముళ్ళ‌పూడి చేసిన చిత్రాలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మ‌ళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆయన చిత్ర‌ కథల్లో అంతలా సహజత్వం ఉట్టిప‌డుతుంది.

సంగీతాన్ని దృష్టిలో పెట్టుకుని సంభాషణలు రాసిన మహారచయిత ముళ్ళపూడి. అందుకే, ఆయన సినిమాల్లో కథ, సంగీతం ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి.

సినీ రంగంలో

ఆంధ్రపత్రికలో సినిమా వార్తలు రాస్తున్న సమయంలో రమణగారి సమీక్షలు అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించాయి. అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు… వీరంతా వెంకటరమణ గారు రాసే సినీ సమీక్షలను ఆసక్తికరంగా చదివేవారట. 

ఈ క్ర‌మంలో సినీనిర్మాత డీబీ నారాయణ తాను తీస్తున్న దాగుడు మూతలు సినిమాకు రచన చేయమని ముళ్లపూడిని కోరారట. చాలాకాలం తప్పించుకుని తిరిగిన రమణ.. ఎట్టకేలకు అంగీకరించారు. అయితే, దాగుడుమూతలు షూటింగ్‌ కారణాంతరాల వల్ల ఆలస్యం కావడంతో, డూండీ ఎన్టీరామారావుతో నిర్మించిన రక్త సంబంధం ఆయనకు మొదటి సినీరచన అయింది. రెండో చిత్రం కూడా ఎనీఆ్టర్‌ ప్రధాన పాత్రలో నటించిన గుడిగంటలు, మూడో చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నటించిన మూగమనసులు. అప్పట్లో ఇది క్లాసిక్.. ఈ మూడూ చిత్రాలు సూపర్‌ హిట్ చిత్రాలే కావడంతో రమణ సినీజీవితం ఊపందుకుంది.

తెలుగు సినిమాల్లో పరిపూర్ణమైన హాస్యానికి పెద్ద పీట వేసిన గొప్ప ర‌చ‌యిత‌ల్లో ముళ్ళ‌పూడి వెంకటరమణ ఒక‌రుగా నిలిచిపోయారు. ఆయన పండించిన అనేక మ‌ధుర‌మైన హాస్యరచనలు… ఆయ‌న సాహిత్యంలోనూ, సినిమా రచనల్లోనూ మనకు తారసపడుతుంటాయి.  

వీరిద్దరి(బాపు, రమణ) కలయికలో “బంగారు పిచ్చిక, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, సంపూర్ణ రామాయణం, అందాలరాముడు, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, సీతాకళ్యాణం, గోరంతదీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, రాధా కళ్యాణం, త్యాగయ్య, పెళ్ళీడు పిల్లలు, మంత్రిగారి వియ్యంకుడు, పెళ్ళి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, శ్రీనాథ కవిసార్వభౌముడు, శ్రీరామరాజ్యం” వంటి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాల్లోని మాటలు అప్పట్లో సినీ ప్రేక్షకుల్ని భలేగా అలరించాయి. ఈ చిత్రాలలో కొన్ని సూపర్ హిట్స్ గానూ, మరికొన్ని హిట్స్ గానూ, ఇంకొన్ని మిశ్రమ ఫలితాలను అందించాయి. 

*అలాగే, ఇద్దరమ్మాయిలూ ముగ్గురబ్బాయిలూ, జనతా ఎక్స్‌ప్రెస్, కానుక, నవ్వితే నవ్వండి, పీఠికలు, వ్యాసాలు, కృష్ణలీలలు, చలనచిత్ర ప్రముఖులపై రాసిన వ్యాసాలు, స్వదేశీ విదేశీ చిత్రాలపై సమీక్షలు, కథానాయకుని కథ(అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర), ఇద్దరు మిత్రులు (వెండితెర నవల), తిరుప్పావై దివ్య ప్రబంధం, మేలుపలుకుల మేలుకొలుపులు, రమణీయ భాగవత కథలు, రామాయణం(ముళ్ళపూడి, బాపు), శ్రీకృష్ణ లీలలు.. మొదలైన ర‌చ‌న‌లు ముళ్ళపూడికి ఎన‌లేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టాయి.

లవకుశ చూసిన తరువాత… రాముడంటే 

ఎన్.టి.రామారావే అన్నారు తెలుగువారంతా.

కానీ బాపురమణలు సాహసంచేసి శోభన్ బాబుతో ‘సంపూర్ణ రామాయణం’ తీశారు.

మొదట ఈ సినిమా ఆడకపోయినా, తరువాత ప్రేక్షకుల అపూర్వ అభిమానాన్ని పొందింది. ఎన్నో దేశాల ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ఎంపికైంది. రామాయణాన్ని అంత రమణీయంగా మలచిన వారెవరూలేరంటే అతిశయోక్తి కాదేమో!

గుర్తింపు

*1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు,

*1995లో శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్, చెన్నై నుంచి రాజలక్ష్మి సాహిత్య పురస్కారం,

*అదే ఏడాదిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

ఇతరాంశాలు:

*రామాయణాన్ని అమితంగా ప్రేమించే ఆయన చివరి రచన… శ్రీరామరాజ్యం కావడం విశేషం.

*నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు కోరిక మేరకు విద్యార్థులకు వీడియోపాఠాలు తీశారు.

*తమిళంలో ఘనవిజయం సాధించిన ‘పాశమలర్’ చిత్రాన్ని తెలుగులో ఎన్టీఆర్, సావిత్రితో కలిసి ‘రక్తసంబంధం’గా రీమేక్ చేశారు. ఈ రీమేక్ సినిమాతోనే ముళ్ళపూడివారి సినీ కెరీర్ మొదలైంది. 

*ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘దాగుడుమూతలు’కే ముళ్ళపూడి సోలోగా తొలిసారి పూర్తిస్థాయి కథను అందించారు. ఈ సినిమాకు బంగారు నంది లభించడం మరో విశేషం.

*ఉత్తమ సినీ రచయితగా ఆరుసార్లు నంది పురస్కారాన్ని అందుకున్నారు. 

*ఈయన 2011 ఫిబ్రవరి 24న చెన్నయ్ లో కన్నుమూశారు.

*బాపు గీత.. రమణ రాత… ఇరువురి మైత్రి ఎందరికో ఆదర్శం!

Show More
Back to top button