Telugu Special Stories

వైణిక వాదనలో సుప్రసిద్ధులు, సప్తగిరి సంగీత విద్వన్మణి. చిట్టిబాబు.

ళ అనేది చిట్టిబాబు పూర్వజన్మ సుకృతం. అది సంపూర్ణ దైవానుగ్రహం వల్ల మాత్రమే సంప్రాప్తిస్తుంది. చతుషష్టి కళలకు అధిపతి అయిన అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు ఎవరిపైన గనుక నిలుస్తాయో వారు మాత్రమే కళాకారులు కాగలరు, ఇది సత్యం. ముఖ్యంగా భారతదేశంలో కళలన్నీ దైవదత్తమైనవే. బాహ్యమైన ఐహిక సుఖాల కొరకు కాక, భగవంతుని చేరే సోపానాలు ఈ కళలు. అందునా లలిత కళలైనైనటువంటి సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటివి మనిషిని నైతిక విలువలతో కూడిన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి ఆ పరమాత్మునిలో మమేకం అవ్వడానికి సాధనం లా ఉపయోగపడతాయి.

నాదానికి మూలం వేదమే. సంగీత బీజాలన్నీ సామవేదంలో మనకి వినిపిస్తాయి. ఎన్నో మధురమైన, అద్భుతమైన సంగీత వాయిద్యాలు ఉన్నప్పటికీని వాటన్నిటిలోని వీణ కి విశిష్టమైన స్థానం ఉంది. వీణధారి అంటే సరస్వతి. ఆ దేవత వీణానాథ దివ్య ధ్వని సప్తస్వర ప్రతిభకు మూలం. ఆమె వీణను కచ్చపి అంటారు. ఆమె చిత్తరువు, మూర్తి, స్తోత్రం, వీణ ప్రస్తావన లేకుండా వ్యక్తం కాదు. సరస్వతీ దేవి మాత్రమే కాకుండా పరాశక్తి హస్తాల్లో సైతం వీణ కనబడుతుంది. కాళిదాసు వ్రాసిన నవరత్న మాల స్తోత్రములో పరాశక్తి వజ్రపుటుంగరం ధరించిన వేలుతో మంజుల నాదం సృజిస్తూ శ్రావ్యతకు కారణమవుతున్నదంటాడు.

వీణ భాగాలను కుండ, దండి, యాళి, బుర్ర అనే నాలుగు భాగాలుగా విభజించారు. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమం అనే నాలుగు తంత్రులను వీణకు బిగిస్తారు. ప్రక్కన శృతి తాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అని మూడు తంత్రులను బిగిస్తారు. ఈ వాద్యానికి 24 మెట్లు ఉంటాయి. పనస చెట్టు నుంచి సంగ్రహించిన వీణ సారె వీణ తయారీలో ప్రధానమైన భాగం. వీణ సరస్వతీ దేవి హస్తభూషణం కనుక వైనికులు ఉదయాన్నే వీణను పూజిస్తారు.

“వీణా వాదనా తత్వాంగనా శృతి జతి విశారతా, తాల జ్ఞాన ప్రయాసేన మోక్షమార్గం నియచ్చతి”

ఎవరైతే చక్కని వీణ వాదన నైపుణ్యాన్ని కలిగి ఉంటారో, శృతి, జ్ఞానం కలిగి చక్కటి తాళ ప్రతిభ కనబరుస్తారో, అట్టి వారికి మోక్షము నిశ్చయము. వీణ యొక్క మహత్యం అంత గొప్పది. అనాదిగా ఎంతో మంది వైణికులు తమ వీణా వాదన ప్రతిభతో, పాండిత్యంతో శ్రోతలను భక్తి పారవశ్యాలతో తన్మయులను చేస్తూ, తరింపచేస్తున్నారు. అటువంటి వారిలో ఒక వైణిక సరస్వతి, వైణిక రత్న, వైణిక సార్వభౌమ, గంధర్వ కళానిధి వీణా చిట్టిబాబు గారు ఒకరు.

సితార్ ని తలుచుకోగానే రవిశంకర్ గారు, షెహనాయ్ అనగానే బిస్మిల్లాఖాన్, వేణు గానం అనగానే హరి ప్రసాద్ చౌరాసియా, జలతరంగ్ అనగానే శివకుమార్ శర్మలు మన తలుపులలో కదలాడినట్లే వీణా నిక్వాణం మనకు చిట్టిబాబును స్ఫురింపజేస్తుంది. శృతిపేయమైన ఒక స్వరాన్ని మోసుకొచ్చే పల్లకి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించినప్పుడు అది నిస్సందేహంగా చిట్టిబాబు వీణానాదమే అనిపిస్తుంది.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    చల్లపల్లి హనుమాన్ పంతులు

ఇతర పేర్లు  :    వీణా చిట్టి బాబు

జననం    :     13 అక్టోబరు 1936 

స్వస్థలం   :   కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం

వృత్తి      :   సంగీతము, కర్ణాటక సంగీతము, సంగీత వాద్యమువీణ

తండ్రి    :   చల్లపల్లి రంగారావు,

తల్లి     :   చల్లపల్లి సుందరమ్మ

జీవిత భాగస్వామి    :    సుదక్షిణా దేవి 

మరణ కారణం  :  వృద్ధాప్యం 

మరణం    :   09 ఫిబ్రవరి 1996 

చెన్నై, భారత దేశం

జననం…

చల్లపల్లి చిట్టిబాబు గారు 13 అక్టోబరు 1936 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించారు. ఇతడి తల్లిదండ్రులు చల్లపల్లి రంగారావు, చల్లపల్లి సుందరమ్మలు. వీరు సంగీతాభిమానులు. తమ తల్లిదండ్రులు హనుమానులు అని నామకరణం చేశారు. కానీ ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. ఆ చిట్టిబాబు అనే ముద్దుపేరే తరువాతి కాలంలో తన  అసలు పేరయ్యింది. చిట్టిబాబు గారు తన అయిదేళ్ళ వయస్సులోనే వీణను వాయించడం మొదలుపెట్టారు. ఇతడు అపార ప్రతిభాశాలి. కొన్ని సందర్భాలలో తండ్రి వాయించే తప్పుడు శృతులను సరిచేయటం చూసి, తండ్రి చిట్టిబాబు గారిని మరింత సంగీత సాధన చేసేలా చేసాడు. తన మొదటి ప్రదర్శన 12వ యేట ఇవ్వడం జరిగింది. మొదట్లో శ్రీ ఎయ్యుని అప్పలాచార్యులు, పండ్రవడ గారి వద్ద శిష్యరికం చేసారు. తరువాత మహామహోపాధ్యాయ డాక్టరు బిరుదాంకితులు ఈమని శంకరశాస్త్రి గారి వద్ద ముఖ్య శిష్యుడయ్యారు.

బాల్యం..

చిట్టిబాబు గారి తండ్రి చల్లపల్లి రంగారావు గారు ఒకరోజు వరవీణా మృదుపాణి అనే గీతాన్ని వీణ మీద వాయిస్తున్నారు  ఆరు బయట ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిట్టిబాబు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి “ఇలా కాదు నాన్నా వాయించవలసింది” అంటూ వీణను తీసుకొని వాయించి చూపాడు. ఇంత చిన్న వయస్సులోనే అతని ప్రతిభకు, నిర్మొహమాటత్వానికి తండ్రి ముగ్దులైనారు. తన కుమారుడు “హనుమాన పంతులు” లోని నిగూఢమైన విదృత్తును గుర్తించారు వాళ్ళ నాన్న గారు. అప్పట్లో వాళ్ళు ఉంటున్న పిఠాపురంలో తన అక్షరాభ్యాసాన్ని వాయిదా వేసి అలనాటి ప్రముఖ వైణికుడు పడ్రవాడ ఉప్మాకయ్య వద్ద శిష్యునిగా చేరారు.

వీణా వాద్యంలో శిక్షణ…

ఇక్కడ వాద్యాభ్యాసం తర్వాత కాకినాడలోని ఇయ్యాని అప్పలాచార్య వద్ద శిష్యునిగా చేరి తన పన్నెండవ యేటనే కచేరి చేసే స్థాయికి ఎదిగాడు. 1948లో పిఠాపురం లో స్థానిక ప్రముఖుల సమక్షంలో కచ్చేరి చేసి అందరి మన్ననలు అందుకున్నారు. ఆ తర్వాత చిట్టిబాబుని తన తండ్రి మద్రాసు లోని ఈమని శంకర శాస్త్రి వద్ద చేర్పించారు. అయితే అంతకు ముందే శంకర శాస్త్రి గారి వీణా వాదన విని ప్రభావితులైన చిట్టిబాబు గారు ఈమని శంకర శాస్త్రి గారిని తన మానస గురువుగా భావించారు. “అంత గొప్ప వ్యక్తి, విధ్వాంసులు నా గురువుగా లభించడం నా పూర్వ జన్మ పుణ్యం” అని చిట్టిబాబు గారు పలు సందర్భాలలో తానే స్వయంగా చెప్పుకొచ్చారు.

ఈమని శంకర శాస్త్రి, చిట్టిబాబు గార్ల గురుశిష్య బంధం చాలా విచిత్రమైనది. అదేమిటంటే ఏనాడు  కూడా శంకర శాస్త్రి గారు ఇది నేర్చుకో, ఇలా వాయించు, ఇది పద్ధతి అని చెప్పిన గురువు కాదు. చిట్టిబాబు గారు కూడా శాస్త్రి గారిని ఏనాడు ఏది అడిగిన వారు కాదు. గురువు సాధనను అనుసరించడం, చూసి నేర్చుకోవడం చిట్టిబాబు గారికి నిత్య కృత్యం. ఎప్పుడైనా దీన్ని “అలా అంటే బాగుంటుంది” అని ఒకటి రెండు సలహాలు ఇవ్వడం, వాటిని పాటించడం అంతే తప్ప ఏ నియమబద్ధమైన శిక్షణ ఉండేది కాదు. ఏనాడు పెద్దగా నోరు విప్పి సందేహాలు, సలహాలు అడిగిన వైనం లేదు. ఎప్పుడైనా కచ్చేరీకి వెళ్ళవలసి వచ్చినప్పుడు “ఏమోయ్ రేపు కచ్చేరీ ఉంది సిద్ధం కా” అంటే చిట్టిబాబు గారు భయపడుతూ సిద్ధం అయ్యేవారు.

సినిమా రంగం లోకి…

శంకర శాస్త్రి గారు చిట్టిబాబు గారికి తాను పెద్దగా నేర్పవలసింది ఏమీలేదని అంచనా వేయడం వల్లనే వారిరువురి గురుశిష్యానుబంధం అంత చిత్రంగా సాగింది. మాములుగానే సంగీత విద్వాంసులకు, సినిమా వారికి మధ్య సంబంధాలు ఉంటుంటాయి. అందులోనూ చిట్టిబాబు గారు మద్రాసులో ఉండి ఈమని శంకర శాస్త్రి గారికి శిష్యరికం చేస్తుండడం వల్ల సినిమా వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. దాంతో భరణి పిక్చర్స్ వారి “లైలా మజ్ను” అనే సినిమాలో నటించేందుకు ఒక స్ఫూరదౄపి అయిన కుర్రవాడి కోసం ప్రయత్నిస్తుండగా వారికి చిట్టిబాబు గారు తారసపడ్డారు. దాంతో తనకు ఆ అవకాశం వచ్చింది. ఆ సినిమా టైటిల్ లో “మాస్టర్ హనుమాన పంతులు” అని వేయవలసి రావడంతో ఆ సినిమాకు కథానాయిక అయిన భానుమతి గారు ఆ పేరేమి బాగోలేదని ఇంట్లో ముద్దుగా పిలిచే చిట్టిబాబు పేరునే ఖరారు చేశారు. కాలక్రమేనా తనకు చిట్టిబాబు అనే పేరు స్థిర పడిపోయింది.

మరోవైపు 1950 – 60 దశకాల మధ్య దక్షిణాది భాషల చిత్రాలలో వీణ పాటలన్నింటికీ చిట్టిబాబు గారే వీణ వాయించి తన ప్రతిభ చాటుకున్నారు. ఏమని పాడెదనో ఈవేళ (భార్య భర్తలు), పాడమని నన్నడగవలెనా (డాక్టర్ చక్రవర్తి), పాడవే రాధిక ప్రణయ సుధా గీతిక వంటి తెలుగు పాటలకు వీణ వాదన చేసింది చిట్టిబాబు గారే. 1960 వ సంవత్సరంలో మద్రాసు లోని కృష్ణ గాన సభలో తొలి ప్రధాన కచ్చేరి చేశారు. ఆ తర్వాత అతిరథ మహారథుల చేత ఆహ్వానాలు అందుకుని అనేక కచ్చేరీలు చేశారు. కాలక్రమంలో చిట్టిబాబు గారి వీణావాదన  మద్రాసు వాసులకు వీనులవిందుగా మారిపోయింది. జాతి గర్వించదగిన కళాకారుడైన గారు కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ఆయా సందర్భాలను బట్టి ప్రపంచమంతా గౌరవించింది. 1967 వ సంవత్సరంలో మైసూరు మహారాజా వారు వైణిక శిఖామణి బిరుదుతో సన్మానించారు.

వీణ శేషణ్ణ తర్వాత మహారాజా వారు గౌరవించింది మన చిట్టిబాబు గారినే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సప్తగిరి సంగీత విద్వన్మణి గా, ఆస్థాన విధ్వాంసులుగా గౌరవం అందుకున్నారు. కృష్ణ గాన సభ మద్రాసు సంగీత చూడామణి గా, ఆంధ్ర యూనివర్సిటీ వారిచే కళాపూర్ణ, 1984 వ సంవత్సరంలో కేంద్ర సాంఘిక నాటక అకాడమీ అవార్డు కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులుగా, 1993 వ సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదుతో, ఇంకా వైణిక సార్వభౌమ, వీనగణ ప్రవీణ, గంధర్వ కళానిధి, వైణిక సామ్రాట్, వైణిక రత్న, తంత్రి విలాస్, కళా రత్న వంటి పురస్కారాలు తనను వరించి తమ గౌరవాన్ని మరింత పెంచుకున్నాయి. ఉన్నయ్ పోల్ ఒరువన్, దిక్కట్ర పార్వతి, రాఘవ వైభవం చిత్రాలకు చిట్టిబాబు గారు సంగీత దర్శకత్వం వహించి పురస్కారాలు అందుకున్నారు.

వ్యక్తిగత జీవితం…

వీణా చిట్టిబాబు గారి భార్య పేరు సుదక్షిణా దేవి. తన ఇంటిపేరు భోగరాజు.

ఈవిడ ప్రముఖ భారత జాతీయ నాయకులు స్వర్గీయ శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య యొక్క మనవరాలు.

వీరు డాక్టర్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు. మహాత్మా గాంధీ మరియు నెహ్రూ గార్లతో చాలా సన్నిహితంగా పనిచేశారు.

భోగరాజు గారు 1939లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. (కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి చేతిలో ఓడిపోయారు), ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు కూడా. ఆ తర్వాత మధ్యప్రదేశ్ గవర్నర్‌గా (1952-1957) పనిచేశారు.

వీరి మనుమరాలు, వీణా చిట్టిబాబు గారి భార్య అయిన సుదక్షిణా దేవి గారు 2011లో మరణించారు.

బిరుదులు, సత్కారాలు..

★ చిట్టిబాబు గారికి 1967 వ సంవత్సరంలో మైసూరు మహారాజా వారు “వైణిక శిఖామణి” పురస్కారాన్ని ప్రదానం చేశారు.

★ తిరుమల తిరుపతి దేవస్థానం వారు చిట్టిబాబు గారికి సప్తగిరి సంగీత విద్వన్మణి పురస్కారాన్ని బహుకరించారు.

★ కృష్ణగాన సభ, మద్రాసు వారు సంగీత చూడామణి అనే పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు.

★ ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు 1984 వ సంవత్సరంలో కళాప్రపూర్ణ  బిరుదునిచ్చి సత్కరించారు.

★ కేంద్ర సంగీత నాటక అకాడమీ వారు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆవార్డునిచ్చి సన్మానించారు.

★ కంచి కామకోటి పీఠం వారు చిట్టిబాబు గారికి “ఆస్థాన విద్వాంసుడు” బిరుదునిచ్చి గౌరవించారు.

★ తమిళనాడు ప్రభుత్వం వారు చిట్టిబాబు గారికి కలైమామణి బిరుదునిచ్చి సత్కరించారు.

★ వైణిక సార్వభౌమ

★ వీణాగాన ప్రవీణ

★ గంధర్వ కళానిధి

★ వైణిక సమ్రాట్

★ వైణికరత్న

★ తంత్రీవిలాస్

★ కళారత్న లాంటి అనేక పురస్కారాలు వరించాయి.

నిష్క్రమణం…

స్వదేశంలో మాత్రమే కాకుండా, విదేశాల్లో సైతం కచేరీలు చేసి ప్రశంసలు అందుకున్నారు.

బల్గేరియా, హంగేరి, పశ్చిమ జర్మనీ, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, కెనడా, లండన్, ఆస్ట్రేలియా, మస్కట్, బహ్రెయిన్ తదితర దేశాల్లో వందలాది కచేరీలు చేశారు.

హాంగ్ కాంగ్ లో జరిగిన ఆసియా సంగీతోత్సవాలకు ఏకైక భారతీయ ప్రతినిధిగా హాజరైన ఘనత మన గారికి దక్కింది. చిట్టిబాబు గారు 25 ఎల్.పి. లు ఇచ్చారు. “మ్యూజింగ్స్ ఆన్ మ్యూజీషియన్”, “రాధా మాధవమ్”, “శివలీలా విలాసమ్”, “టెంపుల్ బెల్స్” వంటివి చిట్టిబాబు గారి నుండి రికార్డులుగా వెలువడ్డాయి.

ఇంకా తన గురువు ఈమని శంకర శాస్త్రి గారు వారు జీవించి ఉండగానే ఆంధ్ర వర్సిటీ నుంచి “కళా ప్రపూర్ణ” పొందిన అరుదైన ఘనత చిట్టిబాబు కు దక్కింది.

దూరదర్శన్ లో కళాకారులపై నిర్మించిన “సాధన” టెలీ సీరియల్ లో ఒక భాగం మన గారిపై చిత్రీకరించడం విశేషం.

ఎక్కువగా ప్రచారంలో లేని “మోహనాంగి”, “బిందుమాలిని” వంటి రాగాలకు అతి రమణీయ శైలిలో పరిచయం చేసి ప్రాచుర్యం కల్పించారు .

ప్రతి ఏటా తిరువాయూర్ త్యాగరాజ ఆరాధనోత్సవాలలో తప్పనిసరిగా పాల్గొనేవారు చిట్టిబాబు గారు. ఎప్పటిలాగే ఆ సంవత్సరం కూడా వెళ్లి కచేరి చేసి వచ్చారు. అయితే త్యాగరాజు స్వామి తనువు చాలించిన బహుళ పంచమి రోజునే 09 ఫిబ్రవరి 1996 నాడు తన వీణ తంత్రులను వీడి స్వరయాత్రను ముగించారు. చిట్ తన 59 ఏళ్ల జీవితకాలంలో 50 వసంతాల పాటు   వీణంటే ఆరో ప్రాణంగా బ్రతికిన చిట్టిబాబు గారు సంగీత ప్రియులకు వీణా విద్వన్మణి గా చిరస్మరణీయులు.

Show More
Back to top button