Telugu Special Stories

నల్లవారి అభ్యున్నతి కోసం పాటుపడిన దార్శనికుడు.. అబ్రహంలింకన్!

మానవతావాది, నిస్వార్థ ప్రజాస్వామ్య నేత.. 

స్వేచ్ఛ, సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు.. ఆయనకు ముందు 15మంది, తర్వాత 28మంది అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. కానీ, ఎవ్వరూ ఆయన స్థాయిని చేరుకోలేకపోయారంటే అతిశయోక్తి కాదు.. 

ఆయనే అబ్రహం లింకన్.. 

పరిచయం అక్కరలేని పేరు..  

పేదరికంలో పుట్టి, చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడం, 8సార్లు పోటీ చేసినట్లే చేసి.. వరుసగా ఓడిపోవడం, అరుదైన వ్యాధితో ఎన్నో నెలలు మంచాన పడటం.. ఇన్ని రకాలుగా ఫెయిల్యూర్ ని చవిచూసినా.. ఏ రోజు ఓటమిని తాను అంగీకరించలేదు.. 

ఈసారి 9వ ప్రయత్నంలో గెలుపొందాడు.. అది మాములు గెలుపు కాదది.. ఆయన్ను చరిత్రలో నిలిచేలా చేసింది. అగ్రదేశానికి అధ్యక్షుడిని చేసింది. 

అమెరికా దేశానికి 16వ అధ్యక్షుడిగా పని చేసిన అబ్రహం లింకన్ జయంతి ఈ నెల(ఫిబ్రవరి 12)న కావడంతో, ఈ సందర్బంగా ఆయన గురుంచిన విశేషాలను ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం:

జననం

1809, ఫిబ్రవరి 12న అమెరికాలోని కెంటకీలో థామస్ లింకన్, నాన్సీ హాంక్స్ లింకన్ దంపతులకు జన్మించారు అబ్రహం లింకన్. చిన్నప్పటి నుంచీ ఎంతో చురుకుగా ఉండేవాడట. తండ్రి వడ్రంగి పనులు చేస్తుండేవారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తరచూ వలస వెళ్ళేవారు. దీంతో పెద్దగా చదువుకోలేదు. తన తొమ్మిదేళ్ల వయసులో విషజ్వరాల కారణంగా తల్లిని పోగొట్టుకున్నాడు. ఇది లింకన్ ను  ఎంతగానో కుంగదీసింది. అనంతరం ఆయన తండ్రి రెండవ వివాహం చేసుకున్నారు. అయితే వచ్చిన సవతి తల్లి తారతమ్యాలు చూపకుండా లింకన్ ని బాగానే చూసుకునేదట. ఇక తన సోదరుడు, సోదరిలను సైతం 19ఏళ్ళ వయసులోనే కోల్పోయాడు. చదువు లేకపోయిన చిన్ననాటి నుంచి తన దేశానికి ఏదో చేయాలనే తపన మాత్రం లింకన్ మనసులో ఎప్పుడూ ఉండేది. పదేళ్ల వయసప్పటి నుంచే అమెరికా అధ్యక్షుడిని కావాలని ఆశపడ్డారట. ఆలా యుక్తవయసులోకి వచ్చిన తరువాత రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 

రాజకీయ ప్రస్థానం

1832లో ఇల్లినాయిస్ రాష్ట్ర శాసనసభకు తొలిసారి పోటీచేసి, ఓడిపోయాడు. అయితే 1834 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. తర్వాత కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండి, న్యాయవాద వృత్తి చేపట్టాడు. చదువు లేనప్పుడు న్యాయశాస్త్రం ఎలా చదివారన్న సందేహం కలుగక మానదు. ఎందుకంటే అతను న్యాయశాస్త్రాన్ని తనంతట తానే అభ్యసించి, న్యాయవాదిగా ఎంతో ఉన్నతస్థానానికి చేరాడు. అమెరికాలోని తెల్లజాతీయులు నల్లవారిని హింసించడం లింకన్‌కు ఏ మాత్రం నచ్చలేదు. వారి తరఫున వకాల్తా పుచ్చుకొని ఎన్నో కేసులు వాదించాడట. ఇదే క్రమంలో మరోసారి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడట. 

1860లో అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అబ్రహం లింకన్‌ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచాడు. ఆయనకు పోటీగా సౌతర్న్  డెమొక్రాటిక్‌, కాన్‌స్టిట్యూషన్‌ యూనియన్‌, నార్తర్న్‌ డెమొక్రాటిక్‌ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల ప్రకటన ఇచ్చినప్పటినుంచి అబ్రహం లింకన్‌ కు సానుకూల అంశాలు ఎక్కువగా ఉండటమే ఆయన అధ్యక్షుడయ్యేందుకు ప్రధాన కారణమైంది. దాదాపుగా 8సార్లు ఓటమిని చవిచూసిన తరువాత చివరికి 9వసారి తన కళను సాకారం చేసుకుని అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన విజయం..

వ్యక్తిగత మైందికాదు. అమెరికా చరిత్రనే గొప్పగా మార్చివేసిన విజయంగా చెప్పుకోవాలి. ఇక తన మ్యానిఫెస్టోలో ప్రముఖంగా లింకన్ చేర్చిన అంశం.. బానిసత్వం రద్దు చట్టాన్ని అమలు చేయడం. ఇతరులను అందులోనూ, నల్లజాతీయులను బానిసలుగా చేసుకుని వారితో నానా వెట్టిచాకిరి చేయించుకునే విధానానికి ముగింపు పలకాలని నిర్ణయించాడు.

అధ్యక్ష పదవి దక్కిన వెంటనే ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం… 13వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో బానిసత్వాన్ని రద్దు చేసేలా ఉత్తర్వులు జారీ చేయడమే.

తోటి మనిషిని సమానంగా చూడకపోతే ఇక ఈ మనుగడకు అర్థమేంటి.. దేవుని ఎదుట ప్రతి ఒక్కరు సమానమే అని చాటిచెప్పడానికే తాను ఈ సవరణ చేసినట్లు చెప్పేవారాయన. అయితే ఈ ఒక్క నిర్ణయంతో అమెరికాలో ఒకరకంగా అంతర్యుద్ధం మొదలైందని చెప్పాలి. 11 రాష్ట్రాలు దేశం నుంచి కాన్ఫిడరేట్ స్టేట్స్ గా విడిపోయి, రాబర్ట్ లీ అధ్యక్షతన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు సాగించాయి. 

1861-65 మధ్యలో చూసుకుంటే, అమెరికాలో సివిల్ వార్ జరిగింది. కాగా దీన్ని లింకన్ తన బలంతో అణచివేశారు. 

1865, ఏప్రిల్ 10న ఎవరి కారణంగా అయితే ఉద్యమాలు జరిగాయో.. అతనే లొంగిపోవడంతో అంతర్యుద్ధం పూర్తిగా ముగిసిపోయింది. అప్పుడే బానిసత్వ రద్దు చట్టం అమల్లోకి రావడం జరిగింది. అక్కడి నుంచి తమ దేశంలోని పలు చోట్ల మగ్గుతున్న ఎందరో నల్లజాతీయులు పూర్తి స్వేచ్చని పొందారు. 

అయితే కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకించడంతోపాటు లింకన్ ను హతమార్చాలని అనుకున్నారు. ఇందుకు కారణం నల్ల జాతీయులకు ఓటు హక్కు కల్పిస్తామని  చెప్పడమే.. దీంతో కొందరు శ్వేతజాతీయులు లింకన్‌ను చంపాలని పథకం వేశారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన లింకన్‌ను 1865 ఏప్రిల్ 14న వెనుక నుంచి జాన్ విల్క్స్ అనే డ్రామా ఆర్టిస్ట్ తుపాకీతో కాల్చిచంపాడు. అతను తలపై కాల్చడంతో ఒక్కసారిగా కిందపడిపోయిన లింకన్ కోమాలోకి వెళ్లారు. ఇది తెలిసి, అక్కడి సమీప ఆసుపత్రికి వెంటనే ఆయనను తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో, తర్వాతి రోజైన.. ఏప్రిల్ 15న ఉదయం మరణించారు.

అయితే అబ్రహం లింకన్ మరణం వెనుక ఇతర కారణాలు లేకపోలేదు. మిస్టరీగా మిగిలిపోయింది. కొన్ని ఆర్ధిక కారణాలు కూడా ఉన్నాయని, అందుకే అప్పట్లో ఆయనని కాల్చిన సదరు రంగస్థల నటుడు జాన్ విల్క్స్ బూత్ ని రహస్యంగా అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన కొందరు వ్యక్తులు అతడిని రహస్యంగా దేశం దాటించారనే వార్తని ‘లింకన్ కాన్స్పిరేసీ’ అనే పుస్తకంలో రాయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. 

ప్రత్యేకాంశాలు.. 

అధ్యక్ష ఎన్నికలు జరగక ముందు.. అబ్రహం లింకన్‌కు అంత గడ్డం ఉండేది కాదు. ఇది గమనించిన ఓ పదకొండేళ్ల గ్రేస్‌ బెడెల్‌ అనే చిన్నారి ఏకంగా అబ్రహం లింకన్‌ను ఉద్దేశిస్తూ ఓ లేఖ రాసింది.  అందులో.. ‘మీరు దేశాధ్యక్షుడు అవ్వాలని నేను కోరుకుంటున్నా.. నాకు నలుగురు సోదరులున్నారు. మా నాన్న కూడా మీకే ఓటు వేస్తారు. వీరితోపాటు వీలైనంత ఎక్కువమందితో మీకే ఓటు వేయిస్తాను. అయితే, ఒక్క విషయం.. మా నాన్న మీ ఫొటో ఒకటి ఇంటికి తీసుకొచ్చారు. అందులో మీరు చాలా బక్కగా కనిపిస్తున్నారు. గడ్డం పెంచుకుంటే గనుక చక్కగా కనిపిస్తారు. నిజానికి, మహిళలు గడ్డం ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మీరు గడ్డం పెంచుకుంటే.. మహిళలు తమ భర్తల్ని మీకే ఓటు వేయమని చెబుతారు. మొత్తానికి మీరు ఎన్నికల్లో గెలిచి, దేశాధ్యక్షుడు అవ్వొచ్చ’ని లేఖ రాసింది. 

ఈ లేఖ అందుకున్న నాలుగు రోజులకే అబ్రహం లింకన్ స్వయంగా స్పందించారు. లేఖలో.. ‘‘ప్రియమైన గ్రేస్ బెడెల్‌, నీ లేఖ నాకు అందింది. ఇది ఎంతో అంగీకార యోగ్యమైనది. అయితే నాకు నీలాంటి కూతుళ్లు లేనందుకు చింతిస్తున్నాను. నాకు ముగ్గురు కుమారులున్నారు. వాళ్లు వాళ్ల అమ్మతో ఉన్నారు. ఇక గడ్డం విషయానికొస్తే.. నేనెప్పుడు దానిని పెంచలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు పెంచుకుంటే ప్రజలు నన్ను చూసి వెర్రితనం అనుకుంటారని నువ్వు భావించలేదా? ఏదేమైనా నువ్వు నా శ్రేయోభిలాషివి’’ అని సమాధానమిస్తూ ముగించారట.

అయితే, ఆ రోజునుంచి చిన్నారి సలహా మేరకు, అబ్రహం లింకన్‌ గడ్డం పెంచుకోవడం మొదలుపెట్టారట. అధ్యక్షుడయ్యే సమయానికి  పూర్తి గడ్డంతో ఉన్నారు. 1861 ఫిబ్రవరి నెలలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తూ న్యూయార్క్‌లోని వెస్ట్‌ఫీల్డ్‌లో ఆగి.. చిన్నారి గ్రేస్‌ను కలిసి పలకరించడం, ఆమెతో ‘చూశావా? నీకోసమే ఈ గడ్డం పెంచుకున్నాన’ని అన్నారట.

ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి.. లింకన్. అందుకే నలుపు, తెలుపు భేదాలను అంగీకరించలేకపోయాడు. దేశంలో నల్లవారు బానిసత్వంలో మగ్గుతుంటే సుస్థిరాభివృద్ది ఎక్కడుంటుందని ప్రశ్నించాడు. అందుకే.. దేశంలో బానిసత్వం, వర్ణవివక్షను రూపుమాపుతానని ఎప్పుడు చెప్తుండేవాడు. 

‘ది డివెడైడ్ స్పీచ్’ పేరుతో ఆయన చేసిన ప్రసంగం అమెరికన్ల భవితవ్యాన్ని ఎంత గొప్పగా మార్చివేసిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈయన పిలుపు చాలామందిని కదిలించింది. వారి ప్రోత్సహంతోనే అమెరికా అధ్యక్షుడయ్యేలా చేసింది.

తన చిన్నతనంలో నీతి, న్యాయాన్ని ఎన్నటికీ తప్పనని తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం.. లాయర్ వృత్తిని చేపట్టిన క్రమంలో ఒకానొక కేసు వాదిస్తున్నప్పుడు.. తన క్లయింట్ దే తప్పు అని తెలిసినపుడు నీతి విడవకుండా వారికి పక్కాగా శిక్షపడేలా చేశాడంటే.. ఆయన నిజాయతీ ఎంత గొప్పదో గుర్తించాలి. 

ప్రతి ఒక్కరికీ ఆత్మ గౌరవం ఉంటుందనే విషయాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన గొప్ప వ్యక్తి.

Show More
Back to top button