CINEMAGREAT PERSONALITIESTelugu Cinema

సంగీత స్వర ప్రభంజనం.. భారత కోకిల.. యస్.జానకి

అఖండ సంగీత సామ్రాజ్యాన్ని మకుటంలేని మహారాణుల్లా ఏలుతున్నవారు, దశాబ్దాలుగా అమృతమంటి గానామృతంతో సినీ, సంగీత ప్రియులను ఓలలాడిస్తున్నవారు ఇద్దరు. ఒకరు యస్.జానకి, ఇంకొకరు పి.సుశీల.. అందుకే కవి “కోకిలమ్మ బడాయి చాలించుమా.. సుశీల, జానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా..” అంటూ ఇద్దరు గాన సరస్వతుల గొప్పతనానికి అందమైన బాణీ కడితే అది ప్రేక్షకులకు పసందైన వీణుల విందునందించింది. నిజానికి ఆ కవి బాణీలలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. పి.సుశీల, యస్.జానకి లలో, ఎస్‌. జానకి స్వరం మరింత ప్రత్యేకం. ఆ సంగీత రాజ్ఞి, స్వర ప్రభంజనం అనన్య సామాన్యం. ఆమె గొంతు విప్పితే ప్రకృతి కూడా తన్మయత్వంలో మునిగిపోతుంది.

★★★★★★★★★★★★

“గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన”.. పసిబిడ్డ పాడుతోందా అనిపిస్తుంది.

“నీ లీల పాడెద దేవా” పాటలో కంఠంలో దైవత్వం ఉట్టిపడుతుంది..

“పగలే వెన్నెల జగమే ఊయల” గొంతుతో చల్లటి వెన్నెల కాంతిలో విహారిస్తున్నట్టు తోస్తుంది..

“అలకపానుపు నెక్కలేల చిలిపి గోరింక”.. పాటలో ముసలమ్మను పట్టి తేవడం కూడా సాధ్యమే అనిపిస్తుంది.

“పాప పేరు మల్లి, మా ఊరు కొత్త ఢిల్లీ” పాటలో మగవాడు పాడినట్టుంటుంది.. అది స్వర పేటికా లేక సర్వపేటికా. ఏ పాటయినా, ఏ రాగమయినా ఈ గొంతులో ఇట్టే ఇమిడిపోతుంది.

బహుముఖ ప్రజ్ఞ కు నిదర్శనం ఎస్.జానకి..

అనేక భాషలలో తెలుగువారి గళ మాధుర్య రుచిని తెలిపి మన కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సర్వసుధామయి..

★★★★★★★★★★★★

ఆమె గొంతు విప్పితే అమ్మ ఒడిలో తలవాల్చిన పసిపాప హాయిగా నిద్రలోకి జారిపోతుంది. ఆమె పాడడం మొదలుపెడితే వాన చుక్క కురవకుండానే నెమలి సైతం పరవశంతో నాట్యమాడేస్తుంది. ఆమె స్వరం వినబడితే విరిగి నలిగిన కల్లోలిత హృదయాలు సైతం ప్రశాంతమైన స్వర్గసీమలోకి వెళ్ళిపోతాయి. ‘‘జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తేనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా..’’ అని జానకమ్మ గురించి ఇళయరాజా గారు ఓ తమిళ పత్రికలో పై విధంగా చెప్పారు. “పదహారేళ్ల వయసు” చిత్రంలో “కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే”.. పాటలో పండు ముసలావిడ లాగా.. “స్వాతిముత్యం” లో “చిన్నారి పొన్నారి కిట్టయ్యా”.. అంటూ చిన్నారి గొంతుతో.. రకరకాల గొంతులతో గీతాలు ఆలపించి తనకు సాటి ఎవరూ లేరని, తనది ప్రత్యేక స్వరం అని నిరూపించుకుంది.

తన సినీ ప్రస్థానంలో తిరుగులేని గాయనిగా, సంగీత దర్శకురాలిగా ఆమె ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 50,000 పైగా గీతాలను ఆలపించారు. ఉత్తమ గాయనిగా 4 జాతీయ పురస్కారాలు, వివిధ రాష్ట్రాల్లో ఉత్తమగాయనిగా 31 సార్లు పురస్కారాలు అందుకున్నారు ఎస్‌.జానకి గారు.

జీవిత విశేషాలు.

  • జన్మ నామం : శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి..
  • ఇతర పేర్లు : అమ్మ , కర్ణాటక కొలిగె , జానకమ్మ , కోయిలమ్మ
  • జననం : 23 ఏప్రిల్ 1938 (వయసు 84)
  • స్వస్థలం : రేపల్లె, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో
  • సంగీత శైలి : నేపథ్యగానం, కర్ణాటక సంగీతము
  • వృత్తి : గాయని ,సంగీత దర్శకురాలు
  • క్రియాశీల కాలం : 1957–2017
  • జీవిత భాగస్వామి : వి.రామప్రసాద్ (m.1958–1997)
  • పిల్లలు : మురళీకృష్ణ
  • బంధువులు : గరిమెళ్ళ బలకృష్ణప్రసాద్..

జననం.

జానకి గారు 23 ఏప్రిల్ 1938 నాడు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సరస్వతి దంపతులకు జన్మించారు. మా నాన్న శ్రీరామమూర్తి గారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఇంటిపేరు సిస్ట్లా. జానకి వాళ్ళు మొత్తం తొమ్మిది మంది సంతానం. అందులో ఆరుగురు అక్క చెల్లెళ్లు. జానకి గారు నాలుగో వ్యక్తి. జానకి కుటుంబంలో అందరూ విద్యావంతులే. జానకి గారికి చిన్నప్పటి నుంచి చదువుపై శ్రద్ధ ఉండేది కాదు. అసలు బడికి సరిగ్గా వెళ్లలేదు. రేడియోలో పాటలు వినడం అంటే మాత్రం తనకు బాగా సరదా.

తనకు ఊహ తెలిసినప్పటి నుంచి పాడుతూనే ఉన్నారు. జానకి గారి కుటుంబం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోనూ, ఆ తర్వాత రాజమండ్రి లోనూ ఉన్నారు. రాజమండ్రిలో ఉండే రోజుల్లో జానకి గారి అమ్మ గారి ప్రోత్సాహంతో, ఒక రకంగా బలవంతంతో నాదస్వర విద్వాన్ శ్రీ గాడవల్లి పైడిస్వామి దగ్గర గాత్రం శాస్త్రీయ సంగీత శిక్షణ తీసుకున్నారు. ఎంతసేపు జానకి గారి ధ్యాసంతా సినిమా పాటల పైన ఉండడంతో సంగీత శిక్షణ తనకు ఓ శిక్ష లాగా అనిపిస్తుండేది. లతాజీ, ఆశాంభోస్లే పాటలు తప్ప వేటిని కూడా పట్టించుకునే వారు కాదు.

కచేరీలలో పాటలు పాడుతూ..

అప్పట్లో రాజమండ్రిలో “క్రాంతి కళామండలి” అనే కల్చరల్ యూత్ అసోసియేషన్ ఉండేది. దాని నిర్వాహకులు వి.రామచంద్ర రావు గారు (సినీ దర్శకులు). ఈ అసోసియేషన్ తరపున సినిమా పాటల కచేరి లో జానకి గారు పాడేవారు. కళాశాల ఉత్సవాలలో తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ పాటలు పాడేవారు. జానకి గారు సినిమా పాటలు పాడుతుంటే అందరూ రికార్డ్స్ వేశారని అనుకునేవారట. కే.ఎల్.నరసింహారావు గారు, పంపన సత్యనారాయణ గారు అప్పట్లో జానకి గారితో కలిసి పాడేవారు. జానకి గారికి చిన్నప్పటినుంచి కూడా భయం ఉండేది కాదు. ఎంతమంది ముందైనా బిడియం, భయం లేకుండా పాడేసేవారు. సంగీత కచేరిలకు వెళ్లడం ఆమె గాత్ర శుద్ధికి ఎంతో తోడ్పడింది.

ఒకసారి విజయనగరంలో లైట్ మ్యూజిక్ కచేరి చేస్తూ “తెనాలి రామకృష్ణ” చిత్రంలో పి.సుశీల గారు పాడిన “చందన చర్చిత నీల కళేబర” అన్న జయదేవుని అష్టపది పాడారు. శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. ఒక పెద్దాయన వేదిక మీదకు వచ్చి చాలా బాగా పాడావమ్మా. నీకు నా ఆశీస్సులు అని దీవించి వెళ్లిపోయారు. ఆయన ఎవరో కాదు పి.సుశీల గారి తండ్రి గారు. జానకి గారి అమ్మ గారు చనిపోవడంతో ఆవిడ వాళ్ళ అక్కయ్యల దగ్గరికి హైదరాబాద్ వచ్చేశారు. జానకి గారి బావ జి.నరసింహారావు గారు ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారికి పరిచయం చేశారు. జానకి గారి జీవితాన్ని ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు అంటే జానకి గారి మామగారు ఒక మలుపు తిప్పారని చెప్పుకోవచ్చు. ఆయనతో చుట్టరికం కన్నా జానకి గారికి చనువు ఎక్కువగా ఉండేది.

నెల్లూరు, హైదరాబాదులలో ఆయన ప్రదర్శనలు ఇచ్చేవారు. వేదిక మీద రెండే రెండు నిమిషాల్లో వేషాలు మార్చుకొని గాంధీ, నెహ్రూ, జాకీర్ హుస్సేన్ లను అనుకరించేవారు. ఆయన మేకప్ మార్చుకునే రెండు నిమిషాల వ్యవధిలో జానకి గారు పాటలు పాడేవారు. “సంతానం” చిత్రంలో లతా మంగేష్కర్ గారు పాడిన “నిద్దురపోరా తమ్ముడా”, నాగిన్ (హిందీ)లో “మేర దిల్ యే పుకారే” వంటి పాటలు పాడేవారు. ఆ హాలులోని జనమంతా పరవశించిపోయేవారు.

ఏ.వి.యం. ద్వారా సినీ రంగ ప్రవేశం.

జానకి గారు చంద్రశేఖర రావు గారితో సంగీత కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆయన అబ్బాయి వి.రాంప్రసాద్ (తర్వాత ఆయన జానకి గారి భర్త గారు అయ్యారు) జానకి ఇంత గొప్పగా పాడుతుంది. తను ఇలాగే ఉండిపోకూడదు. సినిమాల్లోకి పంపిస్తే పెద్ద గాయని అవుతుంది. కాబట్టి మనమే ఏదో ఒకటి చేయాలి అనేవారు. ఆయన మాట మీదనే జానకి గారి మామగారు మా దగ్గర ఒక అమ్మాయి ఉంది. చాలా బాగా పాడుతుంది. మీరు కావాలనుకుంటే పిలవచ్చు అని మూడే మూడు పంక్తులు జెమిని ఏ.వీ.ఎం స్టూడియోకి ఉత్తరాలు వ్రాశారు. ఏ.వీ.ఎం స్టూడియో నుండి వెంటనే జవాబు వచ్చింది ఆడిషన్ కు రండి అని. జానకి వాళ్ళు అప్పుడు నెల్లూరులో ఉన్నారు.

జానకి గారు మద్రాసు వెళ్లి ఏ.వీ.ఎం స్టూడియోలో టెస్ట్ కోసం పాట పాడారు. లతా మంగేష్కర్ గారు పాడిన “రసిక్ బల్ మా” గీతాన్ని పాడారు. ఆ పాట విని గాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పి వెంటనే స్టాఫ్ ఆర్టిస్ట్ గా నెల జీతానికి చేర్చుకున్నారు. సంగీత దర్శకులు ఆర్.సుదర్శనం, గోవర్ధనం గార్లు అప్పుడక్కడ పర్మనెంట్ స్టాప్. జానకి గారి పాటలు విని తనను సెలెక్ట్ చేసింది వారే. ఘంటసాల గారితో కలిసి ఎమ్మెల్యే చిత్రం కోసం “నీ ఆశ అడియాస చేయి జారే మణిపూస, బ్రతుకంతా అమావాస, లంబాడోళ్ళ రాందాస అనే విషాదగీతం పాడారు. ఆ ఏడాదిలో ఆరు భాషల్లో సుమారు 600 పాటలు పాడారు.

నీలి మేఘాలలో పాటతో పాపులరిటీ.

తర్వాత “నీలి మేఘాలలో గాలి కెరటాలలో” బావ మరదలు పాట బాగా ప్రసిద్ధి గాంచడంతో మరింత బిజీ అయిపోయారు జానకి గారు. ఆ సమయంలో నాకు పరిశ్రమ మిగిల్చిన ఒక తీపి జ్ఞాపకం మీకు చెప్తాను మురిపించే మువ్వలు చిత్రానికి సంబంధించిన సంఘటన అది అందులో “నీలీల పాడెద దేవా” అనే పాట పాడారు. ఆ పాటకు తమిళ మాతృకైన “సింగార వెలనే దేవా (కొంజుం సలంగై) దక్షిణ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. తమిళంలో కూడా జానకి గారే పాడారు. మొదటి తమిళమే వచ్చింది.

ఆ పాటలోని ప్రత్యేకతలు ఏమైనా చెప్పుకోవాల్సి వస్తే సుబ్బయ్య నాయుడు గారి అపార ప్రతిభ గురించి చెప్పుకోవాలి అంతవరకు నాదస్వరంతో మానవకంఠాన్ని మేలవించడానికి నాదస్వరంతో ఎవరు ప్రయత్నించ సాహసించలేదు. అలాంటి పరిస్థితుల్లో సుబ్బయ్య నాయుడు గారు అలాంటి మహోత్కృష్ట సృష్టి చేశారంటే అదే ఒక వినూత్న ప్రయోగమే అని చెప్పుకోవచ్చు. అసలా పాట అంత నిర్దిష్టంగా ఉండడానికి సుబ్బయ్య నాయుడు గారు తీసుకున్న శ్రమ అంతా ఇంతా కాదు. మొదట నాదస్వర విద్వాన్ కురిచ్చి అరుణాచలం గారితో రికార్డులో నిలబడి నాదస్వర భాగాలన్నీ జాగాలుంచి రికార్డు చేశారు.

సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చేవి. చాలా బిజీ అయిపోయారు. మూడేళ్లు అనుకున్న ఏ.వి.యం వారి కాంట్రాక్టు పది నెలలకే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళు స్టాఫ్ కాకపోయినా కూడా ఏ.వి.యం వాళ్లు ఎంతగానో అభిమానించి ప్రోత్సహించేవారు. “మూగనోము” లేదా “లేతమనసులు” చిత్రాల్లోనూ పాడారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, పంజాబీ, ఒరియా, తుళు, ఇంగ్లీషు, సంస్కృతం, జపాన్, జర్మన్ ఇలా మొత్తం 17 భాషలలో 16 వేలకు పైగా పాటలు పాడారు. వీటిలో 15000 సినిమా పాటలు ఉంటాయి. మిగతావి ప్రైవేట్ రికార్డులు. తెలుగు భాషలో కన్నా మలయాళం, తమిళంలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తాను కన్నడంలో పి.బి.శ్రీనివాస్ గారితో కలిసి చాలా పాటలు పాడారు.

పెండ్యాల గారి సంగీతంలో ఘంటసాల గారితో కలిసి జానకి గారు మొదటిసారిగా పాడారు. అదేవిధంగా ఘంటసాల గారితో ఆవిడ గారు పాడిన చివరి పాట కూడా పెండ్యాల గారి సంగీతంలోదే. “దీక్ష” చిత్రంలో “నాన్న అనే రెండు అక్షరాల మాట” పాట పాడారు ఘంటశాల గారు. తన ఆరోగ్యం బాగా అప్పటికే దెబ్బతిన్నా చాలా బాగా పాడారు. పాట రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఏడ్చేశారు. అంత ఫీల్ అయ్యి పాడారు ఆ పాటను. ఈ పాట నా తర్వాత మా పిల్లలు పాడుకుంటారేమో అని అన్నారు. జానకి గారు తాను పాడిన పాటల్లో తనకు నచ్చిన పాటలు చాలానే ఉన్నాయి.

డబ్బింగ్ మరియు సంగీత దర్శకత్వం.

ఇళయరాజా గారు జానకి గారిని బాగా ప్రోత్సహించేవారు. ఆయన మొదటి సినిమా అన్నక్కిళి (తమిళం) లో టైటిల్ సాంగ్ అన్నకక్కిళి ఉన్నత్తేడుదే (తెలుగులో రామచిలుకా పెళ్ళికొడుకు ఎవరే) జానకి గారే పాడారు. అందులో తాను పాడిన “మచ్చానై ప్పార్తీం గళా”, “పచ్చ సాంబ” పాటలు కూడా రికార్డుల అమ్మకంలో రికార్డులు సృష్టించాయి. తాను రెండు చిత్రాలకు డబ్బింగ్, ఒక చిత్రానికి దర్శకత్వం చేశారు. ఉషాకిరణ్ మూవీస్ వారి “చందమామ రావే”, “జడ్జిమెంట్” చిత్రాల్లో బేబీ సుజితకు డబ్బింగ్ చెప్పారు.

ఉషాకిరణ్ మూవీస్ వారు గట్టిగా పట్టుబడితే తప్పనిసరియై “మౌన పోరాటం” చిత్రానికి సంగీత దర్శకత్వం చేశారు. సంగీత దర్శకత్వం అనేది పూర్తిగా మెదడుకు పదును పెట్టి, చాలా సమయం కేటాయించి, ఓపికగా చేయాల్సిన పని. అది జానకి గారికి కుదిరేది కాదు. ఎందుకంటే పాటలు పాడడానికి సమయం సరిపోదు. ఇక మ్యూజిక్ కంపోసింగ్ కి సమయం కేటాయించడం ఎలా సాధ్యమవుతుంది. అందువల్ల ఆ ఆలోచనను విరమించుకున్నారు. కానీ త్యాగరాజ కృతులు, సూరదాస్ కబీర్ దాస్, మీరా భజన్స్ సొంత సంగీత దర్శకత్వంలో పాడారు. తిరువయ్యురు లో త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాల సందర్భంగా వరుసగా మూడేళ్లు గాత్ర కచ్చేరి చేశారు. నాదస్వరంతో డోలు కలిపి ఒక ప్రయోగం చేశారు. అలా అంతవరకు ఎవరూ చేయలేదు.

జానకి గారి అన్న కొడుకు జి.బాలకృష్ణ ప్రసాద్ (అన్నమాచార్య ప్రాజెక్టు గాయకుడు) స్వర సారథ్యంలో ఎన్నో అన్నమాచార్య సంకీర్తనలకు పాడారు. తాను స్వయంగా సంగీతం సమకూర్చుకున్న “కృష్ణ రవళి” ని సంగీతం వాళ్లు విడుదల చేశారు. జానకి గారు పెద్దగా చదువుకోలేదు. కానీ చదువుకోలేదు అంటే ఎవ్వరూ నమ్మరు. బొమ్మలు కూడా వేస్తారు. ఎక్కువగా దైవభక్తి గీతాలు వ్రాశారు. శ్రీకృష్ణుడు, సాయిబాబాలపై ఎక్కువగా వ్రాశారు. ఇదంతా ఎలా సాధ్యమైందో తనకే తెలియదు. గతంలో ఓ తమిళ చిత్రానికి “కన్నా నీ యొంగి” అనే పాట వ్రాశారు. ఆ పాటను తెలుగులోకి అనువాదం చేసి “కృష్ణా నువ్వెక్కడ” అంటూ ప్రియా పచ్చళ్ళు ప్రకటనలలో ఆ పాటను పాడారు.

వివాహం.

యస్.జానకి గారు నేపథ్య గాయనిగా ఎదిగి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం వెనక తన భర్త సహకారం ఎంతో ఉంది. తాను ఏం చేసినా ఎంత సాధించినా భర్త చాటు భార్యనే. వారిది ప్రేమ వివాహం. వైద్యుల రాంప్రసాద్ గారు తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జానకి గారు కూడా వైద్యుల రాంప్రసాద్ గారిని ప్రేమించారు. మొదట్లో అది ప్రేమని తెలియదు. చంద్రశేఖర్ గారి కుటుంబంతో ఆమెకు అనుబంధం పెరిగిపోవడంతో రాంప్రసాద్ గారు అంటే తనకు సహజంగానే ఇష్టం ఏర్పడింది. ఎవరికి తెలియకుండా అతని ఫోటో కూడా సంపాదించి తనవద్ధ ఉంచుకున్నారు. పైకి జానకి గారు మాత్రం ఏమీ పట్టనట్టే ఉండేవారు. వారికేమైనా పెళ్లి సంబంధాలు చూస్తుంటే తాను కూడా వెళ్ళేది. ఒకరోజు అనుకోకుండా ఆవిడ గారు దాచుకున్న ఫోటో వాళ్ళ ఇంట్లో బయటపడింది.

దాంతో తాను రాంప్రసాద్ గారిని ప్రేమిస్తున్న విషయం తెలిసిపోయింది.

దాంతో జానకి, రాంప్రసాద్ గార్ల వివాహం జరిగిపోయింది.

ఒకేరోజు నాలుగు స్టూడియోలకు వెళ్లడం, వేరువేరు భాషల్లో నాలుగైదు పాటలు పాడడం, ఏమైనా నచ్చకపోతే నేను పాడనని చెప్పడం, పారితోషికం విషయాలు రాంప్రసాద్ గారు తన వెన్నంటే ఉండి అన్ని చూసుకునేవారు.

తనకు ఏమాత్రం శ్రమ కలిగించే వారు కాదు. కష్టాలు, ఒత్తిళ్ళు ఏమీ లేకుండా చూసుకునేవారు.

ఆవిడ గారు కూడా అంతే రాంప్రసాద్ గారిని ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవారు కాదు.

అంతలా తన భర్త సహకారం ఉంది గనుకనే తాను అన్నేళ్లు పరిశ్రమలో కొనసాగారు.

ఆవిడ అత్త శకుంతల బాయి గారు కూడా జానకి గారిని చాలా బాగా చూసుకునేవారు. జానకి, రాంప్రసాద్ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు.

జాతీయ పురస్కారాలు.

  • 1977 సంవత్సరంలో “16 వయతినిలే” తమిళం చిత్రం లోని “సెంతూర పూవే ” పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారం వరించింది.
  • 1981 సంవత్సరంలో ఒప్పోల్ అనే మళయాళం చిత్రంలోని “ఎత్తుమనూర్ అంబలతిలే” అనే పాటకు గానూ ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారం లభించింది.
  • 1984 వ సంవత్సరంలో “సితార” తెలుగు చిత్రంలోని “వెన్నెల్లో గోదారి అందం” పాటకు గానూ ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.
  • 1992 వ సంవత్సరంలో “దేవర్ మగన్” తమిళం చిత్రంలోని “ఇంజి ఇదిప్పాజగా ” పాటకు గానూ ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారం దక్కించుకున్నారు.

నంది పురస్కారాలు.

యస్.జానకి గారు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులను 10 సార్లు అందుకున్నారు.

  • 1980 వ సంవత్సరంలో ” శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం” చిత్రానికి గానూ నంది పురస్కారాన్ని చేజిక్కించుకున్నారు…
  • 1981 వ సంవత్సరంలో “సప్తపది” చిత్రానికి గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు..
  • 1983 వ సంవత్సరంలో “సితార” చిత్రంలోని “వెన్నెల్లో గోదారి అందం” పాటకు గానూ నంది బహుమతిని గెలుచుకున్నారు..
  • 1985 వ సంవత్సరంలో “ప్రతిఘటన” చిత్రంలోని ” ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో” పాటకు గానూ నంది పురస్కారాన్ని స్వీకరించారు…
  • 1986 వ సంవత్సరంలో “అరుణ కిరణం” చిత్రానికి గానూ నంది పురస్కారాన్ని దక్కించుకున్నారు..
  • 1988 వ సంవత్సరంలో “జానకి రాముడు” చిత్రానికి నంది పురస్కారం లభించింది..
  • 1994 వ సంవత్సరంలో “భైరవద్వీపం” చిత్రంలోని “నరుడా ఓ నరుడా ఏమి కోరికా” అనే పాటకు గానూ నంది పురస్కారం వరించింది.
  • 1997 వ సంవత్సరంలో “తోడు” చిత్రంలోని “నదిలా ప్రవహించేదే జీవితం” పాటకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు..
  • 1998 వ సంవత్సరంలో “అంతఃపురం” చిత్రంలోని “సూరీడు పువ్వా జాబిల్లి గువ్వా” పాటకు గానూ నంది పురస్కారాన్ని దక్కించుకున్నారు.
  • 2000 వ సంవత్సరంలో ” శ్రీ సాయి మహిమ” చిత్రానికి గానూ నంది పురస్కారాన్ని స్వీకరించారు..

ఇతర పురస్కారాలు.

  • 1986 వ సంవత్సరంలో “కలైమామణి” అవార్డు వరించింది ..
  • 1997 వ సంవత్సరంలో ఫిలింఫేర్‌ దక్షిణ భారత సాహిత్య అవార్డు
  • 2002 వ సంవత్సరంలో ఎచీవర్‌ అవార్డు దక్కించుకున్నారు..
  • 2005 వ సంవత్సరంలో “స్వరాలయ జేసుదాసు” ప్రత్యేక పురస్కారంను అందుకున్నారు..
  • 2009 వ సంవత్సరంలో గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు..
  • 2011 వ సంవత్సరంలో కర్నాటక “బసవభూషణ్‌” అవార్డు వరించింది..
  • 2012 వ సంవత్సరంలో నిత్యనూతన గాత్రంగా విజయా మ్యూజికల్‌ అవార్డు అందుకున్నారు..
  • 2013 వ సంవత్సరంలో మా మ్యూజిక్‌ జీవిత సాఫల్య అవార్డును చేజిక్కించుకున్నారు..
  • 2015 వ సంవత్సరంలో సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును దక్కించుకున్నారు..

వీటితో పాటు కేరళ రాష్ర్ట ఉత్తమ గాయనిగా 11 అవార్డులు, ఒరియా సినీ అవార్డుల్లో ఉత్తమ నేపథ్య గాయనిగా, తమిళనాడు సినీ అవార్డులు 7, దక్కించుకుంది..

జానకి గారి గురించి ఇళయరాజా గారు ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ.

ఆమె దినామూ కొన్ని లీటర్ల తేనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా” అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించారు…

సశేషం.

యస్.జానకి గారికి ఒక్కడే కొడుకు వి.మురళీకృష్ణ. వివాహితుడు. ఆమె కోడలు మంచి నృత్యకారిణి. కూచిపూడి, భరతనాట్యం రెండింటిలోనూ నిష్ణాతురాలే. ఆమెకు కూడా “కలైమామణి” అవార్డు వచ్చింది.

“యువ కళా భారతి” వంటి అవార్డులను పొందింది. జానకి గారి కోడలు దూరదర్శన్ లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ కూడా.

కొడుకు మురళీకృష్ణ కూడా నటుడు. కొన్ని సినిమాల్లో నటించారు.

“శృతిలయలు” చిత్రంలో సత్యనారాయణ కొడుకులలో ఒకడుగా నటించాడు. చెన్నైలో ఒక ఆడియో క్యాసెట్స్ షాప్ కూడా నడుపుతుండేవాడు.

భర్త అంటే విపరీతమైన ప్రేమ వున్న జానకి గారు తన భర్త మరణాన్ని తట్టుకోలేకపోయారు. రాంప్రసాద్ గారికి మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.

జానకి గారికి రికార్డింగ్ లు జరుతున్నాయి. “కార్తీకదీపం” సినిమా పాటల రికార్డింగ్ జరుగుతుంది. అందులో “నీ చేతులలో తలవాల్చి” అనే పాట ఉంది.

ఆ పాటను ఆయనను తలుచుకుంటూ అదే భావనతో పాడారు. కానీ విధి వైపరీత్యం జానకి గారు తన భర్తను తన కళ్ళముందే కోల్పోవలసి వచ్చింది.

భర్త ఇచ్చిన స్ఫూర్తితోనే తను ముందుకు సాగిపోయేవారు.

ఎప్పుడో కట్టుకున్న పాత భవంతిని అమ్మేసి, చెన్నైలోనే నీలాంగరి ప్రాంతంలో “సాయి కృప” అనే పెద్ద భవంతిని కట్టుకొని హాయిగా ఉన్నారు.

మొదటి నుంచి కూడా తనకు ఒకటే కోరిక. అప్పటికి, ఇప్పటికీ ఏ సంగీత దర్శకుడైన సరే వారు ఏ స్థాయిలో కోరుకుంటే ఆ స్థాయిలో పాడాలని.

ఆ ఆశ, ఆశయాలే తన గళంలో ఎప్పటికప్పుడు తాజాతనాన్ని పలికించగలుగుతుంది.

Show More
Back to top button